- జ్యోతిష్యుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ
- గతంలో ఆ పండితుడు చెప్పిందే జరిగింది
- ముందస్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ
- 2019లో అధికారం ఆయనదే అంటూ ప్రకటన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతకచక్రంలో ఈ సంవత్సరం మార్చి మాసం పిదప ఆయనకు మహర్దశ యోగం ఉన్నట్టు ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ విశ్లేషించారు. దేశంలో అధిక శాతం మంది తమ గ్రహస్థితి , ముహూర్త బలం, తదితర వివరాలను జ్యోతిష పండితులు ద్వారా తెలుసుకొని వ్యాపార, ఉద్యోగ రంగాలలో అరంగ్రేటం చేయడం మామూలే. కొన్ని సందర్భాల్లో అత్యధిక శాతం ప్రజాభిమానం పొంది దేశ ,రాష్ట్ర స్థితిగతులను మార్చి ప్రజారంజక పాలన చేస్తారని ప్రజా నాయకుడిగా ప్రజా బంధువుగా ,గుర్తింపు పొందిన నాయకుల గురించి వారిని అభిమానించేవారు వారి జాతక చక్రం ఎలా ఉంటుంది? వారు నాయకత్వం వహించే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందా? వారు ముఖ్యమంత్రి అవుతారా ? తదితర అంశాలను వారి అభిమానులు, వారి ప్రమేయం లేకుండా నేరుగా జ్యోతిష్య పండితులు వద్దకు వెళ్లి వారి రాజకీయ భవిష్యత్తు, పదవుల గురించి చర్చించడం, తెలుసుకోవడం షరా మామూలే..
ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాగానే ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ జాతక చక్రం గ్రహ కుండలి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఆయన సీఎం అవుతాడా? అంటూ ధర్మపురి క్షేత్రానికి చెందిన జ్యోతిష్య పండితులు ఓం సాయి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకుడు శ్రీ గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి వద్ద విశ్లేషించడం జరిగింది. నా సంపాదకీయంలోని “ఉప్పు” పక్ష పత్రిక లో కేసీఆర్ జాతక కుండలి పండితుడు వివరించిన వివరాలను 2014 ఫిబ్రవరి మాసంలో అంటే ఆరున్నర సంవత్సరాల కాలం క్రితమే ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచురించడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కెసిఆర్ ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కే తారకరామారావు (కేటీఆర్ ) కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని, అప్పగిస్తారని ప్రచార మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్నది, అగుపిస్తోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు ,ఎమ్మెల్యేలు పోటాపోటీగా కేటీఆర్ సీఎం అవ్వాలని ప్రచార మాధ్యమాలు భావన వ్యక్తం చేయడం ఏకంగా సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సభావేదికపై కాబోయే ముఖ్యమంత్రికి ముందస్తుగా అభినందనలు అంటూ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అభినందనలు తెలపడం ప్రస్తావనార్హం.
2014 లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ జాతక చక్రం జోరుగా ఉందని ఆయన మాటే మంత్రం అంటూ, ఆయన సీఎం అవుతారని పరోక్షంగా 2014 ఫిబ్రవరి మాసంలో ఉప్పు సంచికలో వార్తా కథనం ప్రచురించాను . 2014 జూన్ 2న అదే జరిగింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
” కెసిఆర్ జాతకం లో గ్రహ బలాలు జోరు..
గురుబలంతో ఆయన మాటే మంత్రం !!
ఫిబ్రవరి మాసంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది తెలంగాణ 29వ రాష్ట్రంగా గెజిట్ ప్రకటన రాకముందే కేసీఆర్ జాతక చక్రం పై జ్యోతిష్య పండితుడి విశ్లేషణ ఇందుకు అనేక అంశాలు కారణం. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో 1969 పోలీసు కాల్పుల్లో వందలాది మంది అమరులు కాగా మలిదశ ఉద్యమంలో వేలాది మంది యువత, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాదులు వైద్యులు, కుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు, పాత్రికేయులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ఆటో డ్రైవర్లు, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, రచయితలు రైతులు, కళాకారులు, చేసిన రాజీలేని పోరాటం వలన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన విషయం తెలిసిందే, అయితే రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ ) పార్టీ దాని వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మలిదశ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు అనేది జగమెరిగిన సత్యం.
కెసిఆర్ జాతక కుండలి :
కెసిఆర్ 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరం ఆశ్లేష జన్మనక్షత్రంలో, కర్కట రాశి ,మేష లగ్నంలో జన్మించారు. ధన స్థానంలో గురువు, మూడింట కేతువు, నాలుగవ స్థానంలో చంద్రుడు, ఏడవ స్థానంలో శని, 8వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో రాహు ,11వ స్థానంలో సూర్య, శుక్ర బుధ, గ్రహాలు ఉన్నాయి. కెసిఆర్ బుధ మహాదశ లో జన్మించారు. 2014 ఫిబ్రవరి మాసం నాటికి ఆయన రాహు మహాదశ లో కొనసాగుతున్నారు. కెసిఆర్ జాతకం లో ప్రధాన బలం ఆయన మాట. ఆయన జాతక చక్రం లో రెండవ స్థానం మాటను సూచిస్తుంది. రెండవ స్థానంలో గురువు ఉండటం, భాగ్యాధిపతి గురు వాక్ స్థానంలో ఉండటం వల్ల వాక్కు ద్వారా భాగ్యం కలిసి రావటాన్ని సూచిస్తుందని విశ్లేషణ. వాక్కు స్థానంలో గురువు కారణంగా మాట్లాడిన ప్రతి మాట సాధికారికంగా, సవివరంగా అందరికీ అర్థమయ్యేలా ఉండటమే గాక ఎదుటివారు మంత్ర ముగ్ధులు అవుతారు.
వాక్కు కారకుడు బుధుడు :
లాభ స్థానం లో ఉన్న నీచరాశి కి దగ్గరగా ఉండడం మేష లగ్నానికి కానీ కర్కట రాశికి గాని బుధుడు అనుకూలురు కాక పోవడం వల్ల కొన్ని సందర్భాల్లో కేసీఆర్ సమస్యలు ఎదుర్కొంటారు. అయితే గురుస్థానం బలంగా ఉండటం వలన ఆ సమస్యలు పెద్దగా ఇబ్బందికి గురి చేయవు. అలాగే బుధుడు మీడియాకు కూడా కారకుడు అవ్వటంతో మీడియా నుంచి సరైన సహకారం ఉండదు. శని ఉచ్ఛ స్థితిలో ఉండి స్థానబలంతో ఉండటంవల్ల శుక్ర, శని మధ్య పరివర్తన యోగం ఉండటం వల్ల కేసీఆర్ కు మరో బలం జనాకర్షణ.
కుజదశ ప్రధాన మలుపు:
విపరీతమైన రాజయోగం ఇస్తున్న కుజ దశ నుంచి కెసిఆర్ జీవితం ప్రధాన మలుపు తిరిగినప్పటికీ 2006లో ప్రారంభమైన రాహుదశ ఆయనకు కలిసి వచ్చింది. రాహు భాగ్యస్థానంలో ఉండి, గురువు ఇచ్చే ఫలితాలు ఇవ్వటం వలన కేసీఆర్ జాతకంలో 2014 సంవత్సరం జోరుగా ఉందని పండితుడి విశ్లేషణ. 2009 మే మాసం నుంచి కేసీఆర్ రాహు మహాదశ లో గురు భుక్తి ప్రారంభమైంది. 2009 నవంబర్, డిసెంబర్ మాసాలలో కేసీఆర్ గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో చర్చ జరగడం గమనార్హం. 2011అక్టోబర్ మాసం నుంచి రాహు శని భుక్తి. రాష్ట్ర సాధన చివరి ఘట్టం ఈ సమయంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
శని అంతర్దశ 2014 ఆగస్టు వరకు ఉంటుంది. ఈ దశ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు అతి ముఖ్యమైన, అత్యంత అనుకూలమైన దశ. ఈ దశలో సొంత రాష్ట్రం రావడంతో పాటు కెసిఆర్ కీర్తి కలకాలం నిలిచే దశ ఇది అని ఆయన విశ్లేషణ.
2014 ఫిబ్రవరి మాసంలో ఈ కథనం ప్రచురితమైంది. 2014 జూన్ 2న కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు నెలల ముందే కేసీఆర్ సీఎం అవుతారు అని చెప్పడం పరోక్షంగా వార్తాకథనం సారాంశం.
కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు :
దక్షిణాది రాష్ట్రాలలో సిఎంలలో ఒకరికి 2017 లో ప్రాణగండం ఉందని ,కథనాలు ,విశ్లేషణలు, ప్రచార సాధనాలు జోరుగా పుకార్లు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ విశ్లేషణలో పరోక్షంగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానాలు చేయడం తదితర అంశాలు తెలిసిందే. ఈ అంశాలపై 2016 డిసెంబర్ లో సంతోష్ కుమార్ శర్మ విశ్లేషించారు. ఒక వ్యక్తి ఆయు ప్రమాణం గూర్చి మాట్లాడడం చర్చించడం సమంజసం కాదు. మంచి సాంప్రదాయం కాదు అంటూ కేసీఆర్ అభిమానులలో ఉన్న భయాందోళనలు తొలగించడానికి ఆయన విశ్లేషణ జరిపారు.
అష్టమ స్థానం ఆయుష్షును చెపుతోంది :
జాతక చక్రంలో అష్టమ స్థానం ఆయుష్షును చెపుతోంది. ఒక వ్యక్తికి పూర్ణ ఆయుష్షు ఉన్నదా లేక అల్ప ఆయుష్షు ఉన్నదా అనే అంశం అష్టమ స్థానం దాని అధిపతి శని దానిలో ఉన్న గ్రహాలు, ఆయుష్షు కు కారకమైన గ్రహం శని బట్టి అంచనా వేయవచ్చు అన్నారు. అష్టమ స్థానం అధిపతి నీచ స్థానంలో ఉండటం శత్రు క్షేత్రంలో ఉండటం కానీ లేక పాప కర్తరి లాంటి ఇతర యోగాల కారణంగా బలహీనపడటం జరిగినప్పుడు అది ఆయుష్షు మీద ప్రభావం చూపుతుంది. అష్టమాధిపతి బలంగా ఉన్నా, అష్టమ స్థానం బలంగా ఉన్నా లేక ఆయువు కారకుడు శని బలంగా ఉన్న వ్యక్తికి పూర్ణ ఆయుష్షు అంటే 75 సంవత్సరాలకు పైగా ఉంటుందని ఆయన విశ్లేషణ.
కెసిఆర్ జాతకం లో ఆయన మహా లగ్నంలో కర్కటక రాశిలో, ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం లో జన్మించారు. 2016 జనవరి 20 వరకు రాహు మహాదశ లో బుధ అంతర్దశ నడిచింది. ఆ తరువాత కేతు అంతర్దశ ప్రారంభమైంది. కేసీఆర్ జాతకంలో అష్టమ స్థానంలో లగ్నాధిపతి అయిన కుజుడు ఉన్నాడు. ఆయుష్ కారకుడు శని సప్తమ స్థానంలో ఉచ్చ క్షేత్రంలో స్థానబలం తో ఉన్నాడు. అలాగే చంద్ర రాశి నుంచి అష్టమ స్థానంలో లగ్నం నుంచి లాభ స్థానంలో సూర్య, బుధ మరియు శుక్ర గ్రహాలు ఉన్నాయి అష్టమాధిపతి అయిన శని జాతకంలో బలంగా ఉన్నాడు. ఈ గ్రహస్థితి అంతా కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పకనే చెబుతోంది కొంత బలహీనంగా ఉన్న బుధుని కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు వచ్చి ఉండవచ్చు తప్ప అవి మరీ అంతగా ఇబ్బంది పెట్టేవి కావు. పైగా జనవరి 20 నుంచి కేతు అంతర్దశ ప్రారంభమవుతుంది. కేతువు మూడవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా రాజకీయంగా చాలా అభివృద్ధి సాధిస్తారు.
అష్టమాధిపతి శని రాహుల మధ్య పాప కర్తరి ఉన్నప్పటికీ ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏమాత్రం తగ్గించలేదు. అంతేకాకుండా గతంలో కేసీఆర్ చేసిన అయుత చండీ యాగం ఈ కర్తరి దోష ప్రభావం నుంచి రక్షణ ఇస్తుంది. 2019 సంవత్సరంలో కెసిఆర్ హవా కొనసాగే లక్షణాలు అగుపించినట్లు జ్యోతిష్య పండితులు విశ్లేషించారు.
2019 లోను సీఎం కేసీఆర్ దే హవా :
శాసనసభకు ముందస్తు ఎన్నికలు రావచ్చని ఆయనది మహర్దశ జాతకం అంటూ 2017 డిసెంబర్ లోనే జ్యోతిష్య పండితులు ఆయన జాతకం విశ్లేషించారు. 2017 వ సంవత్సరం అక్టోబర్ మాసం వరకూ కెసిఆర్ జాతకం లో ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉండదు. నాలుగవ ఇంట గురువు ఎక్కువ శ్రమ అలసట అనవసర వివాదాలు కీర్తి భంగం ఇస్తాడు. అయితే శుక్ర అంతర్దశ అనుకూలంగా ఉండటం వలన ఈ చెడు ప్రభావం తగ్గుతోంది. 2018 అక్టోబర్ నుంచి గురువు పంచమ స్థానం ఎన్నికలకు, స్పర్థలకు కారక భావం కాబట్టి రానున్న ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని వివరణ. జన్మస్థానం లో రాహు సంచారం కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది దాని కారణంగా కొంత వ్యతిరేకత కానీ ఇబ్బందులు కాని ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ చెడు ప్రభావం 2018 అక్టోబర్ వరకు ఉంటుందని ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయని విశ్లేషణ. అక్టోబర్ మాసంలో గురు గోచారం మారటం వలన ఇది ఎన్నికల అనుకూల సమయం. అంటే ఎన్నికలు ముందే వచ్చేలా చేస్తుంది 2018 -19 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు నాయకత్వంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి అనేది దాని భావం.
మార్చి మాసంలో మార్పులు :
సీఎం కేసీఆర్ కు ప్రస్తుతం రాహు మహర్దశ లో శుక్ర అంతర్దశ నడుస్తున్నది. ఈ అంతర్దశలు ఈ సంవత్సరం మార్చి 26 వరకు ఉంటుంది. ఆ తర్వాత సూర్య అంతర్దశ ప్రారంభం అవుతుంది. కెసిఆర్ జాతకం లో సూర్యుడు సంతాన కారకుడై లాభ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా ఎవరికైనా కూడా రాహు మహాదశ సూర్యుని అంతర్దశలు చేస్తున్న ఉద్యోగంలో కాని, పదవుల్లో కొన్ని మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు సూర్యుని స్థితిని అనుసరించి ఈ మార్పులు బలవంతంగా జరిగేదిగా ఉంటుంది. ఇంకా కొన్ని సార్లు ప్రమోషన్ లేదా, ఉన్నత పదవి లభించడం ద్వారా జరిగే మార్పు కూడా అవుతుంది. కెసిఆర్ జాతకం లో సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండటం వలన ఈ సూర్య అంతర్దశ లో జరిగే మార్పులు అనుకూలమైన మార్పులుగా గోచరిస్తున్నది. ఉన్నత పదవి కారణంగా కానీ, ఇష్టప్రకారం కానీ ఈ సూర్య అంతర్దశ జరిగే సమయంలో ఈ విధమైన మార్పు జరిగే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాక ప్రస్తుతం శని గోచారం కొంత అనుకూలంగా లేకపోవడం అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో గురువు కూడా 8వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మార్పు అనివార్యంగా గోచరిస్తున్నది. సూర్యుడు కేసీఆర్ జాతకరీత్యా సంతాన కారకుడు అవ్వడం వల్ల ఈ సమయంలో జరిగే మార్పు సంతానానికి మేలు చేకూర్చేదిగా ఉండవచ్చు అని పండితుడు విశ్లేషణ.
జ్యోతిష్య పండితుడు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ గూర్చి...
భారతదేశంలోని అత్యున్నత 10 జ్యోతిష్య వెబ్సైట్లలో శర్మగారి ఆన్లైన్ జ్యోతిష్ (www.onlinejyotish.com) వెబ్సైట్ ఒకటి. (Top Ten lo ) జ్యోతిష్యం కు సంబంధించిన ఈయన వెబ్సైట్ను ప్రతినెల దాదాపు 10 లక్షల మంది వీక్షిస్తూ ఉంటారు, సలహాలు సందేహాలు నివృత్తి చేసుకుంటారు. 1996లో ఈయన జ్యోతిషాన్ని ఆరంభించారు. 2003-04 పుష్కరాల సందర్భంలో e-shradha అనే సేవను ఆయన ఆరంభించారు. దేశ విదేశాల్లో ఉన్న వారు పుష్కరాల్లో తమ పితృదేవతలకు పిండప్రదానం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. తెలుగు జాతకం మొబైల్ అప్లికేషన్ ను ఈయన రూపొందించారు. ఇందులో పిల్లల జాతకం, పంచాంగం, ముహూర్తాలు, వధూవరుల గుణమేళనం, తదితర సేవలు ఉచితంగా పొందే వెసులుబాటు ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా మొదలగు దేశ విదేశాల నుంచి వారి వారి జాతకాలను సందేహాలు , వెబ్ సైట్ ద్వారా గాని ఆన్లైన్ ద్వారా గానీ శర్మ గారిని సంప్రదిస్తుంటారు.
స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సినీ రంగ దిగ్గజాలు వివి వినాయక్, హరీశ్ శంకర్ ,ఆర్పి పట్నాయక్ వై.వి.యస్.చౌదరి, యాంకర్ ఝాన్సీ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు శర్మగారి వద్ద తమ జాతకాలు గూర్చి తెలుసుకున్నారు. ఎంఏ తెలుగు పూర్తిచేసిన శర్మగారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేకమందికి ఈయన సుపరిచితుడు.