మనకు సంవత్సరంలో ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఆధారంగా ఆయా రోజులను మనం ప్రకటించుకుంటున్నాం. అలాంటిదే- సైన్స్ ఫిక్షన్ –డే! ఇప్పటిదాకా సైన్స్ ఫిక్షన్ – డే గురించి తెలుసుకోకపోతే బెంగలేదు కానీ, ఇప్పుడు సైన్సు యుగంలో బతుకుతూ – శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించిన ముఖ్యమైన రోజుల గూర్చి, విషయాల గూర్చి తెలుసుకోకపోతే వెనకబడిపోతాం. అందువల్ల, ఇప్పటి నుండి జాగ్రత్తపడాలి. ఇప్పుడు ఈ జాతీయ సైన్స్ ఫిక్షన్ డే అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. ప్రభుత్వాలేవీ అధికారికంగా ప్రకటించి సెలవు ఇవ్వడం లేదు గానీ, సైన్సుకు సంబంధింన పరిశోధనా సంస్థలు, గ్రంథాలయాలు, ఆయా విభాగాలు, సైన్స్ డే కు ప్రాధాన్యమిచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హాల్ మార్క్ ఛానెల్, స్కాలాస్టిక్ కార్పొరేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ రోజుకు ప్రాముఖ్యాన్నిచ్చి ప్రమోట్ చేస్తున్నాయి. ఈ రోజును ఘనంగా జరుపుకోవడం ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఈ రోజును తొలిసారి 2012లో జరుపుకున్నారు.
Also read: మానవత్వాన్ని మంటగలుపుతున్న పుతిన్
జనవరి 2 – సైన్స్ ఫిక్షన్ డే
ప్రతి సంవత్సరం జనవరి రెండును సైన్స్ ఫిక్షన్ – డేగా ప్రకటించడానికి ఒక కారణముంది. ఆ రోజు ఐసాక్ అసిమోవ్ పుట్టిన రోజు. 2 జవనరి 1920 – 06 ఏప్రిల్ 1992 మధ్య కాలంలో డెబ్బయ్ రెండేళ్లు జీవించిన వైజ్ఞానిక సృజనకారుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహారచయిత – ఐసాక్ అసిమోవ్! వైజ్ఞానిక రచనా రంగంలో అత్యున్నత శిఖరం అధిరోహించినవారు. ఆయన పుట్టిన రోజుని ‘సైన్స్ ఫిక్షన్ – డే’గా జరుపుకోవడమంటే – ఈ ప్రపంచం మూఢత్వం నుంచి సత్వరం వైజ్ఞానిక వెలుగుల్లోకి ప్రయాణించాలన్న ఆశాభావాన్ని ప్రకటించడమన్నమాట! అసిమోవ్ పేరు తలచుకోగానే ‘నైట్ ఫాల్’, ‘ఫౌండేషన్ ట్రైలోజీ’ వంటి రచనలు గుర్తుకొస్తాయి. మనమిపుడు విరివిగా వాడుతున్న ‘రొబోటిక్స్’ అనే పదాన్ని ఆయన తన ‘లయర్’ (1941) కథలో సృష్టించారు. అంతే కాదు, ‘స్పోమె’, ‘సైకో హిస్టరీ’ వంటి ఎన్నో కొత్త పదాలకు రూపకల్పన చేశారు. ఈ సైకో హిస్టరీ అనేది సోషియాలజీ, హిస్టరీ, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ ల కలయిక. ‘సైకో హిస్టరీ’తో కథలు రాసి సైన్స్ ఫిక్షన్ లోనే దాన్నొక విభాగంగా అభివృద్ధి పరిచారు. అది అసిమోవ్ ప్రతిభ! ఈ సైకో హిస్టరీతో భవిష్యత్తులో సమాజం ఎలా ఉంటుంది? ప్రజా సమూహాలు ఎలా ప్రవర్తిస్తాయి? అనే విషయాలు ఆయన ఊహించి రాశారు. ఆయన ఊహలే వాస్తవాలయి వర్తమానంలో కనబడుతున్నాయి.
Also read: విశ్వసించలేని విశ్వాసం – ఆత్మద్రోహమే
కొత్త పదాల సృష్టికర్త
అసిమోవ్ రూపకల్పన చేసిన ఎన్నో కొత్త పదాలు అటు వైజ్ఞానిక పరిశోధనారంగంలోనూ, ఇటు సైన్సు సాహిత్యంలోనూ విరివిగా వాడుతున్నాం. ఇరవయ్యవ శతాబ్దంలో సైన్సు ఫిక్షన్ రచయితగా తలమానికమైన కృషి చేసిన ఐసాక్ అసిమోవ్, వృత్తిరీత్యా అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయనకు సరితూగే బయోకెమిస్ట్ లు ఉంటే ఉండొచ్చుగానీ, సైన్సు రచయితలు మాత్రం ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన కృషి అలాంటిది. అసలు ఊహకే అందనిది. ఆయన రచించినవి, సంపాదకత్వం వహించినవి అన్నీ కలిపి ఐదు వందల గ్రంథాలు. విడిగా మరికొన్ని వందల కథలు రాశారు. ఈయనది అల్ టైం రికార్డు. మామూలు సాహిత్యకారులు ఓ వంద పుస్తకాలు రాస్తే శతాధిక గ్రంథకర్త అని పెద్ద గుర్తింపునిస్తారే… మరి ఈయననేమనాలి? బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తూ ఇన్ని పుస్తకాలు రాయడమనేది ఎవరి జీవిత కాలంలోనైనా సాధ్యమా? ఆలోచించాలి. అవేమైనా ముప్పయి, నలభై పేజీల బుల్లి పుస్తకాలా? జోకులు, పనికిరాని కబుర్లూ కాదే? వైజ్ఞానిక శాస్త్రాల నేపథ్యంలోంచి పాత్రల్ని సృష్టించి, ఎక్కువ శాతం వాస్తవాలతో, కొంత కల్పనని జోడించి వందల పేజీల సైన్సు సాహిత్య గ్రంథాలు రాయడమంటే తమాషా కాదు.
Also read: అంధవిశ్వాసాలను త్యజిస్తూ, విజ్ఞానపథంలోకి పయనిస్తూ…
అన్నిటికీ వ్యక్తిత్వమే ప్రధానం
‘ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైన్స్ ఫిక్షన్’గా పిలువబడే ఐసాక్ అసిమోవ్ కు అంత శక్తి ఎలా వచ్చిందీ? అంత పట్టుదల, అంత నిబద్ధత ఎలా అలవడ్డాయి? అంటే వాటన్నిటికీ వ్యక్తిత్వమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఆయనకు ఏ కొద్దిపాటి భక్తో ఉంటే ఫలాని దేవుడో, ఫలాని దేవతో తననావహించి ఆ రచనలు చేయించారని వినయం ఒలకబోస్తూ ప్రకటించుకునేవారు. కానీ అసిమోవ్ నికార్సయిన, నిక్కచ్చయిన మనిషి కదా? అలాంటి ప్రకటనలు ఏ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఆయన శాస్త్రవేత్తే కాదు, నిరీశ్వరవాది, హేతువాది, మానవవాది. అయితే, ఆయన ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత మతవిశ్వాసాల్నీ విమర్శించలేదు. ఖండించలేదు. కానీ, మొత్తానికి మొత్తంగా మూఢనమ్మకాల్ని, వెర్రి చాదస్తాల్ని, ప్రగతి మార్గానికి అవరోధం కలిగించే వాటినన్నింటినీ దుయ్యబట్టారు. సైన్సు విలువ తెలుసుకునే వారిని ఆహ్వానించారు. వారిని భవిష్యత్ వైజ్ఞానిక స్రవంతిలో కలవమని పిలుపు నిచ్చారు. ఈ రంగంలో అసిమోవ్ తో పాటు ప్రముఖంగా చెప్పుకోవల్సిన వాళ్ళు ముఖ్యంగా ఇద్దరున్నారు. వారు రాబర్ట్ హేన్ లేన్, ఆర్థర్ సి. క్లార్క్. ఇకపోతే, అసిమోవ్ గురించి సరదాగా చెప్పుకోవడానికి కొన్ని విషయాలున్నాయి. అంతరిక్షం గురించి అద్భుత రచనలు చేసిన ఈ రచయితకు గాలిలో ప్రయాణించడమంటే భయం. జీవితకాలంలో రెండే రెండు సార్లు విమానంలో ప్రయాణించారు. మరో విషయమేమంటే సమూహాల్లో తిరగడం ఆయనకు గిట్టదు. ప్రశాంతంగా లోన ఎక్కడో భద్రంగా ఉండి, పని చేసుకకోవడం ఆయనకు ఇష్టం!
Also read: దైవశక్తి లేదు, ఉన్నదంతా మానవశక్తే
అసిమోవ్ రచనలు చదవాలి
‘పైన్స్ ఫిక్షన్ డే’ జరుపుకునే ప్రపంచ పౌరులంతా ఏం చేస్తారంటే ఐసాక్ అసిమోవ్ రచనలు చదువుకుంటారు. అందులోని పాత్రల్ని గుర్తు చేసుకుంటారు. ఆ మహారచయిత రచనా సామర్థ్యాన్ని విశ్లేషించుకునే సభలూ, సమావేశాల జరుపుకుంటారు. ఆయన రచనల ఆధారంగా వెలవడ్డ సినిమాలు రోబోట్: గాండహార్, బైసెంటియల్ మ్యాన్, నైట్ ఫాల్, రొబోటిక్స్, ఆర్టిఫీషియల్ మ్యాన్ – వంటివి చూసి ఆనందిస్తారు. ముఖ్యంగా ఏలియన్, 2001, ద హై చ్చెక్కర్స్ గైడ్ టు ద గలాక్సీ, ఇన్ స్పేస్ నో వన్ కెన్ హియర్ యూ స్క్రీమ్ (అంతరిక్షంలో నీ కేక ఎవ్వరూ వినలేరు) వంటి సినిమాలు ప్రదర్శిస్తారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే భూమి, గ్రహాలు, అంతరిక్షం, గ్రహాంతరవాసులు మొదలైన అంశాలతో వచ్చినవి మాత్రమే సైన్స్ ఫిక్షన్ రచనలు కావు. సైన్స్ నేపథ్యంలో వచ్చిన ఎలాంటి సృజనాత్మక రచనైనా అది సైన్స్ ఫిక్షనే. ప్రపంచ భాషల్లో, మన దేశ భాషల్లో ఎంతో మంది ఎన్నెన్నో రచనలు చేశారు. చేస్తున్నారు. వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు ఈ రోజు చేపట్టొచ్చు! కార్యక్రమ నిర్వాహకులు ఇలాంటి విషయాల గూర్చి కొత్తగా ఆలోచించడం మంచిది. ఇక మన తెలుగు గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ సైన్స్ ఫిక్షన్ రచనలు చాలా తక్కువ. పైగా ఉన్నవాటిని కూడా మనవాళ్ళు గుర్తించరు. కవిత్వం, కథలు తప్ప ఇతర ప్రక్రియల్ని, శాఖల్ని పెద్దగా పట్టించుకోరు. కాని వాస్తవం పరిస్థితి ఏమిటంటే వాటికి ప్రాముఖ్యం తగ్గి, ఇప్పుడు నాన్ ఫిక్షన్ రచనలకు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో పాప్యులర్ సైన్స్ రచనలకు, సైన్స్ ఫిక్షన్ కు భవిష్యత్తు ఉంది. యువతరం ఈ విషయాన్ని ఎంత సత్వరం గ్రహిస్తే అంత మంచిది. సమాజాన్ని ముందుకు నడిపించాలంటే సైన్సు కావాలి. అయితే అది జనానికి బాగా హత్తుకునేట్లు చెప్పాలంటే సృజన కావాలి. సైన్సు-సృజన మేలు కలయికతో అత్యధికంగా రచనలు రావల్సిన అవసరం ఉంది. ఈ ‘సైన్స్ ఫిక్షన్ డే’ మనకు ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది!
Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?
వాస్తవాల, కల్పనల కలబోత
రాబర్ట్ ఎహెన్ లెయిన్, రే బ్రాడ్ బరీ, ఫిలిప్ డిక్, చార్లెస్ డి లింట్, హారీ పొట్టర్ సీరీస్, రిచర్డ్ మాత్సన్, స్టీఫెన్ కింగ్ లాంటి రచయితలంతా కల్పనలు, అభూత కల్పనలూ కలగలిపి ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించారు. డగ్లస్ ఆడమ్స్, ఆలెన్ డీన్ ఫాస్టర్ వంటి వారు సైన్స్ ఫిక్షన్ (సై.ఫి)లో హాస్యాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత కాలంలో సైన్సు అధ్యయనాలు, పరిశోధనలు ముందుకు పోయాయి. కానీ సై.ఫి కొంత వెనకబడింది. సైన్స్ ఫిక్షన్ కు పొట్టిపేరు ‘సై.ఫి’ గా ఫారెస్ట్. జె. అకెర్ మన్ నిర్దారించారు. హ్యూగో జెన్స్ బాక్ ‘సైన్స్ ఫిక్షన్’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ‘ఎపిక్ ఆఫ్ గిల్ గమేష్’ అనేది తొలి సైన్స్ ఫిక్షన్ రచనగా నమోదయ్యింది. రెండో శతాబ్దంల వెలువడ్డ ‘లూసియన్ ట్రూ హిస్టరీ’- పదో శతాబ్దంలొ వెలువడ్డ ‘అరేబియన్ నైట్స్’, ‘ద టేల్ ఆఫ్ బాంబూ కట్టర్’, పదమూడో శతాబ్దంలొ వెలువడ్డ ‘ఇబ్న్ అల్ నఫీస్ థియోలోగస్ ఆటోడిడక్షన్’ తొలి దశలో వచ్చిన గ్రంథాలు. కొన్ని అద్యయనాలను బట్టి తెలిసేదేమంటే సైన్స్ ఫిక్షన్ 16-17 దశాబ్దాల నుండే విరివిగా వెలువడుతూ వచ్చింది. పరిశోధనలతో మనిషి ప్రగతి సాధిస్తున్న కొద్దీ,సమాంతరంగా సైన్స్ ఫిక్షన్ రచనలు కూడా సృజించబడుతూ వచ్చాయి. భవిష్యత్ విజ్ఞానం, భవిష్యత్ సాంకేతికత, అంతరీక్ష ప్రయాణం, కాలంలో ప్రయాణం, వెలుగుకన్నా వేగంగా ప్రయాణించడం, సమాంతర విశ్వం, గ్రహాంతరజీవితం, గ్రహాంతరవాసులు, వైజ్ఞానిక సిద్ధాంతాల గురించి వాస్తవాల-కల్పనల కలబోత గురించి వచ్చిందంతా సైన్స్ ఫిక్షనే! అయితే ఆధునిక కాలంలో ఐసాక్ అసిమోవ్, కార్ల్ సాగన్ ల రంగ ప్రవేశం తర్వాత, సై.ఫి.కి ఒక మంచి గుర్తింపూ, గౌరవం వచ్చాయి.
Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!
విశాల హృదయం గలవారే సైన్స్ ఫిక్షన్ రాయగలరు
సైన్స్ ఫెక్షన్ రావలసినంత రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. మామూలు సృజనాత్మక రచనలు జీవితంలోంచి, సామాజిక సమస్యల్లోంచి, గతంలోని అనుభవాల నుండి వెలువడుతాయి. కాని, సైన్స్ ఫిక్షన్ సైన్సు తెలిసిన వాళ్ళు మాత్రమే రాయగలరు. సైన్సు తెలియనివాళ్ళు, దాని ఔన్నత్యం గ్రహించనివాళ్ళు సైన్స్ ఫిక్షన్ రాయలేరు. తెలుగులో కూడా అతికొద్దిమంది, అతి కొద్ది ప్రయత్నాలు చేసినవారు లేకపోలేదు. కానీ, వారి వైజ్ఞానిక రచనల్ని గానీ, వారిని గాని మనం ముందు వరుసలో నిలబెట్టుకోలేకపోయాం. ఆ అవసరం ఇప్పుడు వస్తోంది. సైన్స్ విశ్వజనీనమైంది. సైన్స్ సృజన కూడా విశ్వజనీనంగానే రావాలి. నీ బాధలేవో నువ్వే పాటగట్టుకొని, నీ ఊళ్ళో నువ్వు పాడుకున్నట్టు కాదు. సైన్స్ ఫిక్షన్ (సై.ఫి) అంత చిన్న పరిమితమైన పరిధిలో ఇమడదు. దాని పరిధి విశ్వవ్యాప్తం! విశ్వమంతా నాదే అనే విశాల హృదయం గలవారే అది రాయగలరు!!
Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