మూడు వారాలు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ కు బొంబాయి హైకోర్టు గురువారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఏ ప్రాతిపదికపైన ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల వ్యవహారంలో పీకలదాకా కూరుకొనిపోయారంటూ ఆరోపిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా ఆ యువకుడివాట్సప్ చాట్ ఆధారంగా చెబుతున్నామని మాదకద్రవ్యాల నిరోధక శాఖ (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్ సీబీ) అధికారులు చెప్పారు. ఆ చాట్ రెండేళ్ళ కిందటిదని ఆర్యన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రొహట్గీ చెప్పారు. అర్యన్ తో పాటు అతడి స్నేహితుడు అబాజ్ మర్చంట్ కూ, మోడల్ మున్ మున్ ధమేచాకు కూడా బెయిల్ లభించింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 23-ఏళ్ళ కుమారుడు ఆర్యన్ మూడు వారాలు జైలులోనూ, పోలీసు కస్టడీలోనూ గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది. అంతకు మందు ఎన్ సీబీ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించాయి. చివరికి బొంబాయి హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
కుర్రవాళ్ళు మాదకద్రవ్యాలు కొద్ది మొత్తంలో స్వీకరించినప్పటికీ వారు పునరావాస కేంద్రానికి వెళ్ళడానికి ఇష్టపడితే వారిమీద కేసులు అక్కర లేదనీ, ప్రాసిక్యూషన్ అక్కర లేదనీ చట్టం స్పష్టంగా చెబుతోందని రొహట్గీ అన్నారు. పారుష్ ఖాన్ అభిమానులు ఆయన నివాసం ‘మన్నత్’ దగ్గర గుమిగూడి సంబరాలు చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ ఒకే ఒక సారి తన తనయుడిని చూడటానికి అయిదు నిమిషాలపాటు జైలును సందర్శించారు. ముంబయ్ సినిమా పరిశ్రమ నుంచి సల్మాన్ ఖాన్, ఫారా ఖాన్, హృతిక్ రోషన్ లు బాహాటంగా షారుఖ్ ఖాన్ కి మద్దతు తెలిపారు.
సమీర్ వాంఖెడే వ్యవహారం
ఇది ఇలా ఉండగా, ఆర్యన్ పై కేసును ఇంతదూరం తీసుకువచ్చిన ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖెడే కేసు కూడా ఈ రోజు బాంబేకోర్టులోనే విచారణకు వచ్చింది. ప్రైవేటు డిటెక్టివ్ గొసావి, డీసౌజా మధ్య జరిగిన సంభాషణ విన్నాననీ, వారేదో 25కోట్ల రూపాయల లావాదేవీ గురించి మాట్లాడుకుంటున్నారనీ, ఆ మొత్తంలో ఎనిమిది కోట్ల రూపాయలు సమీర్ వాంఖెడేకు ఇస్తే ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టవచ్చునని అంటున్నారనీ ప్రభాకర్ సాలీ అనే సాక్షి వాగ్మూలం ఇచ్చారు. సమీర్ పైన దర్యాప్తు జరిపేందుకు మహారాష్ట్ర పోలీసు శాఖ నలుగురు అధికారులను నియమించింది. ఈ కేసు దర్యాప్తును మహారాష్ట్ర పోలీసుల చేతుల నుంచి సీబీఐకి కానీ ఎన్ఐఏ కి కానీ అప్పగించాలని పిటిషనర్ సమీర్ వాంఖెడే కోరారు. ఆయనను అరెస్టు చేయవలసి వస్తే 72 రెండు గంటలు ముందుగానే నోటీసు ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో హామీ ఇచ్చారు.