- ఆల్ రౌండర్ల జాబితాలో 5వ ర్యాంక్ లో అశ్విన్
- 14వ ర్యాంకులో రోహిత్ శర్మ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వివిధ విభాగాలలో భారత స్టార్ క్రికెటర్లు అశ్విన్, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ అదరగొట్టాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల భారీ విజయం సాధించడంలో రోహిత్, అశ్విన్ ప్రధానపాత్ర వహించారు.
14వ ర్యాంకులో రోహిత్:
చెన్నైటెస్టు తొలిఇన్నింగ్స్ లో 161 పరుగుల భారీ శతకం బాదడం ద్వారా భారత భారీ విజయానికి పునాది వేసిన రోహిత్ శర్మ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం తన ర్యాంక్ ను తొమ్మిది స్థానాల మేర మెరుగుపరచుకొని 14కు చేరాడు. 2019 నవంబర్ లో తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 10వ ర్యాంక్ సాధించిన రోహిత్ ఆ తర్వాత సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం.
5వ ర్యాంకులో అశ్విన్:
భారత ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదడంతో పాటు మరో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో 14 స్థానాలమేర తన ర్యాంక్ ను మెరుగు పరచుకొని 5వ ర్యాంక్ సాధించాడు. బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ 81వ స్థానంలో నిలిచిన అశ్విన్ బౌలర్ల విభాగంలో 7వ ర్యాంకులోనూ అశ్విన్ కొనసాగుతున్నాడు.
11వ ర్యాంకులో రిషభ్ పంత్:
ఆస్ట్ర్రేలియాతో సిరీస్ నుంచి నిలకడగా రాణిస్తూ తన ర్యాంక్ ను మెరుగుపరచుకొంటూ వస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో సైతం అదేజోరు కొనసాగిస్తున్నాడు. చెన్నై రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో 58 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా 11వ ర్యాంక్ లో నిలిచాడు. రిషభ్ టెస్టు కెరియర్ లో సాధించిన అత్యుత్తమ ర్యాంకు 11వ స్థానమే కావడం విశేషం. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 50వ ర్యాంక్ సాధించగా అక్షర్ పటేల్ 68వ ర్యాంక్ లో నిలిచాడు.