Sunday, December 22, 2024

అసోంలో కమలదళానికే మళ్ళీ కిరీటమా?

ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైంది అసోం. ఈశాన్య భారతంలోని మణిపూర్ వంటి సప్తసోదరీమణులలో ఇది మణిపూస. ఈనెల 27నుంచి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ముగుస్తాయి. మొత్తం మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమై పోయింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం బిజెపి కూటమి పాలనలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే 64 స్థానాల బలం ఉండాలి. ప్రస్తుతం బిజెపికి చెందిన సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

బీజేపీవైపే సర్వేల మొగ్గు

మళ్ళీ బిజెపి కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఏబిపి – సీ ఓటర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు దఫాల్లో సర్వే నిర్వహించాయి. మూడు సార్లు మూడు రకాల ఫలితాలను అంచనా వేశాయి.(1)  64-72, (2) 68-76, (3) 73-81. ఈ మూడింటి ప్రకారం చూస్తే, బిజెపి కూటమి అధికారంలోకి రావడానికి కావలసిన ఆధిక్యత వస్తుందని తెలుస్తోంది. టైమ్స్ నౌ -సీ ఓటర్ మార్చిలో నిర్వహించిన సర్వే ప్రకారం 67సీట్లు వస్తాయని చెబుతోంది. ఈ సర్వేల ప్రకారం బిజెపి కూటమిదే మళ్ళీ అధికారం అని అర్ధమవుతోంది. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఈ కూటమికి గెలుపు అంత ఆషామాషీ కాదని అనిపిస్తోంది. 2016 ఎన్నికల్లో బిజెపి, అసోం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ కలిసి ఉన్నాయి.

కూటమి ఫిరాయించిన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్

నిన్నటి వరకూ ఎన్ డి ఏ కూటమిలో వున్న బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బిపిఎఫ్ ) బిజెపి కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ కూటమిలో చేరింది. భవిష్యత్తులో బిజెపితో కలిసి సాగే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత హగ్రామా మోహిలేరీ తెగేసి చెప్పారు. ఈ పార్టీ ప్రభావం ఫలితాలపై పెద్దగా ఉండక పోవచ్చు. జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ ఆర్ సీ ), పౌరసత్వ సవరణ చట్టం (సీ ఏ ఏ ) బిజెపి కూటమికి తలనొప్పిగా మారాయి. ఈ చట్టాలపై వ్యతిరేకంగా రాష్ట్రమంతా ఉద్యమాలు జరిగాయి. అక్కడ జీవిస్తున్న 20లక్షల మంది ఆ రాష్ట్ర పౌరులు కారని ప్రకటించడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. దీన్ని రద్దు చేయాలని బిజెపి మంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా కేంద్రాన్ని కోరారు.

మతాలకు అతీతంగా ఏకాభిప్రాయం

మిగిలిన రాష్ట్రాలకు చెందినవారు అసోంలో ఉండకూడదని ఇక్కడి ప్రజల ప్రధానమైన డిమాండ్. ఈ అంశంలో మతాలకు అతీతంగా అందరిదీ ఒకటే అభిప్రాయం. బోడో ల్యాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి.సీఏఏ వల్ల బంగ్లాదేశ్ లో ఉండే హిందువులంతా తమ రాష్ట్రానికి వస్తారనే భయం వీరికి ఎక్కువగా ఉంది. బిజెపి కూటమిలో భాగస్వామిగా ఉన్న అసోం గణపరిషత్ లోనూ అంతర్గత విభేదాలు వున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా ప్రధానంగా సీ ఏ ఏ ను వ్యతిరేకస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత, సందర్భాన్ని బట్టి అతను పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వినపడుతోంది. ప్రత్యేకంగా పార్టీ పెట్టే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సాటిలేని వ్యూహకర్త హిమంత బిశ్వ శర్మ

