- శతకం, 8 వికెట్లతో ఆల్ రౌండ్ షో
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అశ్విన్
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన రెండోటెస్టులో భారత ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగించాడు ఆల్ రౌండ్ ప్రతిభతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోడం ద్వారా మ్యాచ్ ను చిరస్మరణీయంగా మిగుల్చుకొన్నాడు. టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన ఈ రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండోఇన్నింగ్స్ లో సెంచరీ, మరో 3వికెట్లు సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకొన్నాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా తన హోంగ్రౌండ్ చెపాక్ వేదికగా తొలిశతకం బాదిన అశ్విన్ భారత్ కు 317 పరుగుల భారీవిజయం అందించడంలో ప్రధానపాత్ర వహించాడు.
1000 పరుగులు-100 వికెట్లు:
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి అశ్విన్ వెయ్యి పరుగులు, 100 వికెట్ల రికార్డు నెలకొల్పాడు. కపిల్ దేవ్ సరసన నిలిచాడు. అంతేకాదు..నాలుగో ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని చేరిన భారత బౌలర్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ అనీల్ కుంబ్లే పేరుతో ఉన్న 16 ఇన్నింగ్స్ లో 50 వికెట్ల రికార్డును అశ్విన్ కేవలం 14 ఇన్నింగ్స్ లోనే నమోదు చేయటం విశేషం. టెస్టుక్రికెట్లో మూడుసార్లు 5 వికెట్లు, 100 పరుగుల మైలురాయిని మూడోసారి చేరడం ద్వారా…ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ సరసన నిలువగలిగాడు. చెన్నైచెపాక్ స్టేడియం వేదికగా టెస్టు శతకం బాదిన రెండో తమిళనాడు క్రికెటర్ ఘనతను అశ్విన్ సొంతం చేసుకోగలిగాడు. 1986-87 సీజన్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా చెపాక్ లో కృష్ణమాచారీ శ్రీకాంత్ 123 పరుగులు సాధించగా…ఆ తర్వాత సెంచరీ చేసిన తమిళనాడు క్రికెటర్ అశ్విన్ మాత్రమే.
Also Read: టెస్టు క్రికెట్లో అశ్విన్ మరో ప్రపంచరికార్డు
స్వదేశీగడ్డపై 350 వికెట్లు:
స్వదేశంలో 350 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్ గా అశ్విన్ రికార్డుల్లో చేరాడు. కుంబ్లే 476, హర్భజన్ సింగ్ 376 వికెట్లు పడగొట్టగా వారి తర్వాతి స్థానంలో అశ్విన్ నిలిచాడు. టెస్టు క్రికెట్లో 29వసారి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా కంగారూ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ రికార్డును అధిగమించాడు. మరో రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టగలిగితే ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ యాండర్సన్ పేరుతో ఉన్న 30సార్లు రికార్డును అధిగమించగలుగుతాడు. భారతగడ్డపై 271 టెస్టు వికెట్లు పడగొట్టడం ద్వారా 265 వికెట్ల హర్భజన్ ను అధిగమించి అనిల్ కుంబ్లే ( 350 ) తర్వాతి స్థానంలో నిలిచాడు.
Also Read: చెన్నై రెండో టెస్టులో భారత్ భారీ విజయం
సిడ్నీ ఇన్నింగ్సే ప్రేరణ-అశ్విన్:
సిడ్నీటెస్టును డ్రాగా ముగించడంలో హనుమ విహారీతో కలసి తాను సాధించిన అజేయభాగస్వామ్యమే తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనీ, బ్యాటింగ్ పట్ల ఆసక్తిపెంచిందని అశ్విన్ తెలిపాడు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ సైతం తన బ్యాటింగ్ జోరుకు ప్రేరణగా నిలిచారంటూ కితాబిచ్చాడు. ఎనిమిదేళ్ల బాలుడిగా తాను చెపాక్ స్టేడియానికి వచ్చి టెస్టు మ్యాచ్ లు చూసేవాడినని అదే గ్రౌండ్ లో ఆల్ రౌండర్ గా రాణించడం, జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడం తనకు గర్వకారణమని టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ ప్రకటించాడు.