“అమెరికాలో వీధులు
బహు శుభ్రంగా వుంటాయి” అన్నాడతడు
“అంటే” అన్నాను
“మట్టీ ధూళీ అసలే వుండవు” అన్నాడు
“మరి నన్నెందుకు రమ్మంటున్నావు
అవి లేకుండా నేను బతకలేనే”.
“జన సమ్మర్థం ఉండదు
తొక్కిసలాట సున్నా”
“అరె జనం లేకుండా
నాకు ఊపిరాడదే”
“ఇరుగు పొరుగుల బెడద వుండదు
ఇండ్లు దూర దూరంగా వుంటాయి”
“అయ్యో! పలకరించే వాళ్ళు లేకపోతే
ప్రాణాలు నిలువవు నాకు”
“కార్లలో రోడ్ మ్యాపులుంటాయి
తప్పిపోయే ఆస్కారం లేదు”
“అట్లనా లెఫ్టు రైట్‌ల మధ్య
దృశ్య చలన సౌభాగ్యం వుండదన్నమాట
అదేం ప్రయాణం!
వినిర్మిత దేశం కదా అది
మరి రోడ్డు ప్రమాదాలు అంతగా ఎందుకు?
నేనైతే ఇప్పటికీ సుల్తాన్ బజార్‌లో
స్కూటర్ నడిపి క్షేమంగా బయట పడ్తాను”
“వాషింగ్‌టన్‌లో లైట్ హౌస్
ధవళ సుందరంగా ఉండొచ్చు గాని
అది తీసుకునే నల్ల నల్లని నిర్ణయాల్లో
మానవాళి శ్రేయస్సు ఉంటుందంటావా?”
“వీకెండ్‌లో
నయాగరాకు వెళ్లి రావచ్చు
బాగుంటుంది”
“కుంటాల జలపాతాన్ని
కంటిలో బంధించిన నాకు
అదో ఆకర్షణా!”
“అంతర్జాతీయ, గ్లోబల్ లాంటి పదాలు
నీ మనసుకు పట్టవా!”
“భూమికి చెవిని ఆనించి విను
ఎక్కడో యుద్ధ రావాలు వినిపిస్తున్నై
నువ్వు చెప్పే ప్రశాంతతను ఏం జేసుకోను
గర్భితంగా భీభత్స రసం చిప్పిల్లుతుంటే”
“నాయనా!
నువ్వు పిలుస్తుంటే
నా అస్తిత్వాన్ని మింగేసే
ప్రక్రియలన్నీ
అక్కడే వున్నట్టు అనిపిస్తుంది”
“మన రక్త బంధంలో
ఆత్మీయతకు లోటు లేదు
అదొక్కటే పరమ సత్యం
ఏమీ అనుకోకు
నన్నిక్కడే ఉండనియ్యి”
Also read: మా ఊరు తప్పిపోయింది
Also read: ఒక రోజు
Also read: ప్రేమ తత్త్వం
Also read: పరామర్శ
Also read: గ్రంథోపనిషత్