జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తెలిపాను
ముగ్గురిలో ఒక్కరూ స్పందించలేదు
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొంది ఆంధ్రప్రదేశ్ కు జరిగిన తీరని అన్యాయ ఘట్టానికి ఈనెల 18 వ తేదీతో 8 ఏళ్లు పూర్తవుతుంది. పార్లమెంటు చరిత్రలోనే ఎలాంటి చర్చ జరగకుండా రాజధాని ఉన్న రాష్ట్రాన్ని విభజించి , ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేశారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ విభజన సందర్భంగా కాంగ్రెస్ ఎపికి అన్యాయం చేసిన తీరును పార్లమెంటులో ఎండగట్టడంతో ఎపికి జరిగిన అన్యాయం, విభజన హామీలు తదితర అంశాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తెరతీశాయి.
Also read: డాక్టర్ వర్సెస్ డాక్టర్!
విభజన సందర్భంగా ఎపికి జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టులో పోరాటం చేయడంతో పాటు , పార్లమెంటులో విభజన తీరును తప్పుపడుతూ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రచించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎపికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మరోసారి గళమెత్తారు. ఈసందర్భంగా ఆనాటి విషయాలను గుర్తు చేసుకుని, ఆవేదన వ్యక్తం చేశారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 14 మంది ఎపి ఎంపిలను బయటకు గెంటివేసి, తలుపులు మూసి, మైకులు ఆపేసి, కనీస చర్చ లేకుండా బిల్లును ఆమోదించారన్నారు. ఈ పాపంలో అప్పటి అధికారపక్షం కాంగ్రెస్ తో పాటు , ఆ నాటి ప్రతిపక్ష పార్టీ బిజెపికి కూడా సమాన వాటా ఉందన్నారు. బిజెపి సహకరించకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదని స్పష్టం చేశారు. విభజన బిల్లు ఆమోదం సందర్భంగా దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ స్వయంగా ఈవిషయాన్ని వెల్లడించారని గుర్తుచేసుకున్నారు. మాజీ హోంమంత్రి ఎల్ కె అద్వానీ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాల విభజనను వ్యతిరేకించారని, ఎపి అసెంబ్లీ రాష్ట్ర విభజనను మూడింట రెండొంతుల మెజార్టీతో వ్యతిరేకంగా తీర్మానించిందన్నారు.
Also read: సమ్మె వద్దు, సంప్రదింపులు జరపండి: ఏపీ ప్రభుత్వోద్యోగులకు ఉండవల్లి విజ్ఞప్తి
తెలంగాణా ఎంపిలే వ్యతిరేకించారు
రాష్ట్ర విభజనపై తెలంగాణా ఎంపిలతో పాటు , మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ , తృణమూల్ ఎంపి సౌగతాయ్, తదితరులు వ్యతిరేకించారని ఉండవల్లి వెల్లడించారు. బిల్లులో నాలుగు అంశాలను వారు వ్యతిరేకించారని, ఈనేపథ్యంలో చర్చ జరిగి, ఓటింగ్ కోరితే బిల్లు వీగిపోయేదన్నారు.
ఇప్పటికైనా కనీసం చర్చించండి
రాష్ట్ర విభజన జరిగిన తీరు, ఎపికి జరిగిన అన్యాయాన్ని టిడిపి అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సుమారు రెండున్నర గంటల పాటు చర్చించాననీ, ఆయన తన ఎంపిలతో మాట్లాడించి, పార్లమెంటులో చర్చకు నోటీసు ఇస్తామన్నారనీ, ఆతరువాత ఈ అంశాన్ని పక్కన పెట్టారనీ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి కూడా ఈవిషయాన్ని తీసుకెళ్లినట్లు ఉండవల్లి చెప్పారు. 2019 లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ఈవిషయమై లేఖ రాసినట్లు చెప్పారు. ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రధాని మోడీ ప్రకటనపైన చర్చకు నోటీసు ఇచ్చినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read: 1986 ఎన్జీఓల సమ్మె గుర్తుందా?!
షెడ్యూల్ 9,10 లోని సుమారు లక్ష 42 వేల కోట్లకు పైగా విలువైన ఉమ్మడి ఆస్తుల పంపకంపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రశ్నిస్తే ఆస్తుల పంపకంపై ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని కేంద్రమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగి ఈనెల 18 వ తేదీకి 8 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చర్చకు నోటీసు ఇవ్వాలని ఉండవల్లి ప్రార్థనాపూర్వకంగా టిడిపి , వైసిపి ఎంపిలను కోరారు.
Also read: యుూపిీలో మండల్ వర్సెస్ కమండల్!