అమరావతి : మాజీ మంత్రి, శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షపీఠంపైన సోమవారంనాడు కూర్చోబెట్టి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. శాసనసభ సమావేశాలు ఆరంభమైనాయి కనుక శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ ఈ ఉత్సవానికి హాజరై అచ్చెన్నాయుడిని అభినందించారు. కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత అచ్చెన్నాయుడితో ముందు చంద్రబాబునాయుడూ, ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కరచాలనం చేశారు. అందరికీ నమస్కారం చేస్తూ తాను బాధ్యతలను అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు.
టీడీపీ ఆంధ్రప్రదేశ్ విభాగం నేతృత్వం కొన్నేళ్ళుగా ఉత్తరాంధ్రలోనే, అందునా శ్రీకాకుంళం జిల్లాలలోనే ఉంది. కళావెంకటరావు ఇంతకు ముందు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు అన్నీ పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభాగానికి కళావెంకటరావునీ, తెలంగాణ శాఖకు రమణనూ నియమించారు. చంద్రబాబునాయుడు ఎక్కువగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు కనుక, కోవిద్ కారణంగా తరచుగా పర్యటించలేకపోతున్నారు కనుక ఆంధ్రలో కార్యకర్తలను కలుసుకోవడానికీ, పర్యటనలు చేయడానికి వీలుగా అచ్చెన్నాయుడుకి పార్టీ పగ్గాలు అప్పగించారు.