Wednesday, January 22, 2025

ఎవరు?

ఆకసాన నీలకాంతి లహరుల చిందింపజేయు

వనసీమల హరితకాంతి ఝరులను స్పందింపజేయు

హృద్దేశము వీడి వచ్చి ఊహల ఊయల తేలును

తానల్లిన హరివిల్లున చిక్కని అందాల దాగు

విరబూచిన సుమకాంతల కాంతుల కన్నుల దూరును!

చిత్రకారుడెవరమ్మా?

చిత్తచోరుడెవరమ్మా?

పసిపాపల బోసినోటి నవ్వుల రువ్వుల యందున

చెంపకెంపు సొంపులొలుకు కన్నెల నునుసిగ్గులందు

భామల అందాలలోన కాముని సుమశరములందు

కొండకూడ పిండిజేయు మహాబలుని శక్తియందు

ఇమిడి యున్నదమ్మ వాని సృజనాత్మక వైభవమ్ము

ఆతడె నిర్మించినాడు సర్వభువన భాండమ్ముల!

మహాశిల్పి ఎవరమ్మా?

క్రీడామయుడెవరమ్మా?

ఇదియంతయు అతని సృష్టి! ఇదియంతయు అతని మాయ

ఇదియంతయు అతని నీడ ఇదియంతయు అతని లీల

ఇదియంతయు అతని క్రీడ!

ఆతని పేరది యేమో ఎవ్వరెరుగగలరు చెపుము?

ఆతని ఆవాసమేమొ ఎవ్వరరయ గలరు చెపుము?

అతడు తానశరీరుడొ, అశరీరుండగునొ ఏమొ?

ఒంటిగాడొ, జంటగలదొ, ఎవ్వరి నడుగంగవలయు?

ఇంతి రూపు తాదాల్చునొ

ఇది అరవిందుని “హూ” (WHO) అనే ఆంగ్ల కవితాఖండికకు స్వేచ్ఛానువాదం.

Also read: ఆంధ్రమహాభారతం – తృతీయాశ్వాసం – కచ దేవయాని ఘట్టం – శుక్రాచార్యుడు పునురుజ్జీవితుడు కావడం

ఎవరికీ, ఎట్టి పరిచయమూ చేయవలసిన అవసరం లేని మహాపురుషుడు, అభినవ వ్యాసుడు, బాదరాయణ పరమ ఋషుల కోవకు చెందిన మునిపుంగవుడు, అరవింద ఘోష్. భారతదేశంలోనే గాక   ప్రపంచం నలుమూలలా అజరామరమైన తన తేజస్సు, యశస్సు, విస్తరించిన మహర్షి అరవిందుడు.  అపూర్వ తత్త్వవేత్త, అపురూపకవి, అఖండ త్యాగి, అగణిత దేశభక్తుడు, అనన్య విప్లవకారుడు, పాత్రికేయుడు, బహుభాషాకోవిదుడు, విశ్వమానవుడు అయన. భారతీయ  సాంస్కృతిక పునురుజ్జీవన యుగపు వినీలాకాశంలో ధగధ్ధగాయ మానమైన శోభతో కాంతిల్లిన ధ్రువతారల్లో ఒకడు.

WHO by Sri Aurobindo - YouTube

అరవిందుని ఈ నాటి కవితకు స్వేచ్ఛానుసరణ చేసినవారు ధారా రాధాకృష్ణమూర్తిగారు. ఆయన ప్రముఖ నాట్యావధాని ధారా రామనాథశాస్త్రిగారి తమ్ముడు. స్వయానా  నాట్యావధాని, నటుడు, కవి, రచయిత, వక్త, కళాశాల ఆంగ్లోపన్యాసకునిగా,  ప్రిన్సిపల్ గా పని చేసిన వాడు. తన ఉపదేశగురువు ఎక్కిరాల కృష్ఢమాచార్య సన్నిధిలో యోగవిద్యతో బాటు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణే తిహాసాలు, అభ్యసించిన వాడు.

Also read: ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం- ఉపసంహారం

“ఎవరు” అనే ఈ ఖండిక “వ్యాసుని స్వప్నము” అనే రచయిత కవితాసంకలనం లోనిది. కేవలం పదిహేడు తెలుగు ఖండికలు, ఒక ఆంగ్ల ఖండిక మాత్రమే కలిగిన ఈ సంకలనం మూడు పాయలు గల త్రివేణీ సంగమం.

ఈ  కవితాత్రివేణి మొదటి పాయలో భారతీయ పురాణ ఘట్టాల పునఃకథనం వస్తువు. రెండవ పాయలో రచయిత స్వేచ్ఛానువాదం చేసిన అరవిందుని కవితలే వస్తువు. మూడవ పాయలో వేద ఋక్కులే స్ఫూర్తిగా రచించిన కవితా సంచయమే వస్తువు.

ఆధునిక యుగంలో తెలుగునాట విశ్వకవి రవీంద్రుని ప్రభావం సోకని కవులెవరూ లేరు. కవీ, ఆధ్యాత్మిక వేత్తా ఐన అరవిందుని  ప్రభావం సోకిన కవులు సైతం నవీనాంధ్ర సారస్వతంలో విస్తారంగా వుండడమే విశేషం.

చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాటనే అరవిందుని ప్రభావం తనపై బలంగా పడిన తొట్టతొలి ఆధునికాంధ్ర కవి అబ్బూరి రామకృష్ణరావు గారు. 1912లో తన పదునైదవ ఏట అబ్బూరి వారు రచించిన “జలదాంగన” కవితా సంకలనంలో అరవిందుని రెండు కవితల తర్జుమాలు వున్నాయి. తర్వాతి కాలంలో వెలువడిన ఆయన “ఊహాగానం”లో సైతం అరవిందుణ్ణి కీర్తించే ఖండిక  వున్నది.

Also read: భారతీయ సాహిత్యంలో ప్రశ్న-జవాబు ప్రక్రియ వైశిష్ట్యం

అరవిందుల “సావిత్రి” కావ్యానికి పలు తెనుగుసేతలు వెలువడినవి. సమకాలీన కాలంలో  “సావిత్రి”ని వీడి ఇతరములైన అరవిందుని ఖండికలనే స్వీకరించి తెనుగుసేత చేసిన కొద్దిమంది  కవుల సరసన రాధాకృష్ణమూర్తిగారు చేరతారు.

అరవిందుడు బహుభాషా ప్రవీణుడు. చిన్న నాటనే, తండ్రి  ఆదేశం మేరకు, ఐ.సి.యస్ పరీక్షల కోసం తన సోదరులతో సహా ఇంగ్లండు వెళ్ళి, తన బాల్యం ఎక్కువ భాగం అక్కడే గడిపినాడు. పాశ్చాత్య వాతావరణంలో, ఆంగ్లంతో బాటు లాటిన్, గ్రీక్, జర్మన్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకొనడమే గాక తిరుగులేని ప్రావీణ్యత సంపాదించినాడు. అట్టి వ్యక్తి మాతృభూమికి తిరిగి వచ్చినాక, సంస్కృతం, తదితర భారతీయ భాషల్లోనూ   అపారమైన పాండిత్యాన్ని గడించడం, సనాతన వేదాంతంపై సమగ్ర, సంపూర్ణాధికారం సంపాదించడం విశేషం. అతడే విప్లవవాదిగా రూపొందడం మరొక  ఆశ్చర్యకరమైన పరిణామం.

బరోడా మహారాజు కళాశాలలో ఉపన్యాసకునిగా ఆయన  జీవితం మొదలైంది. వందేమాతరం ఉద్యమంలో విప్లవకారుని పాత్ర వహించి, జైలుశిక్షను అనుభవించడంతో అది మలుపు తిరిగింది. ఆ శిక్షా సమయంలోనే ఆయన అనేక ఆధ్యాత్మికనుభూతులకు లోనైనాడు. ఆ మీదట జాతీయోద్యమాన్ని వీడి పుదుచ్చేరిలో ఆధ్యాత్మిక జీవనాన్ని చేపట్టడం అరవిందుని జీవితంలో మరొక్క మలుపు.  తుదిశ్వాస దాకా సాగిన ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం అరవిందుణ్ణి ఒక మహర్షిగా, క్రాంతదర్శిగా  తీర్చిదిద్ది, ఆయన పవిత్ర స్మృతికి శాశ్వతత్వాన్ని,  అమృతత్వాన్ని ప్రసాదించింది.

అరవిందుని కవితలు, రచనలు, ప్రధానంగా  ఆంగ్ల మాధ్యమంలోనే వెలువడినాయి. భారతీయ వేదాంతంపై ఆయన చేసిన రచనలు శతాధికమైనవి. లోతైనవి. కానీ “సావిత్రి” కావ్యాన్ని రచించడానికి మాత్రం ఆయనకు అర్ధ శతాబ్దం పట్టింది. అక్కడికీ ఆ కావ్యం అసంపూర్ఢంగానే మిగిలిపోయింది.

Also read: నిన్న – నేడు – రేపు

అరవిందుని కవిత్వానికి ఆంగ్ల భాషయే మాధ్యమమైనప్పటికీ, భారతీయతయే దాని ఆత్మ.  ఆయన “సావిత్రి” కావ్యం చదివినప్పుడు పలుచోట్ల మిల్టన్ మహాకవి పారడైజ్ లాస్ట్ కావ్యంలోని కమనీయ కవనధార గోచరిస్తుంది. అరవిందుని కవిత్వం అలౌకికమైన భావనా పరంపరను మనస్సుల్లో రేపి, పఠిత ఆత్మకు ఆనందాతిశయాన్ని కలిగిస్తుంది.

Sri Aurobindo and The Mother - La Grace
Mother and Autobindo

“ఎవరు” కవితాఖండిక సర్వాంతర్యామి యొక్క విరాట్ స్వరూపాన్ని మనచే దర్శింపజేస్తుంది. ఈ విరాట్ స్వరూపానికి అరవిందుడు ఆపాదించిన మానవీయత కడు రమణీయం, భావగర్భితం.ఈ కవితలో అదృశ్య రూపుడైన పరాత్పరుణ్ణి  లీలానటునిగా, క్రీడామయునిగా, మాయామూర్తిగా, నిత్యునిగా, జగదీశ్వరునిగా, సర్వలోక స్తుత్యునిగా అరవిందుడు మన కట్టెదుట సాక్షాత్కరింపజేస్తాడు.

ఈ తర్జుమా సున్నితం, గంభీరమైన ఆధ్యాత్మిక భావధారతో సాగి, లోకేశ్వరుడు మన కళ్ళముందు తారాడుతున్నట్లే గోచరిస్తుంది. ఉన్నత శిఖరాగ్రాల నుండి ఉద్వేగంతో క్రిందికి దుమికే జలపాతం వంటిదీ అనువాదం. ఆద్యంతం నిసర్గ సుందరం.

ఉదాహరణకు, పదకొండు పద్యాలు గల ఆంగ్ల మూలంలోని మొదటి పద్యాన్ని గమనించండి:

“In the blue of the sky, in the green of the forest

Whose is the hand that painted the glow?

When the winds were asleep in the womb of the ether

Who was it roused them and bade them to blow?”

దీనికి తెనుగుసేత చూడండి:

“ఆకసాన నీలకాంతి లహరుల చిందింప జేయు

వనసీమల హరితకాంతి ఝరులను స్పందింపజేయు

హృద్దేశము విడిచి వచ్చి ఊహల ఊయల తేలును

తానల్లిన హరివిల్లున చిక్కని అందాల దాగు

విరబూచిన సుమకాంతల కాంతుల కన్నుల దూరును

చిత్రకారుడెవరమ్మా?

చిత్తచోరుడెవరమ్మా?”

ఇక చివరి పద్యాన్ని మూలంలో గమనించండి:

“It is He the sun who is ageless and deathless

And into the midnight His shadow is thrown;

When darkness was blind and engulfed within darkness

He was seated within it immense and alone”

దీనికి అనువాదం:

“ఆవరించు సర్వంబును అంతులేని తమసొక్కటి

ఆ తమసున ఒంటరియై తన్నుతాను గాంచుచుండు

మాడవ నేత్రము మూసిన జగతి కిచ్చు తానభయము

నిటలాక్షము తెరచినపుడు మాడిపోవు జగత్రయము”

పై మూడు, నాలుగు పాదాల్లో, మూలాన్ని అతిక్రమించినా, దాని పిమ్మట మరి రెండు స్వతంత్ర పాదాలను ఆవిష్కరించినా, మనో మోహనంగా చేసిన స్వేచ్ఛానుసరణ యిది.

Also read: చెఱువు

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles