- 193 మంది లెప్ట్ హ్యాండర్లను అవుట్ చేసిన అశ్విన్
- అశ్విన్ కు పదోసారి చిక్కిన వార్నర్
భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ సిడ్నీటెస్ట్ మూడోరోజు ఆటలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అసాధారణ ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకొన్న ఆస్టేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ను అశ్విన్ పదోసారి పడగొట్టాడు. అంతేకాదు. టెస్ట్ చరిత్రలో అత్యధికంగా 193 మంది ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ను అవుట్ చేసిన ఏకైక బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌలింగ్ కు దిగిన అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ 13 పరుగుల స్కోరుకు ఎల్బీడబ్లుగా దొరికిపోయాడు. టెస్ట్ క్రికెట్ లో వార్నర్ ను అత్యధికంగా పదిసార్లు పడగొట్టిన బౌలర్ కేవలం అశ్విన్ మాత్రమే.
ఇదీ చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు
ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలీస్టర్ కుక్ ను తొమ్మిదిసార్లు, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఏడుసార్లు అవుట్ చేసిన రికార్డు అశ్విన్ కు ఉంది. 34 ఏళ్ల అశ్విన్ ప్రస్తుత సిడ్నీటెస్ట్ వరకూ ఆడిన 74 మ్యాచ్ ల్లో 376 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7సార్లు 10వికెట్లు, 27సార్లు 5 వికెట్ల సాధించిన రికార్డులు సైతం ఉన్నాయి.
లెఫ్ట్ హ్యాండర్స్ పాలిట సింహస్వప్నం
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కంగారూ టెయిల్ ఎండర్ జోష్ హేజిల్ వుడ్ ను అవుట్ చేయడం ద్వారా శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించాడు.
ఇదీ చదవండి: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు
అశ్విన్ ఔట్ చేసిన 192వ లెఫ్ట్ హ్యాండర్ హేజిల్‌వుడ్ కావడం విశేషం. 193వ లెఫ్ట్ హ్యాండర్ గా డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. ఇప్పటి వరకు 191 మంది ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్ చేసిన రికార్డు మురళీధరన్ పేరిట ఉంది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(186) మూడు, ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్ మెక్‌గ్రాత్(172), షేన్ వార్న్(172) నాలుగులో ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167 మందిని ఔట్ చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు