విద్యాధికుడు, వృత్తిరీత్యా కళాశాలలో రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు, అన్నిటికి మించి తెలుగు కథానికకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శతాధిక కథల రచయిత పాలగుమ్మి పద్మరాజు. `గాలివాన`కథానికతో తెలుగు కథకు అంతర్జాతీయ ప్రతిష్ఠ తీసుకొచ్చిన ఆయనే గోదావరిపై పడవ ప్రయాణం కథతో పాఠకులలో మధురానుభూతిని నింపారు. గోదావరిపై ప్రయాణం ఇంచుమించు అందరి కల. జీవితంలో ఒకసారైనా అలానీటిపై పడవ ప్రయాణం చేయాలను కుంటారు.`పాఠకుల అదృష్టం కొద్దీ పాలగుమ్మి పద్మరాజు గారొక కథ (గాలివాన) వ్రాశారు. `గాలివాన` కథానిక 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీకి ఎంపికైంది. మొత్తం 23 దేశాలకు చెందిన 59 కథలు ఎంపిక కాగా,వాటిలో మన దేశానికి సంబంధించి `గాలివాన` సహా మూడు కథలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అనేక భాషాలలోకి తర్జుమా అయింది.
తెలుగు కథకు అంతర్జాతీయంగా గౌరవం తేవడంతో పాటు `పడవ ప్రయాణం` వ్రాసి పాఠకుల హృదయాల్లో గోదావరిపైన పడవ ప్రయాణాన్ని గురించిన మధురాను భూతిని ప్రోగు చేసినందుకు గూడా ఆయన అభినంద నీయులు`అని ప్రఖుఖ కథారచయిత మధురాంతకం రాజారాం దాదాపై ఐదు దశాబ్దాల క్రితం శ్లాఘించారు. అంటే ప్రస్తుతం వస్తున్న `గోదావరి కథల`కు పాలగుమ్మివారి `పడవ ప్రయాణం`(1945)చుక్కానిగా నిలిచిందని చెప్పవచ్చేమో.` పడవ ప్రయాణం’ కథతో పాలగుమ్మి మరణానంతరం `స్త్రీ` పేరుతో సినిమా నిర్మితమైనా వ్యాపార పరంగా విడుదలకు నోచుకోలేదు.
Also Read: ఆర్థికశాస్త్ర నిపుణుడు `వీఎస్`
బాల్యం, విద్య:
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని తిరుపతిపురం గ్రామంలో 1915 జూన్ 4వ తేదీన జన్మించిన పాలగుమ్మి పద్మరాజు బాల్యంలోనే తండ్రిని కోల్పోయి అయిదుగురు సోదరులతో తాత గారింటికి చేరారు. కుటుంబంలో పెద్దవాడుగా సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే బి.ఎస్సీ పట్టభద్రులయ్యారు. బెనారస్ విశ్వ విద్యాలయంలో ఎంఎస్సీ (రసాయనశాస్త్రం)అభ్యసించారు.
ఉద్యోగ ప్రస్థానం :
ఎం.ఎస్సీ పట్టభద్రులైన తరువాత కాకినాడలోని పీఆర్ కళాశాలలో కొంతకాలం ఉపన్యాసకుడిగా పనిచేసి భీమరం కళాశాలకు వెళ్లారు.(`ఆకాశవాణి`లో సంగీత విభాగంలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన విశ్వనాథం ఆయన తమ్ముడే)
రచనా వ్యాసంగం….
విద్యార్థి దశలో రాసిన కవితలు, పద్యాలు కొంతవరకు ఆర్థిక వెసులుబాటును కల్పించాయి.14 ఏళ్ల వయస్సులో తిరుపతి కవులుగా ప్రసిద్ధులైన వారిలో ఒకరు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారిని 14 ఏళ్ల వయసులో దర్శించుకొని, పద్య కవిత్వం వినిపించి వారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతి కవుల స్ఫూర్తితోనే తన మిత్రుడు చాగంటి కామేశ్వరరావుతో కలసి `రాజశేఖర కవులు` పేరిట పద్యాలు, కవితలు అల్లారు. బెనారస్ లో ఎంఎస్సీ చదివే సమయంలో పాశ్చాత్య సాహిత్యం పట్ల ఆకర్షితులై,ఆ ప్రభావంతో పద్య రచనతో పాటు కథానికల వైపు దృష్టి సారించారు. `సుబ్బి` కథ ఆయన తొలి (1937) రచన. 150కి పైగా కథలు, కథానికలు రాశారు. `నల్లరేగడి`(కృష్ణ కథానాయకుడిగా `మన (మా) వూరి కథ’ పేరుతో సినిమా గా వచ్చింది), బతికిన కాలేజీ, `రెండవ అశోకుడి మూణ్ణాళ్ల పరిపాలన, రామరాజ్యానికి రహదారి` తదితర నవలలు, “చచ్చి సాధించాడు` (డిటెక్టివ్ నవల), సావిత్రి, చచ్చిపోయిన మనిషి`లాంటి అనువాద రచనలు చేశారు. .`మనిషికి తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది` అని అనేవారు.
Also Read: గందరగోళం సృష్టిస్తున్న ధర్మాన వ్యాఖ్యలు
సినీ రంగ ప్రవేశం :
ప్రఖ్యాత దర్శకనిర్మాత బొమ్మరెడ్డి నరసింహారెడ్డి (బీఎన్ రెడ్డి)పిలుపు మేరకు `బంగారు పాప` (`1954) చిత్రానికి తొలిసారిగా రచన చేశారు. కళాశాలల ఉపన్యాసకుని ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పటి నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు పలుచిత్రాలకు మాటలు, పాటలు రాయడంతో పాలు పలు చిత్రాలకు రచనా సహకారం అందించారు. `బికారి రాముడు` అనే చిత్రానికి దర్వకత్వం వహించారు.“మీరు ఫలానా దర్శక రచయితకు అజ్ఞాత (ఘోస్ట్) రచయితగా చెప్పు కుంటున్నారేమిటండీ` అని ఈ వ్యాసకర్త పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు, పుత్ర సమానుడి మసులతో చనువుతో అడిగిన ప్రశ్నకు నవ్వేశారు. `చాలా మంది ప్రముఖ రచయితల్లో `అజ్ఞాత కలాలు` లేనివారెవ్వరు? అనీ ప్రశ్నించారు. `మా తరంలోని సముద్రాల-మల్లాది వారి గురించీ ఇలాగే అనేవారు. మల్లాది వారు దానిని ఆమోదిస్తూనే నర్మగర్బంగా బదులిచ్చేవారు.నేనూ అందుకు అతీతుడిని కాను`అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆయన కాలం చేసినప్పుడు అప్పటికే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆయన కాళ్ల దగ్గర కూలబడి విలపించడం చూస్తే పద్మరాజుగారి పరోక్ష ఆమోదం నిజమేనిపించింది. (పాలగుమ్మి-దాసరిది తండ్రీతనయులబంధంగా చెప్పుకునేవారు)అలా విలపిస్తున్న ఆయనను పద్మరాజు గారి అర్థాంగి సత్యానందంగారు ఓదార్చడం వారి ఆత్మీయానుబంధానికి నిదర్శనం. దాసరి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా ఉన్నప్పుడు పాలగుమ్మి గారి వద్ద మెళకువలు నేర్చుకున్నసంగతి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు.
`గాలివాన`నేపథ్యం :
పాలగుమ్మి ఉద్యోగ జీవితంలో కళాశాల యాజమాన్యం ఉచితంగా ఇచ్చిన కొద్దిపాటి జాగాలో నాలుగైదు ఆడుగుల ఇటుక గోడ పైనా తాటాకులతో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓ అర్థ రాత్రి పెద్దపెట్టున వచ్చిన గాలివానకు ఆయన ఇంటితో పాటు సహోద్యోగుల ఇళ్ల పైకప్పులు ఎగిరి పోతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం కూలి పోతున్నాయి. ఇటుక గోడలు కూడా ఊగిపోవడంతో ప్రమాదాన్ని గ్రహించిన పద్మరాజు దంపతులు బయటికి బయలుదేరారు. అయితే ఆయన భార్య సత్యానందం త్వరగా బయటిరాలేకపోయారు. ఈలోగా ఇటుకల గోడలు పడిపోయి, ఇంటి పైకప్పు మొత్తం పెళపెళ మంటూ కూలిపోయి ఆమె ఆ శిథిలాలలో చిక్కుకుపోయారు.దాంతో ఆయనకు విపరీతమైన ఆందోళన. చుట్టూ చీకటి తానొక్కడు ఏమీ చేయలేరు. భార్య పరిస్థితి ఏమిటోననుకుంటూ స్థాణువులా నిలబడి పోయారట. ఈలోగా హాస్టలు విద్యార్థులు, తోటి లెక్చరర్లు టార్చి లైటు వెలుగులో పరుగెత్తుకొచ్చి శిథిలాలు తొలగించి ఆమెను వెలికితీశారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆయనలోని భయాందోళనలు,ఆవేదన, మనసును కలిచిన అనుభవాలు, అనుభూతులతో `గాలివాన`వెలిసింది.
Also Read: వెంకయ్యకు విజయసాయి క్షమాపణ
తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన పాలగుమ్మి జాతీయ చలనచిత్ర అవార్డుల సంఘం జ్యూరీ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లి సుస్తీపడ్డారు. ఆయనకు అప్పటికే ఆస్తమా లక్షణాలు ఉండడంతో విపరీతమైన చలి ప్రభావంతో 1983 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మదరాసులోని మైలాపూర్ శ్మశానవాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయడం అరుదైన సందర్బంగా చెప్పేవారు.
(ఈ నెల 17న `పాలగుమ్మి‘వర్ధంతి)