Tuesday, November 5, 2024

5 రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మార్చి 27నుంచి ఎన్నికలు ప్రారంభమై, వివిధ దశల్లో ముగుస్తాయి. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. మే 2వ తేదీ కల్లా అన్ని పార్టీల జాతకాలు బయటకు వస్తాయి. గెలుపు ఎవరికో, కుదుపు ఎవరికో తేలిపోతుంది. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు తేవాలనే ఆలోచనలోనే మోదీ ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎల్లవేళలా గుర్తు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిపతి చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయంపై పదే పదే మాట్లాడుతున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రజలకు ఎవరి పట్ల నమ్మకం ఎక్కువగా కుదిరితే, వారే రాజు, వారే మంత్రి. ఎన్నికలు ఎక్కడ వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం తమదేననే ధీమాతో బిజెపి అధినాయకులు ఉన్నారు. బీహార్ నుంచి తెలంగాణ వరకూ నమోదు చేసుకున్న వరుస విజయాలు బిజెపికి ఆత్మబలాన్ని పెంచాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మొదలు యూపిఏ పక్షాలన్నీ ఉండాల్సినంత బలంగా ఉండపోవడం వల్ల బిజెపి మాంచి ఊపులో ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఫలితాలు కూడా కీలకమేనని చెప్పాలి. ఈ ఫలితాల ఆధారంగా ఆత్మపరిశీలన చేసుకోడానికి, భవిష్యత్తులో రాబోయే జనరల్ ఎలక్షన్స్ కు వ్యూహ రచన చేసుకోడానికి, ఈ ఎన్నికలు ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తాయి.

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలు   జరుగనున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి, రాష్ట్రపతి పాలనలో ఉంది. సమసిపోయిందనుకున్న కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా తాండవం చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం సాగించాల్సి వుంది. ఎన్నికల షెడ్యూల్, కోడ్ ప్రకటనకు ఒక్క రోజు ముందుగానే ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వచ్చారు. అసోం ప్రస్తుతం బిజెపి కూటమి పాలనలోనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో సైతం అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలననే బలమైన విశ్వాసంలో బిజెపి ఉంది. కేరళలో ఆధిక్యత సాధించడం, అధికారాన్ని సొంతం చేసుకోవడం ప్రస్తుతానికి కుదరవనే స్పృహ బిజెపి పెద్దలకు ఉంటుందని విశ్వసిద్దాం.

Also Read : అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం

పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రం. కేవలం 30 నియోజక వర్గాలే ఉన్నాయి.ఎన్ ఆర్ కాంగ్రెస్, ఏఐఏడిఎంకె సహకారంతో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలనే పట్టుదలతో బిజెపి ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే, లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీని తప్పించి, ఆ స్థానంలో తమిళ భాషీయురాలైన తమిళసైను నియమించారు.ఆమె గవర్నర్ పాత్రలో ప్రత్యక్ష రాజకీయాలు చేయకపోయినా, నాయకులను ప్రభావితం చేయడానికి అవకాశాలు ఉన్నాయనే విశ్లేషకులు భావిస్తున్నారు. 2016లో కాంగ్రెస్, డిఎంకె ద్వయానికి ప్రజలు పట్టం కట్టారు. ప్రభుత్వాన్ని కడదాకా కాపాడుకోవడంలో ఈ కూటమి విఫలమైంది. బిజెపి వేసిన ఎత్తులు జిత్తులు అలా ఉంచగా, ఈ పరిస్థితి రావడానికి  ముఖ్యమంత్రి నారాయణస్వామి అసమర్ధతయే ప్రధాన కారణమని చెప్పాలి. తన శాసన సభ్యులను తనతో నిలుపుకోలేకపోయారు. మన బలహీనతే ఎదుటివారికి బలం, అని ఆయన గుర్తించలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రి, ఎన్ ఆర్ కాంగ్రెస్ అధిపతి రంగస్వామి నారాయణస్వామి కంటే వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, తాము అధికారంలోకి వచ్చామనే  చెడ్డపేరు రాకుండా,రాష్ట్రపతి పాలన విధించి, బిజెపి పెద్దలు తెలివైన అడుగు వేశారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ప్రజల తెలివితేటలనూ తక్కువగా అంచనా వేయరాదు. ముఖ్యమంత్రి నారాయణస్వామిపై సానుభూతి ఉన్నప్పటికీ, సమర్ధతపై ప్రజల్లో విశ్వాసం పోయిందనే భావించాలి. ఈ కారణం నిజంగా నిజమైతే బిజెపి,ఎన్ ఆర్ కాంగ్రెస్, ఏఐఏడిఏంకె కూటమి పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి గద్దెపై కూర్చుంటుంది. బహుశా రంగస్వామిని ముఖ్యమంత్రిగా ఎంచుకొనే అవకాశం ఉంది.

Also Read : సామాజిక మాధ్యమాలకు ముకుతాడు

తమిళనాట బీజేపీ పరోక్ష క్రీడ

తమిళనాడులో ప్రస్తుతం బిజెపి ప్రత్యక్షంగా అధికారంలో లేకపోయినా, చక్రాలు తన చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఏఐఏడిఎంకె అధికారంలో ఉంది. ఈ పార్టీ సారథులు పళనిస్వామి, పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపటి ఎన్నికల సమయంలోనూ మళ్ళీ పళనిస్వామినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.పన్నీరుసెల్వం గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, దాన్ని భరతుడు పాత్రగానే అభివర్ణించాలి. జయలలిత మరణించిన సమయంలో ఇతనే ముఖ్యమంత్రి అని అందరూ అనుకున్నారు. ఆయన కూడా అదే నమ్మకాన్ని పెట్టుకున్నారు. శశికళ పాత్ర, వరుసగా ఏర్పడిన పరిణామాల వల్ల, రాజీపడక తప్పలేదు. ఉపముఖ్యమంత్రి పదవితోనే ఆయన సరిపెట్టుకున్నారు.తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 124సీట్లతో ఏఐఏడిఎంకె ఆధిక్యంలో ఉంది. 97స్థానాలతో డిఎంకె రెండవ పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ కు కేవలం 7స్థానాలే ఉన్నాయి.స్టాలిన్ నాయకత్వంలో డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు ఒక జట్టులో ఉన్నాయి. ప్రసిద్ధ నటుడు కమల్ హసన్ “మక్కళ్ నీది మయ్యమ్” అనే పార్టీని స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రేపటి ఎన్నికల్లో డిఎంకెతో కలిసి సాగుతానని ఇప్పటికే ప్రకటించారు.ఫలితాలపై కమల్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. పళనిస్వామి ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేకపోయినా,ఆయన స్వయంశక్తితో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి కాదు. జయలలిత మరణించిన సమయంలో వచ్చిన పరిణామాలు,సమీకరణాల వల్ల ఆ పదవి దక్కింది. పన్నీరు సెల్వంది కూడా అదే పరిస్థితి. వీరిద్దరూ స్వయం ప్రకాశకులు కారు.ఈ నాలుగేళ్ళ పాలనలో కొంత అనుభవం,  ప్రజలతో కొంత అనుబంధం తెచ్చుకున్నారు. రేపటి ఎన్నికల్లో బిజెపి అండదండలు  ఉంటాయనే భావించాలి. బిజెపి కూడా కొన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నదో లేదో ఇంకా తెలియదు. సీట్ల విభజన మొదలైన అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఆకర్షణలోని అసలు రంగు రేపటి ఫలితాల్లో తేలిపోతుంది. ఈసారి డిఎంకె అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. డిఎంకె చాలా కాలం నుంచి అధికారానికి దూరంగా ఉండడం, కరుణానిధి వారసుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే సెంటిమెంట్, స్టాలిన్ కు ఉన్న కొంత ఆకర్షణ, అనుభవం, కమల్ హాసన్ తోడు, ఏఐఏడిఎంకె అగ్రనేతలైన పళనిస్వామి, పన్నీరు సెల్వం పెద్ద ప్రభావశీలురైన నాయకులు కాకపోవడం మొదలైన కారణాలు డిఎంకెకు కలిసిరావచ్చునని అంచనా. కాంగ్రెస్ -డిఎంకె మధ్య సీట్ల విభజన తేలాల్సి వుంది. బీహార్ లో వలె ఎక్కువ సీట్లను కాంగ్రెస్ కోరుకుంటే, ఇక్కడ కూడా పుట్టి మునుగుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు వచ్చిన దాన్నిబట్టి, కమల్ హాసన్ పదవి ఆధారపడి ఉంటుంది. శశికళ పాత్ర ఏఐఏడిఎంకెకు నష్టం తెచ్చే అవకాశం ఉంది.

Also Read : తమిళనాట కాషాయం ఆట

అసోంలో కాంగ్రెస్ ఆపసోపాలు

అసోం రాష్ట్రం 1957 నుంచి 2016 వరకూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రెండు సార్లు అస్సాం గణ పరిషత్ అధికారంలోకి వచ్చింది.1979లో ఒక్కసారి జనతా పార్టీ ఏలుబడిలోకి వచ్చింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయ దుందుభి మ్రోగించింది.ఇక్కడ ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు 2016లో బిజెపి పెద్ద దెబ్బ కొట్టి, అధికారాన్ని కైవసం చేసుకుంది. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో బిజెపి 60స్థానాలను దక్కించుకొని, అతి పెద్ద పార్టీగా అవతరించింది. అస్సాం గణపరిషత్ కు 13స్థానాలు ఉన్నాయి. మరో పార్టీకి 1సీటు ఉంది. ప్రధానంగా అస్సాం గణపరిషత్ ను తనతో కలుపుకొని, 2017లో బిజెపి అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాంగ్రెస్ కు 19మంది సభ్యులు, ఏఐయూడిఎఫ్ (ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్) కు 14మంది సభ్యులు ఉన్నారు.బిపిఎఫ్ (బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ) కు 11 అసెంబ్లీ స్థానాల్లో బలం ఉంది. ఈ పార్టీ కూడా ఎన్ డి ఏ కూటమిలో ఉండి, బిజెపితో కలిసి ప్రయాణం చేస్తోంది. అసోంలో ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి బలహీనంగా ఉంది. ఈ కూటమి బలం కేవలం 33స్థానాలు మాత్రమే. ఈ నాలుగేళ్లల్లో ఈ కూటమి తన బలాన్ని పెంచుకున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపటికి కూడా ఇతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. బిజెపి కూటమిలో వున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటే, ఓటమి తప్పదు. ఆ సంకేతాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు తెచ్చుకున్న ఆకర్షణ కూడా నామ మాత్రమే. ఈ నేపథ్యంలో, అసోంలో మళ్ళీ బిజెపి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read : కాంతి తగ్గుతున్న కాంగ్రెస్

మమత కోటపై కాషాయశ్రేణుల దండయాత్ర

పశ్చిమ బెంగాల్ లో 294అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మమతా బెనర్జీ అధినేత్రిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు 209మంది శాసన సభ్యుల బలం ఉంది. బిజెపికి 27 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు 23, సిపిఎం కు 19మంది శాసనసభ్యుల బలం ఉంది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. గడచిన రెండు పర్యాయాల ఎన్నికల్లోనూ మమతా బెనర్జీయే అధికారంలోకి వచ్చారు.మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆమె చూస్తున్నారు. ట్రిక్కులన్నీ ఉపయోగించి, అధికారంలోకి రావాలని బిజెపి చూస్తోంది.ఇక్కడ ఆట మొదలై కూడా చాలాకాలమైంది. తృణమూల్ కాంగ్రెస్ లోని ప్రధానమైన, ముఖ్యమైన, కీలకమైన నాయకులందరినీ బిజెపి తనవైపుకు తిప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ తృణమూల్ తో కలవకుండా విడిగా పోటీకి దిగుతోంది. సిపిఎంది కూడా అదే తీరు. మమతా బెనర్జీ మొదటి పర్యాయం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అభివృద్ధి కనిపించింది. రెండవసారి ప్రగతి కుంటుపడిందనే చెప్పాలి. అవినీతి కూడా పెరిగిందనే విమర్శలు ఉన్నాయి.పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బాగా పెరిగాయి. వీటన్నిటిని గమనిస్తున్న ప్రజలకు కూడా దీదీపై ఆకర్షణ తగ్గిందని వినపడుతోంది.అవకాశం అందివచ్చిన ప్రతిసారి, బిజెపి తనకు అనుకూలంగా మలచుకుంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి -దిల్లీకి మధ్య అగాధం బాగా పెరిగిపోయింది.మమతను గద్దె దించడానికి దిల్లీ పెద్దలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ గెలుపు ఆషామాషీ కాదు. గెలిస్తే ఆశ్చర్యమే.ఒకవేళ గెలిచినా, గతంలో వచ్చినంత మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బిజెపి బలం గతంతో కంటే  పెరిగింది. ప్రస్తుతం వ్యూహాత్మకంగానూ బలంగా ఉంది.ఇక్కడ బిజెపి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి అధికారంలోకి వస్తే, అది అద్భుతమైన విజయంగా చరిత్రలో నమోదవుతుంది.

Also Read : పుదుచ్ఛేరిలో పావులు కదుపుతున్న బీజేపీ

కేరళ స్థానిక ఎన్నికలలో ఎల్ డీఎఫ్ విజయాలు

140 సీట్లు కలిగిన కేరళలో ఎల్ డి ఎఫ్ అధికారంలో ఉంది. పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎల్ డి ఎఫ్ కు ఆధిక్యత వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు కొంచెం ముందుగా వచ్చే ఎన్నికల ఫలితాలు ప్రజలనాడికి అద్దంపడతాయని ఇక్కడ ఒక సూత్రం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఒకసారి ఎల్ డి ఎఫ్ కు అధికారం ఇస్తే, రెండవ తఫా యూడిఎఫ్ కు ప్రజలు అధికారాన్ని కట్టపెడతారు. కేరళలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతోంది. పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి, వివాదాల ముద్ర వచ్చింది. వామపక్ష పార్టీలకు గతంలో ఇటువంటి ముద్ర ఎప్పుడూ పడలేదు. ఇక్కడ బిజెపి ప్రభావం అంతంతమాత్రమే. కేరళలో రాబోయే ఫలితాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఎల్ డి ఎఫ్ -యుడిఎఫ్ మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది. మొత్తంమీద, త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలు, అవి తెచ్చే ఫలితాలు భవిష్య రాజకీయాలపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తాయి.

Also Read : తమిళనాడు ఎన్నికలపై శశికళ ప్రభావం ఉంటుందా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles