- మరో 8 వికెట్లు పడగొడితే నాలుగోస్థానం
- ఇంగ్లండ్ తో సిరీస్ లో 24 వికెట్ల అశ్విన్
భారత స్టార్ స్పిన్నర్, రికార్డుల మొనగాడు రవిచంద్రన్ అశ్విన్ ను మరో రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లోనే అశ్విన్ 24 వికెట్లు పడగొట్టడం ద్వారా క్రికెట్ చరత్రలోనే అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్ గా, 200కు పైగా లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసిన తొలి బౌలర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
అంతేకాదు ఇంగ్లండ్ తో గురువారం నుంచి జరుగనున్న ఆఖరిటెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ కలసి 8 వికెట్లు పడగొట్టగలిగితే క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి అత్యధిక వికెట్లు సాధించిన భారత నాలుగో బౌలర్ కాగలుగుతాడు.అశ్విన్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ టెస్టుల్లో 401, వన్డేల్లో 150, టీ-20ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 603 అంతర్జాతీయ వికెట్లతో జహీర్ ఖాన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: టెస్టు ర్యాంకింగ్స్ 3వ స్థానంలో అశ్విన్
956 వికెట్లతో కుంబ్లే అగ్రస్థానం
ఎనిమిదిన్నర దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన బౌలర్ రికార్డు అనీల్ కుంబ్లే పేరుతో ఉంది. కుంబ్లే 619 టెస్టు, 337 వన్డే వికెట్లతో కలిపి మొత్తం 956 మందిని అవుట్ చేయగలిగాడు.హర్భజన్ సింగ్ మొత్తం 711 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. భజ్జీకి 417 టెస్టు, 269 వన్డే, 25 టీ-20 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.భారత మాజీ కెప్టెన్, ఆల్ రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ మొత్తం 687 వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 434, వన్డేల్లో 253 వికెట్లు సాధించిన ఘనత కపిల్ కు ఉంది.
Also Read: 400 వికెట్ల క్లబ్ లో అశ్విన్
లెఫ్టామ్ స్వింగ్ బౌలర్ జహీర్ ఖాన్ 610 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ-20ల్లో 17 వికెట్లు పడగొట్టిన ఘనత జహీర్ కు ఉంది.603 వికెట్లతో జహీర్ తర్వాతి స్థానంలో నిలిచిన అశ్విన్ ఇంగ్లండ్ తో జరిగే ఆఖరి టెస్టుతో పాటు వన్డే సిరీస్ లోనూ 8 వికెట్లు పడగొట్టగలిగితే జహీర్ ను అధిగమించి నాలుగోస్థానంలో నిలిచే అవకాశం ఉంది.