- ఎనిమిది రోజుల పాటు సమావేశాలు
- శని, ఆదివారాలతో పాటు అక్టోబర్ 2,3 తేదీల్లో సమావేశాలుండవు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవగా.. సభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభను వాయిదా వేశారు. సభ వాయిదా.. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకోగా… సభలో చర్చించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని, తప్పనిసరిగా 20 రోజుల పాటు జరిగే సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. సమావేశాలు 10 రోజులు పాటు నిర్వహించడం వలన అన్ని అంశాలపై చర్చించడానికి కుదరదని, కావాలనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను తక్కువ రోజులు నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.