- పాక్ క్రికెటర్లకు భారత వీసాలపై పీసీబీ ఒత్తిడి
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ ఫైనల్స్ కు భారత్ చేరితే ఆసియాకప్ క్రికెట్ టోర్నీని వాయిదా వేయక తప్పదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మణి స్పష్టం చేశారు.
ఇంగ్లండ్ లోని లార్డ్స్ వేదికగా జూన్ 21 నుంచి టెస్ట్ లిగ్ టైటిల్ సమరం జరుగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగా…భారత్ సైతం ఫైనల్స్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో శ్రీలంక వేదికగా 2021 ఆసియాకప్ టోర్నీని నిర్వహించడానికి ఆసియా క్రికెట్ మండలి సన్నాహాలు చేస్తోంది. భారత్, బంగ్లా, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, యుఏఇ జట్లతో ఆసియాకప్ నిర్వహించనున్నారు. అయితే క్రికెట్ దిగ్గజం భారత్ లేకుండా ఆసియాకప్ నిర్వహించడంలో అర్థం లేదని, భారతజట్టు టెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోందని పీసీబీ చైర్మన్ కరాచీలో తేల్చి చెప్పారు. భారత్ టెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరితే ఆసియాకప్ ను 2023కు వాయిదా వేస్తామని వివరించారు.
Also Read : టెస్టు ర్యాంకింగ్స్ 3వ స్థానంలో అశ్విన్
భారత్ వేదికగా టీ-20 ప్రపంచకప్
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మాసాలలో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ లో పాక్ క్రికెటర్లు, మీడియా, అభిమానులు పాల్గొనటానికి వీలుగా వీసాలు జారీ చేస్తామని భారత ప్రభుత్వం హామీ ఇవ్వాలని పీసీబీ చైర్మన్ పట్టుపట్టారు. ఈ మేరకు ఐసీసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఒకవేళ పాక్ క్రికెట్ జట్టు సభ్యులకు వీసాలు జారీ చేయటానికి భారత ప్రభుత్వం నిరాకరిస్తే…టీ-20 ప్రపంచకప్ ను వేరే దేశంలో నిర్వహించే ఆలోచన సైతం ఉందని చెప్పారు.
టీ-20 ప్రపంచకప్ నాటికి కరోనా అదుపులో లేకుంటే…గల్ఫ్ దేశాలు వేదికగా నిర్వహించేలా ఐసీసీ పై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
Also Read : ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ పేరు మాయం