నా అంత గొప్పోడు లేడు అనే అహంకారులు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటారు. ఈ అహంకారులు లౌకిక ప్రపంచంలో నాలుగు రకాలు. ఒకటి విద్యా అహంకారం…రెండోది డబ్బు అహంకారం…మూడోది పదవి అహంకారం, నాల్గవది అందం అహంకారం. ఈ అహంకార మదం వల్ల పురాణాల్లో దుర్యోధనుడు, శిశుపాలుడు భయంకరమైన చావు చస్తారు. ఈ అహంకారం వల్లే విశ్వామిత్రుడు రాజ్య పాలన వదిలి గొప్ప తప్పస్సు చేసి సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు. అయితే రాజర్షిగా పేరు ప్రఖ్యాతులు పొందడమే కాకుండా వశిష్ఠుడి ముందు తన గర్వం వల్ల మంచే జరిగిందని ఒప్పుకునే గొప్ప మానవతా దృక్పథాన్ని కూడా వ్యక్త పరచడం విశ్వామిత్రుడి అహంకారంలో తుది మెరుపు.
తన గోతిని తాను తవ్వుకుంటుంది
నేటి సమాజంలో అహంకారంతో తన గోతిని తానే తవ్వుకున్న ఉదంతాలు కోకొల్లలు. ఒక అద్భుత ప్రవచనం చెప్పే వారిని విమర్శిస్తూ ఆయన ప్రవచనాల కన్నా నా ప్రవచనాలే మిన్న అంటూ మరో ప్రవచన కారుడు విర్రవీగే ఉదంతాలు ఉన్నాయి. తన ప్రవచనాల్లో ఎదుటి వ్యక్తిని కించపరిచేలా రంధ్రాన్వేషణ చేసే పండితులను కూడా చూశాం! అలాగే తనకు తెలిసిన విద్యా అపారమని ఎదుటి వ్యక్తి చేసే వాదన సరికాదని తనకే తెలివి తేటలు అధికమనే వారూ ఉన్నారు… అలాంటి వారి ఇంటి ఛాయాలకు కూడా ఎవ్వరూ పోరు. ‘అబ్బో ఆయనదో వితండవాదం’’ అంటూ చల్లగా జారుకుంటారు. ఇలాంటి విద్య అహంకారాలు కోకొల్లలు.
Also Read : దృతరాష్ట్ర ప్రేమతో కిరాతకులు అవుతున్న పుత్ర రత్నాలు
డబ్బుతో ఏదైనా కొనగలమా?
ఇక డబ్బు అహంకారం…డబ్బుతో ఏదైనా కొనవచ్చనే అహంకారం …డబ్బు లేని వారంతా అల్పులని వారిని ఈగల్లా దోమల్లా చూసే డబ్బు మద అహంకారులు అడుగడుగునా కనిపిస్తారు! కొత్త కారు కొని అదో పెద్ద విమానం అన్నట్టు విర్రవీగే నడమంత్రం సిరిగాళ్ళకు అహంకారం దెబ్బ వెంటనే తగులుతుంది. ట్రాఫిక్ లో ఎవడికో గుద్ది పోలీస్ వారి చేత్తో పాటు జనం చేత తన్నులు తిన్నాక కారు వైపు చూసుకుంటే దానికి లొట్టలు పడి, ఇతడి వీపు విమానం మోత మొగాకా తగిలిన దెబ్బలకు భార్య కాపడం పెట్టే వరకూ అతడికి డబ్బు అహం దిగదు. ఇక బ్యాంకుల్లో కాస్త డబ్బు, ఇంట్లో ఇంత బంగారం, చేతికి ఐదు ఉంగరాలు ఉంటే చాలు ఇక అతడి దూకుడుకు బ్రేకే ఉండదు. అతడు పుష్పక విమానంలో విహరిస్తూ, క్రింద ఉన్న మనుషులు జంతు సంచారాన్ని చూస్తూ వాడేదో గొప్ప ఉన్నత శిఖరాల్లో ఉన్నట్టు గర్వ పడతాడు! ఇలాంటి వారి కోసమే సుమతీ శతక కారుడు “ధనమెక్కిన మదమెక్కును , మదమెక్కిన మచ్చరంబు మరి మరి ఎక్కున్” అంటాడు. ఇక ఈయన ప్రయాణిస్తున్న విమానం కూలిందా క్రింద మట్టిలో కూరుకు పోయి కుర్రో మొయ్యో అంటూ సహాయం కోసం ఆర్థిస్తాడు…ఇంకా మానవత్వం బ్రతికుంది కాబట్టి అతడిని కాపాడిన తరువాత అతడి అహంకారం ఆవిరి అయిపోతుంది.
మిడిసిపడిన అధికారులే మోకాళ్ళమీద కూర్చుంటారు
అహంకారం అనేది సానుకూల భావోద్వేక ప్రతిస్పందన. అహంకారం అనేది సంక్లిష్టమైన ద్వీతీయ భావోద్వేక పరంపర అని తత్వవేత్తలు మానసిక వేత్తలు నిర్ధారించారు. నిఘంటువు ప్రకారం అహం అంటే ‘నేను”, ‘’నా” అనే స్వంత ప్రాముఖ్యానికి సంబంధించిన భావన. అహంకారంలో దురహంకారం కూడా మిళితం అయి ఉంటుంది. అదే పదవి. ఒక హోదాలో ఉన్న వ్యక్తి చుట్టూ వందిమాగధులు చేరితే అతడు మంచి చెడు విచక్షణ కోల్పోతాడు. కలెక్టర్ ను తిడతాడు. అధికారులను దుర్భాషలు అడతాడు. అలాంటి వారి మాటలు పడ్డ పోలీసు అధికారులు వారి పదవీ పోయి బజారున పడ్డప్పుడు వారి అధికార మదం అడుగంటి అంతకంతకు కక్ష తీర్చుకునే పోలీస్ అధికారి వారికి తగులుతాడు. ఆ అధికారి చేతుల్లో చావు దెబ్బలు తిని లాకప్ లో మోకాళ్ళ మీద కూర్చునే పరిస్థితి వస్తుంది.
Also Read : ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !
సొగసు చూడతరమా?
ఇక అందం కొంత మంది ఆడవాళ్ళలో ఉండే అహంకార ధోరణి. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు తమనే అందరూ చూస్తారనే ఒక అహంకారం వారిలో కలుగుతుంది. దానికి తోడు కృత్రిమ అలంకారాలు కూడా జోడవుతాయి. ‘వర్ణ అంధత్వం” వళ్ళ వీళ్లు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. నల్ల వాళ్ళు అంటే వీళ్లకు పడదు. “కోడలు నలుపైతే కులమంతా నలుపే” అని ఎద్దేవా కూడా చేస్తారు. సంస్కారం మరిచి వీళ్ళు అనే మాటలు తీరా కొడుకు నల్లమ్మాయిని చేసుకొని వచ్చి వీళ్ళ గర్వాన్ని అహంకారాన్ని అనుస్తారు. ఇక ఇలాంటి వారిది వితండవాదం వాదంగా ఉంటుంది. అప్పుడే స్త్రీ వాదం అంటారు మరప్పుడే ఛాందస వాదాన్ని జతకడతారు! స్వేచ్ఛ జీవితం కావాలనుకుంటూనే పంజరంలో చిలుకలా జీవితం అయిందని వాపోతారు. వీరు సున్నిత హృదయులు కూడా. పైకి గంభీరంగా అహంకారిగా కనబడ్డా ప్రతి విషయానికి భయపడి నిండుగా ముసుగు కప్పుకొని సంప్రదాయత కనబరుస్తారు. అయితే పెళ్ళిల్లో పేరేంటాల్లో వీరి కంటే అందంగా కనబడ్డ వనితను మూతి మూడు వంకర్లు తిప్పి వెక్కిరించే అహంకారం వారి ఇంటి నిండా ఉంటుంది. ‘కళాశాల నుండి పట్టభద్రుడైనందుకు ప్రసంశలు అందుకొని జీవితంలో సాధించిన విజయాల గురించి నేను గర్విస్తున్నాను”…. అని వినమ్రతతో చెప్పే వాడే లేడు! అమెరికాలో ఉంటే చాలు ఇండియాను విమర్శించే ప్రబుద్ధులను అహంకారులు అనాల్సిందే!
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
అహంకారంతో ఉబ్బిపోయే కొన్ని విషయాలు ఇవి… తనకంటే గొప్ప వారు లేరనే భ్రమ వారిని అంధకారంలోకి నెడుతుంది. కానీ అహంకారం అంటే ఏమిటి? ఇది మనకు సేవ చేస్తుందా లేదా మనకు కీడు చేస్తుందా? అనే ఆలోచించే వారు తక్కువే. అహంకారం తరచుగా పేలవమైన “స్వీయ-విలువ” అనే విషయాన్ని మరుస్తారు.
ఇతరుల లోపాలే కనిపిస్తాయి
మన స్వంత మనో భావాలను దాచడానికి ఒక మార్గంగా ఇతరుల లోపాలను చూస్తాము. మన స్వంత లోపాలను గుర్తించకుండా ఇతరులను విమర్శించడాన్ని ఆనందిస్తాము. అహంకార మానవ దౌర్బల్యాన్ని గుర్తించకుండా నిరోధిస్తుంది. ఈ సిగ్గుతో నడిచే అహంకారం కలిగినవారికి “నన్ను క్షమించండి. నేను తప్పు చేసాను” అని చెప్పడం రాదు! అహంకారం తలకెక్కినప్పుడే మేము ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడుస్తున్నట్టు భావిస్తారు…మేము లేనిది ఏ పని జరగదని విర్ర వీగుతారు..సాఫీగా పనిచేసుకు పోయే వారికి వారి ప్రాదాన్యత కలిపించడానికి అవరోధాలు సృష్టిస్తారు…అవకాశం కోసం ఎదిరిచూస్తూ అవమానం జరిగేలా వెనకనుండి నాటకం ఆడతారు! ఇవన్నీ విజ్ఞులు కనిపెడితే వాళ్ళు తోక ముడుచుకుంటారు!
Also Read : ప్రేమతత్వం తెలిస్తే ఆకర్షణకు దూరంగా ఉంటారా?
సముద్రంలో గరిటెడు
తాను బలవంతుణ్ణి అని హుంకరించడం తగదని ఎంత బలం ఉన్నా పాము చలి చీమల చేత చిక్కి మరణిస్తుంది…మన గురించి మనం ఎంత ఎక్కువ తెలిస్తే అంత తక్కువ అహంకారం. ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువ అహంకారం అని ఆరుద్ర ఒక చోట రాస్తాడు. సముద్ర జలం లాంటి విజ్ఞానంలో తనకు తెలిసింది గరిటెడు మాత్రమే అని ఒప్పుకునే వారు ఈ కాలంలో తక్కువే. అతి అహంకారం అతి మమకారం వదిలేస్తే కొంతలో కొంత మనిషి ఆత్మ జ్ఞాని అవుతాడు.
Also Read : మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!