- బౌలర్ గా 5 వికెట్లు, బ్యాట్స్ మన్ గా సెంచరీ
- ఇయాన్ బోథమ్ సరసన అశ్విన్
ఇంగ్లండ్ తో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోటెస్టులో భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రోజుకో అరుదైన రికార్డుతో వారేవ్వా అనిపించుకొంటున్నాడు. హోంగ్రౌండ్లో బ్యాటుతోనూ, బంతితోనూ రాణిస్తూ తనకుతానే సాటిగా నిలిచాడు.రెండోరోజుఆటలో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ మూడోరోజుఆటలో మాస్టర్ క్లాస్ సెంచరీ సాధించాడు. భారత్ రెండోఇన్నింగ్స్ లో 106 పరుగులకే 6 వికెట్లు నష్టపోయిన సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన అశ్విన్ తాను ఎదుర్కొన్న రెండోబంతి నుంచే దూకుడుగా ఆడుతూ పరుగుల మోత మోగించాడు. కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి 96 పరుగుల కీలకభాగస్వామ్యం తో జట్టుకు బ్యాటుతోనూ అండగా నిలిచాడు.
Also Read: భారీశతకాల మొనగాడు రోహిత్
148 బాల్స్-106 పరుగులు….
బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుకాని చెపాక్ పిచ్ పై పరుగులు ఎలా సాధించవచ్చునో అశ్విన్ తన బ్యాటింగ్ ప్రతిభతో చూపాడు. మొత్తం 148 బాల్స్ ఎదుర్కొని 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన కెరియర్ లో 5వ టెస్టు శతకం సాధించాడు. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా అశ్విన్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఓ టెస్టులో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు శతకం సైతం సాధించడం అశ్విన్ కు ఇది మూడోసారి. గతంలో ఈ ఘనతను ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ మూడుసార్లు సాధించిన ఆఖరి క్రికెటర్ గా నిలిచాడు. బోథమ్ తర్వాత అరుదైన ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అశ్విన్ రికార్డుల్లో చేరాడు. అయితే…క్రికెట్ చరిత్రలో 5 వికెట్లు, సెంచరీ మూడుసార్లు సాధించిన ఆటగాళ్లలో జాక్ కలిస్, గారీ సోబర్స్, షకీబుల్ హసన్, ముష్టాక్ అహ్మద్ ఉన్నారు. శతకంతో పాటు 5 వికెట్లు పడగొట్టిన భారత అలనాటి క్రికెటర్లలో పాలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్ సైతం ఉన్నారు.
Also Read: టెస్టు క్రికెట్లో అశ్విన్ మరో ప్రపంచరికార్డు
అప్పుడు శ్రీకాంత్- ఇప్పుడు అశ్విన్..
చెన్నైచెపాక్ స్టేడియం వేదికగా శతకం బాదిన రెండో తమిళనాడు ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. 1986-87 సీజన్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా కృష్ణమాచారీ శ్రీకాంత్ 123 పరుగులు సాధించగా…ఆ తర్వాత సెంచరీ నమోదు చేసిన తమిళనాడు క్రికెటర్ అశ్విన్ మాత్రమే. అశ్విన్ సాధించిన మొత్తం 5 శతకాలలో వెస్టిండీస్ ప్రత్యర్థిగా సాధించినవే ఎక్కువ ఉన్నాయి. అశ్విన్ బ్యాటింగ్ ప్రతిభతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగుల స్కోరు సాధించడమే కాదు…ప్రత్యర్థి ఎదుట 482 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.