నార్నెవెంకటసుబ్బయ్య
రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, చెరువుభూములు, స్మశానాలనుకూడా వదలకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు ఆదేశాలిస్తామని నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేశించటం అభినందించదగ్గ విషయం. ఎవరు ఆక్రమించినా , ఎక్కడ ఆక్రమించినా ప్రభుత్వ అధికారుల అండదండలతోనే అన్నది నిర్విదాంశము. నూటికినూరుపాళ్లు నిజం.
ఉదాహరణకు 1997 ప్రాంతములో ప్రకాశం జిల్లలో రామదూత అని ఒక దొంగస్వామి కోట్లాదిరూపాయల విలువగలిగిన గుడ్లూరు మండలం చేవూరు చెరువు సర్వ్ నంబర్ 879 లోని చెరువు పోరంబోకు భూమిని, సర్వే నంబరు 883 లోని అటవీశాఖ భూమిని ఆక్రమించి అశ్రమం పేరుతొ పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టిస్తాను, తనమహిమలతో దీర్ఘరోగాలు నయం చెస్తాను అంటు మోసం చేస్తూంటే, అతడిని అరికట్టి అరెస్ట్ చెయ్యవలసిన జిల్లా రెవిన్యూ యంత్రాంగము మొత్తం తమభాద్యతలు మరచి దొంగస్వామికి సాష్టాంగపడ్డారు.
25 సంవత్సరాలనుండి ఎన్నిపిర్యాదులు చేసినా జిల్లా అధికారులకు చీమకుట్టినట్లు కూడాలేదు. చివరికి లోకాయుక్తలో కేసువేసి, ప్రిన్సిపల్ సెక్రటరి రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉషారాణి గారు 2021 మే నెలలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కి ఆక్రమణ భూమిని స్వాధీనము చేసుకొవాలని ఆదేశాలిచ్చినా, ఇంతవరకు అతీగతీ లేదు. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా అదికారులు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు వారి ఆదేశంతోనైనా స్వాధీనము చేసుకుంటారనుకోవాలి.
ఇదేమండలంలో రావూరు గ్రామంలో ఒకప్పుడు బర్రె గొడ్ల వెంబట పేడ వేసుకొని తిరిగే సుబ్బమ్మ అనే ఆమె ప్రభుత్వ భూములు అక్రమించి, బండ్లమాంబ ఆశ్రమము ఏర్పరచి, పక్కనేగల స్మశాన భూమి కూడా అక్రమించింది. 1978 వరకు నిరుపేద అయిన పేడ సబ్బమ్మ అశ్రమము నిర్మించినతరువాత, పక్కనే గల అసైన్డ్ భూములుకూడా అక్రమించి అశ్రమము పేరుతొ మోసం చేస్తోంది. రామదూత అశ్రమము, బండ్లమాంబ ఆశ్రమము ఒకేమండలం అనగా గుడ్లూరు మండలం లోనే ఉండటం విశేషము. ఆశ్రమానికి వచ్చిన అధికారులకు ఇంతకాలమూ రెండు ఆశ్రమాలవారు ఎంతోకొంత ముట్టచెప్తున్నందున, అదికారులు పట్టించుకోవటం లేదని చుట్టుప్రక్కల ప్రజలు అనుకుంటున్నారు. హైకోర్టు అదేశంతోనైనా రెండు ఆశ్రమాల ఆక్రమణ భూములను వెంటనే స్వాధీనము చేసుకోగలరని ఆశిద్దాం.
ఇక చిత్తూరు జిల్లా లో కల్కిభగవాన్ అని ఒక దొంగస్వామి 2008 లో, వరదయ్య పాలెంవద్ద ప్రభుత్వ భూమిని అక్రమించి, 500 కోట్ల రూపాయలతో ” గోల్డెన్ టెంపుల్ ” నిర్మించాడు. ప్రభుత్వభూమి ఆక్రమించిన విషయాన్ని అప్పటి కలెక్టరు నిర్ధారిస్తూ 20 సెప్టెంబర్ 2008 నాడు D . Ds(E4) /11873/2008/ లెటర్ కూడా ఇచ్చాడు. అది ఇప్పటికి హైకోర్టులోనే ఉంది . కేసు నంబరు WP .No 12734/2008 . 15 సంవత్సరాలైనా స్టే తొలగించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆధికారులు ఏరకమైన చర్యలూ తీసుకోలేదు. ఇంతభాద్యతా రహితంగా ఉన్న అధికారులను ఉద్యోగంనుండి, మిగిలిన వారు భయపడి జాగ్రత్తగా ఉంటారు.
అంతేకాదు అమరావతి వద్ద కరకట్టమీద నదీపరీవాహిక పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించిన శివక్షేత్రము, ఇస్కాన్ మందిరము, గణపతి సచ్చితానంద ఆశ్రమము, మంతెనరాజు ఆశ్రమము ఇంకా చాలాఉన్నాయి. వీటినన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనావుంది. అంతేకాదు విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆశ్రమభూమి కూడా ఆక్రమించినదే! దానిసంగతి కూడా చూడాలి. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ ABN లో రాధాకృష్ణతో లైవ్ ఇంటర్వ్యూ లో స్వరూపానంద ఆక్రమణభూమి అని ఒప్పుకున్నాడు. ఆక్రమించకపోతే మాకు భూములు ఎవరిస్తారు అని నసిగాడు. ఖచ్చితంగా ఈ భూమిసంగతి కూడా తేల్చాలి.
ఇంకా చాలామంది బాబాలు చనిపోయినవారు కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాలు కట్టారు. కర్నూల్ లోని బాలసాయిబాబా అశ్రమము, పెనుగొండలో కాళీప్రసాద్ బాబా అశ్రమము వారుకూడా ప్రభుత్వ భూములు అక్రమించి కట్టినవారే. కనుక ఆ ఆశ్రమాల సంగతికూడా చూడాలి. మరీముఖ్యంగా గుడ్లూరు మండలం చేవూరు చెరువు పోరంబోకు భూమి ఆక్రమించి, ప్రిన్సిపల్ సెక్రటరి స్వాధీనంచేసుకోవాలని అదేశాలు ఇఛ్చి సంవత్సరన్నర ఐనాకుడా ఇంతవరకు లెక్కచెయ్యకుండా , ఉన్న అధికారులపై చర్యలుతీసుకొని , ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకున్నట్లైతే మిగిలిన వారికి గుణపాఠంగా ఉంటుంది.
Also read: హేతువాద ప్రచారకుడు నార్నె వెంకటసుబ్బయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం