- ఇంటినుంచి టీడీపీ కార్యాలయానికి వెళ్తుండగా ఘటన
- కారు ధ్వంసం
- పట్టాభికి తీవ్రగాయాలు
- ఘటనాస్థలికి చేరుకున్న చంద్రబాబు
నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన కొద్ది సేపట్లోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆయన కారును ధ్వంసం చేశారు. కారులో ఉన్న పట్టాభిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఉదయం ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి బయల్దేరుతుండగా పట్టాభినివాసం వద్దే ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో పట్టాభి మోకాలు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కారు ధ్వంసమైంది. దాడిలో సుమారు పదిమందికి పైగా దుండగులు పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు
రాడ్ లతో దాడి
దుండగులు ఇనుప రాడ్ లతో వచ్చి దాడికి పాల్పడినట్లు పట్టాభి తెలిపారు. దుండగుల దాడిలో ఆయనతో పాటు కారు డ్రైవరుకు కూడా గాయాలైనట్లు తెలిపారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడికి దిగారని పట్టాబి ఆరోపించారు. ఆరు నెలల క్రితం కూడా ఇలాగే తనపై దాడి జరిగిందని ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పట్టాభి అన్నారు.
ఇదీ చదవండి:అచ్చెన్నాయుడు అరెస్టు
పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు :
దాడి విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హుటాహుటిన గురునానక్ నగర్ లోని పట్టాభి నివాసానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో గాయపడ్డ పట్టాభిని పరామర్శించారు. దాడి గురించి వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పట్టాభిపై దాడిని చంద్రబాబు ఖండించారు. పట్టపగలు టీడీపీ నేతపై దుండగులు దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు అన్నారు. జగన్ అండదండలు చూసుకుని గూండాలు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పట్టాభిపై దాడిచేసిన దుండగులను తక్షణం అరెస్టు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాడిని ఖండించిన లోకేశ్ :
వైసీపీ గూండాలే పట్టాభిపై దాడి చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. పట్టాభి లక్ష్యంగా జగన్ దాడులు చేయిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ నేతలపై దాడులు చేసి బెదిరించడంద్వారా పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని లోకేశ్ విమర్శించారు.
పట్టాభి నివాసం వద్ద టీడీపీ నేతల అరెస్టు :
దుండగుల దాడిలో గాయపడిన పట్టాభి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాడి నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు పట్టాభి సహా టీడీపీ నేతలు ప్రయత్నించారు. దుండగుల దాడిలో ధ్వంసమైన కారులోనే సీఎం నివాసానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట చేసి స్టేషన్ కు తరలించారు.
ఇదీ చదవండి : కళా వెంకట్రావు అరెస్టుపై మండిపడుతున్న టీడీపీ