కళింగ రణక్షేత్రం
————————————————————————–
Ask what war is….
Source: Face book
Written by unknown Marathi author/poet
Translated from Marathi into English by Darshan Mondkar
తెలుగు అనువాదం: డా. సి.బి. చంద్రమోహన్
————————————————————————-
యుద్ధమంటే ఏమిటో అడుగు
చరిత్ర తిరిగి చెప్పబడి
ఏకీకృత మవటానికి
గోడను బద్దలు కొట్టిన
జర్మనీవారిని అడుగు
క్రూరమైన చలిలో నశించటానికి
రెడె స్క్వేర్ చేరినవారి
పిల్లలను అడుగు
ఇటలీని
పోలెండ్ ని
చివరికి యుద్ధంలో గెలిచిన
ఇంగ్లాండ్ ని అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
చుట్టూ
మంటలు కాల్చేస్తున్నా
బుద్ధుణ్ణి హత్తుకొని నిలబడ్డ,
రాత్రికి రాత్రి బూడిదైన
ఉదయించే భానుడి-భూమిని అడుగు
ఇంకా బంజరుగానే
మిగిలిన హిరోషిమా నేలను అడుగు
ఇప్పటికీ, గొడ్డుపోయి ఉన్న
నాగసాకీ
గర్భాశయాన్ని అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
ఎనిమిదేళ్ళు రక్తసిక్తమైన
ఇరాన్ ని అడుగు
కశ్మీర్ ను పట్టించుకోక
పోయినా
కనీసం కార్గిల్ ని అడుగు
లద్ధాఖ్ ని అడుగు
ఇరాక్ ని అడుగు
అఫ్ఘానిస్తాన్ ని అడుగు
వియత్నాంని కూడా అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
రక్తం స్రవించే నుదుటితో
సంచరించే అశ్వద్ధామని అడుగు
వంద శవాలను గుండెలకు
హత్తుకొని ఏడ్చిన గాంధారిని అడుగు
పాండవులు జయం పొందినా గాని
పాంచాలిని యుద్ధమంటే ఏమిటో అడుగు
పోరస్ ను అడుగు
నెపోలియన్ ను అడుగు
విశ్వవిజేత కావాలని
బయల్దేరిన అలెగ్జాండర్ ని అడుగు
దారుణమైన కళింగయుద్ధం
గెలిచిన అశోకుణ్ణి అడుగు
అది సాధ్యం కాకపోతే
కనీసం – ఎందుకు యుద్ధానికి
వెళ్ళనన్నాడో సిద్దార్థ
గౌతమరాజుని అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
తమ పిల్లలను చూడాలని
చివరివరకూ ఎదురు చూచే
సైనికుల తల్లిదండ్రులను అడుగు
ఫోను మ్రోగినప్పుడల్లా
భయంతో అవాక్కయ్యే
భార్యాపిల్లలను అడుగు
రణభూమి సరిహద్దులలో
ఉన్న గ్రామాలను అడుగు
పునర్నిర్మాణం చేయని
బాంబులతోబ్రద్దలైన
గోడలను అడుగు
భయంతో వణికే ఇళ్ళను అడుగు
కన్నీళ్ళతో వారి ఆత్మగౌరవాన్ని
దాచుకునే
తల్లులను, కూతుళ్ళను అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
నీ విలాసవంతమైన
విందు పూర్తయిన తర్వాత
నీ ‘మందు’ త్రాగడం
అయిన తర్వాత
నీ ఖరీదైన తోటలో
వ్యాహ్యాళి అయిన తర్వాత
మొబైల్ ఫోన్ లో నీ అభిప్రాయాలు
వెళ్ళగక్కిన తర్వాత
టీవీలో నిరాధారమైన
చర్చలు – అయిన తర్వాత
రేపటి గురించి నీ ప్రణాళిక
పూర్తి అయిన తర్వాత
వీలైతే నీ అంతరాత్మను అడుగు
ఎప్పుడైనా
నీ మనస్సాక్షిని అడుగు
యుద్ధమంటే ఏమిటో అడుగు
(అజ్ఞాత మరాఠీ కవికీ, ఇంగ్లీషులోకి అనువదించిన దర్శన్ మాండ్ కర్ కీ కృతజ్ఞతలతో….)
Also read: దేశాన్ని చూసి జాలిపడు
Also read: పరిపూర్ణ జీవనం
Also read: నర్తకి
Also read: శాంతి – యుద్ధము
Also read: “నేతి”