Thursday, November 7, 2024

శివరాముడి రాజకీయ సన్యాసం?…గురువుకు గుర్తింపే ఆశయం!

 వోలెటి దివాకర్

మొన్నటి వరకు వైస్సార్సీపీ రాజమహేంద్రవరం కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఎపి ఐ ఐ సి మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం  పార్టీ మారతారన్న ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే భవిష్యత్ లో తమ నాయకుడు ఎమ్మెల్యే.. ఎంపీ పదవులు పొందుతారని  ఆయన అనుచరులు ఆశిస్తుండగా శివుడు రాజకీయ సన్యాసం దిశగా  అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. 58 సంవత్సరాల వయస్సులో తనకు పదవులు అవసరం లేదని తన రాజకీయ గురువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, గవర్నర్ గా విశేష సేవలు అందించి, అభివృద్ధికి విశేష కృషిచేసిన స్వర్గీయ డా.  కొణిజేటి రోశయ్య కు సముచిత గుర్తింపు,గౌరవం దక్కేలా కృషి చేయడమే ఆశయం అని స్పష్టం చేశారు.

ఎపి ఐ ఐ సి మాజీ చైర్మన్ శ్రీ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం సారధ్యంలో ఆదివారం పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రోశయ్య తనయుడు శివ, ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పైడా కృష్ణ ప్రసాద్ తదితరులు ఈసమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తన గురువు రోశయ్యను ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సరైన రీతిలో గౌరవించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తాను వైసిపిలో ఉన్నప్పటికీ, రోశయ్యకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇచ్చేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. తన వయస్సు 58 ఏళ్లు పూర్తయినందున తన తర్వాత ఎవరిని తయారు చేయాలన్నదే తన ఉద్దేశ్యం తప్ప తనకు పదవులతో పనిలేదని శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టంచేశారు. గోదావరి జిల్లాల్లో ఆర్యవైశ్యులకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పక్షాలు ఆర్యవైశ్యులను గుర్తించేలా చేయడానికి ఈ సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.

విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ , కాంగ్రెస్ లలో వివిధ పదవుల్లో రాణించానని, రాజకీయాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెల్సినవాడినని ఆయన చెప్పారు. అందుకే తన పదవి కోసం కాకుండా గోదావరి జిల్లాల్లో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు తీసుకురావడానికి, రోశయ్యకు తగిన గుర్తింపు తేవడానికి  ఈ సమావేశం పెట్టినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ఆర్యవైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా అండగా ఉంటానని ఆయన స్పష్టం చేసారు. ఎవరికైనా అనుమానాలుంటే పటాపంచలు చేసుకుని, కల్సి రావాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు.

రోశయ్యకు పద్మవిభూషణ్ ..స్మృతివనం

రోశయ్య పేరిట  స్కృతివనం వనం..అందులో ఆయన  నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉమ్మడి గోదావరి జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధులు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు  పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా విశేష సేవలందించిన రోశయ్య  సేవలను గుర్తించి వారికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించాలని   రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.

రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలకుగాని, రాష్ట్ర స్థాయి ఆరోగ్య సంస్థలకుగాని ఆర్థిక సంస్థలకుగాని శాశ్వత ప్రతిపాదికపై  రోశయ్య పేరు పెట్టాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానించింది. భారతదేశంలో అత్యధికంగా 16 సార్లు  రాష్ట్ర శాసనసభలో  ఓవర్ డ్రాఫ్ట్ లేకుండా  ఆర్థిక శాఖామాత్యునిగా బడ్జెట్ పెట్టిన రోశయ్య పేరుమీద తపాలా బిళ్ళను, నాణెంను ముద్రించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.   రోశయ్యకి సముచిత గౌరవప్రదమైన గుర్తింపు వచ్చే వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంతకాలు ఉద్యమం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం తీర్మానించింది. నవంబర్ నెలలో ఉభయ రాష్ట్రాల ఆర్యవైశ్యులతో రాజమండ్రిలో లక్షలాది మందితో ఆర్యవైశ్య శంఖారావం నిర్వహించా లని సమావేశం నిర్ణయించింది.

  ఉభయ గోదావరి జిల్లాల్లో వైశ్యుల బలాన్ని సేవలను గుర్తించి రాబోయే రోజుల్లో వైశ్యులకు సముచిత స్థానాన్ని కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచిస్తూ సమావేశం తీర్మానించింది. వైశ్య కార్పొరేషనులో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వుండేలా చేయడంతో పాటు  రూ. 5,000 కోట్లు కేటాయించి చిన్న వ్యాపారస్తులకు తక్కువ వడ్డీరేటుతో రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా వైశ్యులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని సూచిస్తూ సమావేశం తీర్మానించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆర్యవైశ్యుల  శక్తిని, సేవలను గుర్తించి వివిధ రాజకీయ పార్టీలు ఆయా పార్టీల్లో సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది.

వైశ్యులు రాజకీయంగా క్రియాశీలకంగా, నిర్ణాయక శక్తిగా ఉండాలని గరిష్ట స్థాయిలో వైశ్య ఓటర్లుగా నమోదు చేయించుకోవడం ద్వారా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే,    వైశ్యుల  సహకారం లేనిది విజయం సాధించలేని పరిస్థితులు కల్పించాలని వక్తలు పిలుపునిచ్చారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles