జాన్ సన్ చోరగుడి
సందర్భం వచ్చినప్పుడు కొన్నికొన్ని విషయాలు గురించి మనం మాట్లాడుకోకపోతే, చెలామణిలో ఉన్న ప్రచారమే- ‘చరిత్ర’ అవుతుంది! శ్రీ పి .వి. నరసింహారావు ప్రధానిగా డా. మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు, 1991 నుంచి మొదలైన ఆర్ధిక సంస్కరణలకు, 2008 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొదలైన ఆర్ధిక మాంద్యంతో స్వీయ సమీక్ష అవసరమైంది. డా. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2013 ఏప్రిల్ 2న ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సి.ఐ.ఐ.) వేదికపై ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించారు. ‘ఇదే వేదికపై గతంలో కూడా ఆర్ధిక మాంద్యం మొదలైనప్పుడు నేను మాట్లాడాను…’ అంటూ- ‘ఈ దేశ పారిశ్రామికవేత్తల సహకారంతోనే మనం వృద్ధి లక్ష్య సాధనలో ప్రయోజనం పొందాము’ అని ఆయన అన్నారు.
Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…
నేపధ్యం
ఆర్ధిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్న నాటికి, ఆర్ధిక సంస్కరణల వల్ల రికార్డు అవుతున్న వృద్ధిలో- ‘ఉపాధి’ లేకపోవడం ప్రధాన లోపంగా అప్పటికి ప్రభుత్వం గుర్తించింది. ఐ.టి. తర్వాత కేవలం సర్వీస్ రంగంలో దొరుకుతున్న ఉపాధి తప్ప, ఒడిదుడుకులు లేని తయారీ రంగం ఉపాధి కానరాని కాలమది. సాగుబడి మొదలు ఏ ఒక్క రంగం ఆశాజనకంగా లేని కాలంలో, ప్రజలకు సరికొత్త ఆశలు చూపించి, సుదీర్ఘ విరామం తర్వాత 2004లో రాష్ట్రంలో డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి, కేంద్రంలో సోనియా గాంధీ నాయకత్వంలో డా. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆనాడు కాంగ్రెస్- ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకం అయింది. అలాగే అప్పటి యు.పి ఏ. ప్రభుత్వం తీసుకున్న ఊరట చర్యలు వల్ల- ‘ఎన్.ఆర్.జి.ఎస్’ వంటి ఉపాధి పధకంతో గ్రామాల్లో పనులు లేని రోజుల్లో మట్టి పనులు వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయం అయ్యాయి. అప్పటికీ దాన్నీ తప్పుపట్టిన వారు మనకున్నారు! నిజానికి మనం దాన్ని ఒక అవసరంగా పట్టించుకోలేదుగానీ, కనీసం సంస్కరణలు మొదలయ్యాక అయినా, ‘సంక్షేమం’ – ‘అభివృద్ధి’ ఈ రెండింటి మధ్య ఉన్న విభజన రేఖను చెరిపే ప్రయత్నం చేసి ఉండాల్సింది. రెండింటి కలయికతో ఒక కొత్త ‘కాంపోనెంట్’ ఈ పాటికి వచ్చి ఉండాలి. కానీ ఇప్పటికీ అది జరగలేదు.
Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?
నాటకీయం
‘సి.ఐ.ఐ’ వేదికపై సింగ్ జీ 2013 నాటి కీలక ఉపన్యాస పాఠాన్ని- ‘సి.ఎన్.ఎన్ ‘ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించింది. – “We are a private sector-led economy with 75 percent of investment being in the private sector which includes farmers, small businesses and the corporate sector,” said the PM. వంటి ఉపశీర్షికలతో అప్పట్లో అది ‘హైలైట్’ అయింది. పై రెండు తేదీలు గమనిస్తే, మనవద్ద జరిగింది ఏదో కాకతాళీయం అనుకోవడం కష్టం. నాటకీయంగా ఇదే జులై 2008లో రెండు ప్రభుత్వాలు, ఒక కార్పొరేట్ సంస్థ మధ్య జరిగిన ఒక భారీ పారిశ్రామిక ఒప్పందం 2013 నవంబర్లో రద్దు అయింది! గుంటూరు సమీపాన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారి- హైదరాబాద్ నగరానికి బయట ‘ప్లాన్’ చేసిన భారీ పారిశ్రామిక సముదాయ ప్రాజెక్టు అప్పట్లో అలా అకారణంగా ఆగిపోయింది. ఇది జరిగిన ఏడాదికి, 2014 జూన్ 8న ఈ ప్రాజెక్టు స్థలానికి సమీపంలోని గుంటూరు బైబిల్ గ్రౌండ్స్ లో చెంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండేళ్లకు ఈ ప్రాంతానికి సమీపంలోనే, 2016 అక్టోబర్ 22న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఏ. పి.రాజధానికి శంకుస్థాపన చేశారు.
Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…
ఐదేళ్ల వ్యవధిలో 2008-2013 మధ్య ఈ ఒప్పందం రద్దు కాకుండా అమలై ఉంటే, ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో ఈ ప్రాజెక్టు వల్ల పెరిగే ఆర్ధిక కార్యకలాపాలతో ఒంగోలు- గుంటూరు- విజయవాడలు ఈ పాటికి భిన్నమైన రూపంలో మనకు దర్శనం ఇచ్చేవి! ఎందుకంటే, ఈ ప్రాజెక్టులో 64 వేల మందికి ప్రత్యక్షంగానూ, 5 లక్షల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు దొరికేవి. రద్దు అయ్యేనాటికి ప్రాజెక్టు భూసేకరణ పూర్తయి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. (ఆధారం: ‘వాన్ పిక్’ వెబ్ సైట్)
Also read: కొత్త సామాజిక శ్రేణులకు ఊతంగా ఆంధ్రప్రదేశ్
ఏమిటీ ప్రాజెక్టు?
‘జి-టు-జి’ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ – రస్ ఆల్ ఖైమ (యునైటెడ్ అరబ్ ఎమిరిటస్) ప్రభుత్వాలు మధ్య జరిగిన రూ. 16 వేల కోట్ల ప్రాజెక్టు ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా తరపున- ‘మాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ’ అప్పట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 49 శాతం. ‘బోల్ట్’ (బిల్డ్-ఆపరేట్-లీజ్-ట్రాన్ఫర్) ప్రాతిపదిక ఒప్పందమిది. గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, ప్రకాశం జిల్లాలోని వాడరేవుల మధ్య సముద్ర తీర ప్రాంతంలోని 83 చ.కిమీ. విస్తీర్ణంలో రెండు ఓడరేవులకు అనుబంధంగా సమీకృత పారిశ్రామిక వాడ నిర్మించాలి అనేది 2008 నాటికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఈ పోర్టు అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ లో- ‘ఎనర్జీ పార్క్’, ‘ఆగ్రో అండ్ మెరైన్ పార్క్’, ‘ఫార్మా అండ్ టెక్స్ టైల్ పార్క్’ ‘ఆటోమొబైల్ పార్క్’ పోర్టు కేంద్రిత ‘ఫ్రీ ట్రేడ్ జోన్’ ఉంటాయి. ఈ సముద్ర తీర ప్రాజెక్టు పక్కన చెన్నై-కలకత్తా రైల్వే లైన్, నేషనల్ హైవే ఉన్నాయి.
Also read: కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’
ప్రాంతం ఎటువంటిది?
