చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ కుమార్ గోస్వామి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆరూప్ కుమార్ గోస్వామి చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఏకే గోస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ గోస్వామి రాక సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఇప్పటివరకు ఉన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
జస్టిస్ అరూప్ గోస్వామి అసోంలోని జోర్హాట్ లో 1961 మార్చి 11న జన్మించారు. గౌహతి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత గౌహతి హైకోర్టులో 2011లో అదనపు న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా సేవలు అందించారు. 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి రెండు సార్లు గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన గోస్వామి బదిలీ ఇపుడు ఏపీకి వచ్చారు.
ఇది చదవండి: జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్