దిల్లీ: రైతులు తమ ఉనికి కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారనీ, రైతులు తమకు వ్యతిరేకంగా భావిస్తున్న మూడు చట్టాలనూ రద్దు చేయాలని చేతులు జోడించి అర్థిస్తున్నానంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారంనాడు కేజ్రీవాల్ రైతులు నిరసన దీక్ష సాగిస్తున్న హరియాణా, దిల్లీ సరిహద్దు సింఘూ దగ్గరికి వెళ్ళి రైతులును కలుసుకొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ విధంగా కేజ్రీవాల్ చేయడం రైతుల దీక్షలు ప్రారంభమైన తర్వాత ఇది రెండవ సారి.
‘‘ఏ కేంద్రమంత్రినైనా రైతులతో బహిరంగ చర్చ జరపాలని నేను సవాలు విసురుతున్నాను. ఆ విధంగా చర్చ జరిగితే వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టదాయకమో, లాభదాయకమో తెలుస్తుంది,’’ అంటూ కేజ్రీవాల్ అన్నారు. సింఘూ సరిహద్దుకు కేజ్రీవాల్ డిసెంబర్ 7వ తేదీన మొదటిసారి వెళ్ళారు. ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఆదివారంనాడు వెళ్ళారు. ‘‘రైతులు తమ బతుకుతెరువుకోసం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ వ్యవసాయ చట్టాలు రైతుల నుంచి భూములను లాగివేస్తాయి. ఈ మూడు చట్టాలనూ దయజేసి రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను,’’ అంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.
‘‘మేము అన్ని ఏర్పాట్లనూ జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తున్నాం. మీకు అతి తక్కువ బాధ కలిగే విధంగా మేము చూడటానికి ప్రయత్నిస్తున్నాం,’’ అని దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా రైతులతో చెప్పారు.
జలాలాబాద్ లాయర్ ఆత్మహత్య
పంజాబ్ కు చెందిన ఒక న్యాయవాది అమర్ జిత్ సింగ్ రైతులు ప్రదర్శనలు జరుపుతున్న ప్రదేశానికి కొద్ది మైళ్ళ దూరంలో ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లాలోని జలాలాబాద్ కు చెందిన ఈ రైతు విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. టిక్రీ సరిహద్దులో న్యాయవాదిని అపస్మారక స్థితిలో కనుగొన్న రైతులు ఆయనను రొహ్టక్ ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రికి తీసుకొని రాకముందే అమర్జిత్ సింగ్ మరణించారని వైద్యులు నిర్ధారణ చేశారు. ‘‘కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా ప్రాణ త్యాగం వల్ల రైతుల గోడును వినిపించుకునే విధంగా కేంద్రంపైన ఒత్తిడి పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను,’’ అని న్యాయవాది రాసినట్టుగా చెబుతున్న నోట్ లో ఉన్నది. మూడు నల్ల చట్టాలూ తమను మోసం చేస్తున్నాయని రైతులూ, వ్యవసాయ కార్మికులూ భావిస్తున్నారని లేఖ ఆరోపించింది. డిసెంబర్ 18న రాసిన ఈ ఆత్మహత్యాలేఖ నిజమైనదో, సృష్టించిందో ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు.
మొత్తం ముగ్గురి ఆత్మహత్య
ఇంతకు ముందు రెండు ఆత్మహత్యలను రైతు ఉద్యమానికి సంబంధించినవిగా చెబుతున్నారు. 65 సంవత్సరాల సిక్కు బోధకుడు సంత్ రాంసింగ్ సింఘూ సరిహద్దు దగ్గరే ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల బాధను చూడలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ నెల పూర్వార్ధంలో ఆత్మహత్య చేసుకున్న బోధకుడు తన లేఖలో తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకు 22 ఏళ్ల రైతు పంజాబ్ లోని భటిండాలో దిల్లీ సరిహద్దు దగ్గరు నిరసన ప్రదర్శన చేసి తిరిగి వెడుతూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారంనాటి ఆత్మహత్యతో మొత్తం ముగ్గురు రైతులకు మద్దతుగా ఆత్మహత్య చేసుకున్నట్టు అయింది.