తూర్పు గుంటూరు జిల్లాలో తెనాలి దాటాక, రైతులు ఇసుక పర్రలతో సతమతమయ్యే సాగుబడి తప్ప, మాగాణి పంటలు కనిపించవు. ఇక ప్రకాశం జిల్లా అయితే, అది- గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని కరువు తాలూకాలు కలిపి ఏర్పడ్డ జిల్లా. కొన్నాళ్ల క్రితం నేను చదివిన ఒక వార్తా కధనం గురించి చెబితే, ప్రకాశం పరిస్థితి అర్ధమవుతుంది. చెన్నై-కలకత్తా హైవే మీద వెళుతున్న ట్రక్కులు ప్రకాశం జిల్లా పరిధిలో అదృశ్యం అవుతున్నాయి. కారణం- అంచలంచెలుగా వేర్వేరు ప్రాంతాలు నుంచి ప్రకాశం చేరిన కొందరు వ్యక్తులు రాత్రి పూట నిర్జన ప్రదేశాల్లో ట్రక్కుల్ని ఆపి, డ్రైవర్ క్లీనర్లను చంపి పాతిపెట్టి, ట్రక్కును పట్టుకుపోయి దాని పార్టుల్ని అమ్ముకుంటున్నారు! డజను వరకు హత్యలు జరిగాక, ఈ విషయం వెల్లడి అయింది. ఇది రాస్తున్నప్పుడు వచ్చిన మరో వార్త. ఒంగోలు-కనిగిరి-కందుకూరు-కావలి (నెల్లూరు జిల్లా) డివిజన్లలో బోర్ల పైన ఆధారపడిన రైతులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన- ‘ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల ర్యాకెట్’ ను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. డోర్నాలకు చెందిన ఒకే కుటుంబంలోని ఆడామగా కలిసి 3 గ్యాంగులుగా ఏర్పడి 34 పోలీస్ స్టేషన్ల పరిధిలో 264 ట్రాన్స్ఫార్మర్లు, అందులోని రాగి తీగ కోసం దొంగిలించారు. వీళ్ళ వద్ద రెండు ఆటోలు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతంలోని ప్రజలకు 1806-82 మధ్య కేవలం వీరికి పని కల్పించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం బకింగ్ హాం కెనాల్ తవ్వకం పని చేపట్టింది. ఇన్నాళ్ల తర్వాత దక్షణ కోస్తాలో ఇటువంటి అభివృద్ధి లేని ప్రాంతంలో వచ్చిన ‘ప్రాజెక్టు’ వాస్తవం కావడం కోసం, మనం చేసింది ఏమిటి?
Also read: మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?
ఎవరి అభివృద్ధి?
దేశానికి 60వ ఏట రైతు కూలీ పిల్లలు స్వంత ఊళ్లను అక్కడ దొరికే- ‘ఎన్.ఆర్.జి.ఎస్’ మట్టి పనులను ఊళ్ళల్లో చదువు లేని వారికి వదిలిపెట్టి, సమీప పట్టణాలు నగరాల్లో- ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హార్డ్ వేర్ టెక్నీషియన్లు అయ్యారు. అప్పటికి అది- ‘సంస్కరణల’ వల్ల జరిగిన అతి పెద్ద- ‘షిఫ్ట్’ మాత్రమే! అయితే, మరి దీని తదుపరి దశ మాట ఏమిటి? ఆ కుటుంబాలు నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రావడానికి- ‘ఫీజ్ రీఎంబర్స్మెంట్’ వంటి ప్రత్యామ్నాయాలను డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి గుర్తించాడు. ఇటువంటి చొరవలను చూసే, సింగ్ జీ అప్పట్లో తరుచూ- ‘ఏ. పి. మోడల్’ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ పేస్’ అంటుండేవారు. ఆ ధైర్యంతోనే, అయన ఆనాటి ‘సి.ఐ.ఐ.’ వేదిక మీద- “I also said that while the visible growth and prosperity of Indian big business, including especially its presence abroad, was in many ways a projection of India’s success” అంటూ- ఇప్పటి ఇండియా వృద్ధి, ఈ దేశానికి బయట, విదేశాల్లో భిన్నరూపాల్లో కనిపిస్తున్నది అనేసారు. అది- పారిశ్రామిక వేత్తల సదస్సు కనుక సరిపోయింది. పైగా ఆయన ఎన్నికల సభల్లో మాట్లాడే ‘నాయకుడు’ కూడా కాదు!
Also read: రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ
‘భుజం బ్యాగ్’
దేశానికి 50వ ఏట వచ్చేసరికి, రైతు కుటుంబాలు పొలాలు వదిలిపెట్టి, గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి ఆలస్యం అయింది గానీ, ఆ తర్వాత వారు దేశం వదిలిపెట్టి బయటకు వెళ్ళడానికి అంత సమయం పట్టలేదు. పైకో లేదా స్వగతంలోనో ఇప్పుడు దాన్ని మన- ‘వృద్ధి’ ఖాతాలో వేసుకోవడం తేలికే. కానీ, ఈ రాజకీయ పార్టీల నాయకులకు అధికారమిస్తూ, ఇక్కడి ఓటర్లుగా దేశంలో ఉండిపోయిన వారి సంగతి ఏమిటి? వాళ్ల కోసం చేసింది ఏమిటి? కొత్త రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, రూపాయి కాయిన్ ఫోన్ బాక్స్, బ్యాంక్ క్యాష్ ట్రాన్ఫర్ సదుపాయాలు వచ్చాక యువత ఇళ్లను వదిలిపెట్టి- ‘భుజం బ్యాగ్’తో దేశం నలుమూలలా ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లారు. మరి వారి కుటుంబ సంబంధాలు, మానవీయ బాధ్యతల మాట ఏమిటి? ఈ కాలంలోనే మన వద్ద- ‘ట్రాఫికింగ్’ ఎందుకు పెరిగింది? అందరూ కోరుకునే, నాణ్యమైన జీవితం దిగువ వర్గాలకు దొరికేదెప్పుడు? పౌర సమాజ భద్రత అంటే, మధ్యతరగతుల భద్రత ఒక్కటే కాదు కదా? దిగువ వర్గాల యువతకు- ‘మద్యం’, ‘సినిమా’ ఈ రెండు అందుబాటులో ఉండేట్టుగా చూస్తే, సరిపోతుందా?
Also read: ఆచార్య ఏ.బి.మాసిలామణి పేరుతో పోస్టల్ కవర్, నవంబర్ 30 న విశాఖపట్టణంలో….
దృశ్యం మారింది
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత, నాలుగేళ్ల పాటు అధికారంలో వున్న కాలంలో దాన్ని పూర్తిచేసినా, లేదా మొదలు పెట్టి అది మధ్యలో ఉన్నా దాని- ‘క్రెడిట్’ శాస్వితంగా కాంగ్రెస్ స్వంతమయేది. అలా కాలేదు సరికదా, అప్పటి కేబినెట్ మంత్రి ఎస్. శైలజానాధ్ సమైక్య ఆంధ్ర ఉద్యమ పొలిటికల్ కన్వీనర్ గా గుంటూరు నాగార్జున యూనివర్సిటీ- ప్రొ .శామ్యూల్ జె.ఏ.సి. కన్వీనర్ గా రాష్ట్ర విభజన ఆపాలని ఉద్యమం చేశారు. దీన్ని ‘సీరియస్’ ఉద్యమం చేయాలని నిజంగా అనుకుంటే, కోస్తా ఆంధ్రలో బలమైన సామాజిక నేపధ్యం వున్న వారికి ఆ నాయకత్వం అప్పగించి ఉండవచ్చు, కానీ ఆలా జరగలేదు. ‘సమైక్య ఆంధ్ర ఉద్యమం’ లక్ష్యం సాధించలేకపోయినా కనీసం ఆంధ్రుల గౌరవం మిగిల్చుకోలేని ఉద్యమంగా మిగిలింది.
కేంద్రంలో ఎన్ .డి.ఏ. ప్రభుత్వం వచ్చాక, దృశ్యం మరింతగా మారింది. ‘నేషనల్ పోర్ట్ పాలసీ’ మీద అది దృష్టి పెరిగింది. ఒకప్పటి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవే ‘లింక్’ తరహాలో ‘సాగరమాల’ ప్రాజెక్టు దేశంలోని పోర్టులు అన్నిటినీ ‘లింక్’ చేసే విధంగా మారింది. మన విదేశాంగ విధానంలో- ‘లుక్ ఈస్ట్’ పాలసీ కార్యరూపంలోకి వచ్చి ‘ఆగ్నేయ ఆసియా’ దేశాలతో మన దౌత్య, వాణిజ్య సంబంధాలు క్రియాశీలం అయ్యాయి. కేంద్రం ‘విశాఖపట్టణం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్’ ప్రకటించింది. నెల్లూరు-ఒంగోలు మధ్య రక్షణ శాఖ వైమానిక దళం కార్యకలాపాలకు ‘సివిల్ వర్క్స్’ చురుగ్గా జరుగుతున్నాయి. కొత్తగా నగరాలుగా మారుతున్న కర్నూలు, కడప- ‘ఎయిర్ పోర్టు’లు’ బిజీ అవుతున్నాయి. ఏ.పి. మారిటైం బోర్డు’ చురుగ్గా పనిచేస్తున్నది. ఇక్కడి లా కాలేజీల కోర్సుల్లో- ‘మారిటైం లా’ కొత్త సబ్జెక్ట్ అయింది. వేగంగా మారుతున్న ఈ సరికొత్త దృశ్యంలో ఈ ‘ప్రాజెక్టు’ మాత్రం మిస్ అయింది!
Also read: సమఉజ్జీ ప్రతిపక్షం అవసరతలో… ఏ.పి. ప్రభుత్వం!
ఒప్పందం రద్దు
కనీసం ఇది అయినా మర్యాదగా జరగలేదు. బెంగుళూరులో 18 నవంబర్ 2013న జరిగిన ‘మారిటైం స్టేట్స్ డెవలప్మెంట్ కౌన్సిల్’ సమావేశంలో పాల్గొన్న అప్పటి ఏ. పి. పోర్టుల మంత్రి గంటా శ్రీనివాస రావు ఇష్టాగోష్టిగా మీడియాతో మాట్లాడుతూ- ‘విదేశాంగ శాఖ ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వని కారణంగా, కేబినెట్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది’ అన్నారు. కేబినెట్ సమావేశం ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వలేదు, అని ఫైనాన్సియల్ డైలీ- ‘మింట్’ రాసింది. ‘దానిపై ప్రభుత్వం నలుగురు సెక్రటరీ స్థాయి అధికారులతో నియమించిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకుండానే, ఒప్పందం రద్దు అయినట్టు మంత్రి ఎలా ప్రకటించారో తెలీదు’ అని అదే శాఖకు చెందిన ఒక సినియర్ అధికారి అన్నట్టుగా, ఆ పత్రిక అదే వార్తా కధనంలో రాసింది.
అలా, కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే పధకం, వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం బలి అయింది. ఇక్కడే ‘అభివృద్ధి’ పట్ల మన దృక్పధం ఎటువంటిది? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం ‘ప్రాజెక్టు’ వివాదమై విషయం కోర్టులో వుంది. కనీసం- మా ప్రాంతం అభివృద్ధి కోసం, ఇక్కడి నిర్లక్షత వర్గాలకు ఉపాధి కోసం, ఆ ప్రాజెక్టును అమలు చేయాలి, అనే డిమాండ్ మాత్రం పౌర సమాజం నుంచి లేదు!
Also read: కనుమరుగై … రెండైన వై.ఎస్.ఆర్!
(రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)