Monday, January 27, 2025

దాతలపై దాడి దారుణం

  • బాధ్యతారహితంగా మాట్లాడి బాధపెట్టవద్దు
  • సినిమా ప్రముఖులు లక్షలమందికి ప్రేరణ
  • ఎవరి స్తోమతకు తగినట్టు వారు సాయం చేస్తున్నారు
  • చేతనైతే అభినందించండి, లేకపోతే మౌనంగా ఉండండి

డబ్బు, హోదా, చదువు ఉంటేనే పెద్దమనుషులు కారు.  మనసుండాలి. మనసు ఎంతవుంటే మనిషితనం అంత ఉన్నట్టు. పెద్దమనుషులుగా పేరుమోసిన వాళ్లందరికీ పెద్దమనసు ఉండాలని గ్యారెంటీ ఏమీలేదు.మనసున్న మనిషికి కోటి దండాలు పెడదాం. దండం పెట్టకపోయినా  పర్వాలేదు. ప్రశంసావాక్యాలు గుప్పించకున్నా  నష్టం లేదు. ఆపన్నహస్తం అందించేవారిపై అపవాదులు వెయ్యడం, అనవసరంగా నోరుజారడం మంచిది కాదు. దాని వల్ల నష్టం జరుగుతోంది. విరాళాలు ఇచ్చేవారి మనసుకు కష్టం కలుగుతోంది. ఈ దాతల్లో సినిమా సెలెబ్రటీస్ ఎక్కువమంది ఉన్నారు. వారి కష్టార్జితం దానం  చెయ్యడంతో పాటు పదిమందిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.

పిచ్చిపిచ్చి కామెంట్లు వద్దు

అటువంటి వారిపై ఈ మధ్య, పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ వాళ్ళ మనసుకు గాయం చేస్తున్నారు. మాటలతో ఆకాశానికి ఎత్తడం లేదా నేలకేసి కొట్టడం కొత్త సంస్కృతిగా మారుతోంది. తాజాగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాల వల్ల జనం అతలాకుతలం అయిపొయ్యారు.ఇళ్ళు, వీధులు,సామాన్లు నీళ్లతో నిండిపోయి చీకటి బతుకుగా మారిపోయింది. ఇంకా ఎందరో చీకట్లోనే ఉన్నారు. వర్షాల, వరదల భయం నుండి జనం ఇంకా బయటపడలేదు. ఈ క్రమంలోనే, ఎప్పటిలాగానే టాలీవుడ్ తారలు డొనేషన్లు ప్రకటించారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై కొందరు కామెంట్ చేశారు. ఒక పవన్ కళ్యాణ్ పైనే కాదు, మిగిలినవారిపై కూడా చేస్తూనే ఉన్నారు. ఇది ఎప్పటి నుండో ఉంది.

ఒకరితో మరొకరిని పోల్చవద్దు

మీడియా, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ మాటలు పెద్దఎత్తున బయటకు  వస్తున్నాయి. ఈ కామెంట్లలో ప్రధానమైన అంశం ఒకరితో ఇంకొకరిని పోల్చడం. అక్షయ్ కుమార్ ఇచ్చినంత మనవాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అన్నది ఒక ముఖ్యమైన కామెంట్. దీనిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా, సూటిగా స్పందించారు. మిగిలిన తారలు  కూడా ఈ కామెంట్లపై బాధాతప్త హృదయంతోనే ఉన్నారు. బాలీవుడ్ పరిశ్రమ విషయం అలా ఉంచితే, మన తెలుగుతారలు మొదటి నుండీ సేవాకార్యక్రమాలకు, దానధర్మాలకు ముందుంటున్నారు.

జోలె పట్టిన ఎన్ టీ ఆర, కృష్ణ

గతంలో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ ముందువరుసలో నిలుచున్నారు, దేశభక్తిని, తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జోలె పట్టుకొని వీధుల్లో తిరిగారు, ప్రజల నుండి కూడా వివిధ రూపాల్లో పోగుచేసి, అవసరంలో ఉన్న ప్రజలకు  అందించారు. ఆయా కాలాలలో పనిచేసిన ప్రధానులు, ముఖ్యమంత్రుల పిలుపుకు స్పందిస్తూ తమవంతు సేవాహస్తం అందించారు. ఆ దృక్పథం తెలుగుతారల్లో నిరాఘాటంగా సాగుతూనే ఉంది. గతంలో వరదలు వచ్చినప్పుడు చిరంజీవి కూడా విశాఖపట్నంలో వీధివీధి తిరిగారు.కరోనా కష్టాలు తీర్చడానికి సి సి సి ప్రారంభించారు. దీనికి విశేష స్పందన వచ్చింది. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారాలు, సంపన్నులు ఎందరు ఎన్ని సేవాకార్యక్రమాలు చేపట్టినా, సినిమా తారలు చేసే పనికి చాలా ఆకర్షణ ఉంటుంది. వారికి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు.రాజకీయాలు, ఓట్లు ఎలా ఉన్నా, ఇటువంటి సందర్భాల్లో అభిమానులు తమ ఇష్టమైన హీరోల చర్యలకు ఎంతో ప్రభావితమవుతారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్

చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు కష్టాలను తీర్చడమేకాక కాక, స్ఫూర్తిని నింపుతాయి. బాలీవుడ్ లో కూడా సేవా సంస్కృతి పెరుగుతోంది. కరోనా కాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూ సూద్ పై ఎందరో కొండంత కృతజ్ఞతను, ప్రేమను చాటుకున్నారు. సినిమాల్లో కరుడుగట్టిన విలన్ గా పేరుకెక్కిన సోనూ సూద్ పై ప్రజలకు గతంలో ఉన్న ముద్ర  మారిపోయింది. సామాన్య ప్రేక్షకుడి నుండి అగ్రనేతల వరకూ అతనికి అభిమానులుగా మారిపోయారు. అదేవిధంగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. కరోనా కష్టకాలంలో 25 కోట్ల రూపాయల డొనేషన్ ప్రకటించి, దేశాన్ని పెద్ద ఆశ్చర్యంలోకి  ముంచేశాడు. గతంలో వరదల సమయంలో స్నేహ హస్తం అందించిన సెలెబ్రిటీస్ ఇప్పుడు కరోనా కష్టాల్లోనూ అదే చొరవ చూపిస్తున్నారు.

కరోనాకు తోడు వరద భీభత్సం

గత కొన్ని నెలలుగా దేశ ప్రజల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కరోనాతో గంపెడు కష్టాల్లోకి వెళ్లిపోయారు.తాజాగా వచ్చిన వరదలు ఇంకా ముంచేశాయి. దేశం కష్ట పరిస్థితుల్లో ఉంది.ప్రభుత్వాల ఆదాయం పడిపోయింది, ఖర్చు పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్ధిక కష్టాలు, ప్రకృతి భీభత్సాలతో పాటు కులాలు కుంపట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా భగ్గుమంటున్నాయి. చేసే సాయానికి, ఆడే మాటకు, చూసే చూపుకు కూడా కులం ట్యాగ్ అంటగడుతున్న ఘోరమైన దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. పార్టీల రాజకీయాలు, వ్యాపారవేత్తల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎట్లా ఉన్నా, సామాన్య ప్రజకు అన్యాయం జరుగకూడదు. ఆపన్నహస్తం అందించేవారి సంఖ్య పెరగాలి.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ విరాళాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ పిలుపుకు తోడు,  స్వచ్ఛందంగానూ సహాయం అందించడానికి సినిమా సెలబ్రిటీస్ ముందుకు వచ్చి తమ విరాళాలు ప్రకటించారు.కరోనా సమయంలో గతంలో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల  సహాయ నిధికి   విరివిగా విరాళాలు అందజేశారు. అందులో పెద్ద, చిన్న  తారలు తమకు తోచినంత సహాయం చేశారు. చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు. వీరి మనోభావాలను దెబ్బతీయడం మంచి సంస్కారం కాదు. వీరిలో కొందరు సహజంగానే దాతృత్వ గుణం ఉన్నవారు. కొందరు నేతల పిలుపుపై స్పందించి ముందుకు వస్తున్నారు. మిగిలినవారు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలని కొందరు  ఈ యజ్ఞంలో కలుస్తున్నారు. కొందరు వారి ఆడిటర్ల సలహాల మేరకు విరాళాలు ప్రకటిస్తున్నారు.ఇలా, వివిధ ఆలోచనలతో, ప్రేరణలతో దానధర్మాలు చేస్తున్నారు.

దాననిరతిని గౌరవిద్దాం

వారి దాననిరతిని గౌరవిద్దాం. సేవాదృక్పథాన్ని ప్రశంసిద్దాం. బ్రహ్మానందం నుండి ఆలీ వరకూ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి హరీష్ శంకర్ వరకూ వారి పరిధిలో వారు ముందుకు వస్తున్నారు. ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. వీరి ప్రభావం మిగిలినవారిపై కూడా ఉంటుంది. ఆ మార్గంలో అందరూ సాగాలి. విరాళాలు అందిస్తున్న వారి  పెద్దమనసులను అర్థం చేసుకొని, మంచి మనసుతో అందరూ  ముందుకు సాగితే, మన దేశానికి, మన తెలుగు రాష్ట్రాలకు మరింత మంచి జరుగుతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles