- ఫ్రంట్ ఫుట్ సిక్సర్ బాదమంటూ సవాల్
- ఇంగ్లండ్ తో సిరీస్ వరకే ఈ సవాలు పరిమితం
ఇప్పటి వరకూ రాజకీయరంగానికి మాత్రమే పరిమితమైన సవాళ్ల సంస్కృతి పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కు సైతం విస్తరించింది. యూట్యూబ్ ఛానళ్ల విస్త్రుతితో అదికాస్త వింతలు, విడ్డూరాల స్థాయికి చేరింది. రాజకీయ రంగంలో గుండు గీయించుకొంటాను, రాజకీయ సన్యాసం తీసుకొంటాను అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు, పందాలు విసరడం మనకు తెలుసు. అయితే క్రికెట్లో మాత్రం బకెట్ ఛాలెంజ్ ల నుంచి సగం మీసం తీయించుకొనే స్థాయి వరకూ ఛాలెంజ్ లు చేరాయి. తాజాగా భారత వన్ డౌన్ ఆటగాడు, క్రీజునే అంటిపెట్టుకొని ఆడటంలో మొనగాడు ఛతేశ్వర్ పుజారాకు స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సగం మీసం సవాలు విసరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 81 టెస్టులు ఆడి 18 సెంచరీలు బాదడంతో పాటు 5వేలకు పైగా బాల్స్ ను ఎదుర్కొన్న పూజారాకు అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా చాలెంజ్ విసిరాడు.
ఇది చదవండి: ఛతేశ్వర్ పుజారా:బర్త్ డే స్పెషల్
భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ను అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ కోసం ఇంటర్య్యూ చేశాడు. ఆ సందర్భంగా పూజారా ప్రస్తావన వచ్చి ఒక్కసారైనా క్రీజు వెలుపలకు వచ్చి సిక్సర్ షాట్ కొట్టమని పుజారాకు నేను చెబుతున్నాను. కానీ అతడు మాత్రం వినడం లేదు. ఏవేవో కారణాలు చెబుతూ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ పోతున్నాడంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు. అయితే అశ్విన్ మాత్రం మరో అడుగుముందుకేసి వచ్చేనెల 5 నుంచి ఇంగ్లండ్ తో జరిగే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మోయిన్ అలీ లేదా మరో ఇద్దరు స్పిన్ బౌలర్ల బౌలింగ్ లో పుజారా క్రీజు బయటకు వచ్చి ఫ్రంట్ ఫుట్ సిక్సర్ బాదితే తాను సగం మీసం తీసే.. అలాగే ఆడతానంటూ సవాలు విసిరాడు. ఇది నా ఓపెన్ చాలెంజ్ అంటూ అశ్విన్ నవ్వుతూ చెప్పాడు. ఈ ఛాలెంజ్ బాగుంది. అతడు దీనిని స్వీకరిస్తే బాగుంటుంది. కానీ పుజారా ఆ పని చేస్తాడని అనుకోవడం లేదు అని రాథోడ్ చమత్కరించాడు. పూజారా ఆటతీరే అంత బ్యాటింగ్ లో కచ్చితత్వం కలిగిన అలాంటి బ్యాట్స్ మన్ దొరకడం ఏ కోచ్ కైనా అదృష్టం కాక మరేమిటి అంటూ విక్రమ్ రాథోడ్ మురిసిపోతున్నాడు.
ఇది చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లకూ క్వారెంటెన్
ఇంగ్లండ్ తో చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా జరిగే నాలుగు టెస్టులు, ఎనిమిది ఇన్నింగ్స్ లో పూజారా..ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ పుట్ సిక్సర్ బాదగలడా?అదే జరిగితే అశ్విన్ అన్నమాటకు కట్టుబడి సగం మీసంతో క్రికెట్ మ్యాచ్ ఆడతాడా? వేచిచూడాల్సిందే మరి.