గతంలో కాంగ్రెస్ లో ఉన్న హిమంత బిశ్వశర్మ 2016 ఎన్నికలకు కాస్త ముందుగా ఆ పార్టీని వీడి బిజెపిలో చేరారు. 2016లో గెలిచి, రాష్ట్ర మంత్రిగానూ ఎంపికయ్యారు. ఇతనికి మంచి వ్యూహకర్తగా పేరుంది. ఆ ఉద్దేశ్యం తోనే నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలియన్స్ కు కన్వీనర్ గా బిజెపి ప్రభుత్వం ఆయన్ను నియమించింది. ఈశాన్య రాష్ట్రాలకు – కేంద్ర ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసే వారధిగా ఇతను ఉపయోగపడతారని బిజెపి భావించి, ఆ పదవిలో నియమించింది. రేపటి ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిస్తే, బిశ్వశర్మను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని వినపడుతోంది. ఐతే, బిజెపి అధికారికంగా ప్రకటించ లేదు. ఒకవేళ అది జరిగితే, సోనోవాల్ సేవలను కేంద్రంలో వినియోగించుకునే అవకాశం ఉంది.

ముస్లింలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి

రేపటి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, ఈ విషయాలను బిజెపి ప్రస్తుతం బయటకు చెప్పడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకో తగ్గ అభివృద్ధి  జరిగింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పధకాల వల్ల ముస్లిం వర్గాలకు కూడా లాభం జరిగింది. అసోంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం 34శాతం మంది ఉన్నారు.2040 కల్లా అసోంలో ముస్లింలే మెజారిటీ పౌరులవుతారని  జనాభా గణాంక శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఏఐయుడిఎఫ్ కు ముస్లిం ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

మైనారిటీ ఓట్లపై బీజేపీ విశ్వాసం

నిజంగా వీరి మద్దతు సంపూర్ణంగా లభిస్తే, కాంగ్రెస్ కూటమికి లాభం-బిజెపి కూటమికి నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాల వల్ల ముస్లింలు సైతం తమకే మద్దతు పలుకుతారనే విశ్వాసంలో బిజెపి వుంది. ఈ నేపథ్యంలో, ముస్లిం ఓటర్లు ఏ పార్టీవైపు అధికంగా మొగ్గుతారో అని ఉత్కంఠ నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే అసోం అన్ని రకాలుగా విభజనకు గురయ్యిందని నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే, మత్స్య రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా తీర్చి దిద్దుతామని మోదీ తెలిపారు.

ప్రధాని వరాల జల్లు

అసోంను భౌగోళికంగా, సాంస్కృతికంగా అనుసంధానం చేస్తామంటూ రాష్ట్రంపై ప్రధాని వరాల జల్లులు కురిపించారు. అసోంలో ప్రస్తుతం 61.47శాతం (2011 గణాంకాలు) హిందువులు ఉన్నారు. వీరందరిపై బిజెపి ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే విషయంలో కాంగ్రెస్ కు కొంత భయం కూడా మొదలైంది. 2016కు ముందు 15ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ అసోంను పరిపాలించింది. 2016లో అధికారాన్ని కోల్పోయింది. 2016 నుంచి అధికారంలో ఉన్న బిజెపి కూటమి 2021లోనూ అధికార పీఠాన్ని అధిరోహించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అసోం జాతీయ పరిషత్, రాజియోర్ దళ్, అంచాలిక్ గణ మోర్చా వంటి పార్టీలు కూడా కదన రంగంలో ఉన్నాయి.

బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కూటమి

బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై వ్యతిరేకత బాగా పెరిగి, ఓట్లుగా మారితే కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుంది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఉంటే బిజెపికి కొంత నష్టం జరుగుతుంది. లేని పక్షంలో ఈసారి కూడా మళ్ళీ బిజెపి /ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించ వచ్చు. మొత్తం మీద,వార్ వన్ సైడ్ అవుతుందని భావించిన అసోంలో కూడా పోరు హోరా హోరీగానే వుంది.ఎవరు అధికారంలోకి వచ్చినా, బొటాబొటి మెజారిటీ మాత్రమే లభిస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.విజేతలు ఎవరో? విరాగులెవరో? మే 2న తేలిపోతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles