- దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ కు ఏర్పాట్లు
- కృష్ణాజిల్లాలో ట్రయల్ రన్ కు రంగం సిద్ధం
భౌగోళికంగా దేశంలోని నాలుగు ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ ను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో మందు వేయడం మినహా వ్యాక్సినేషన్ సందర్భంగా జరిగే ప్రక్రియ యథాతథంగా ఉంటుందని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. క్షేత్ర స్థాయిలో కొవిన్ పోర్టల్ పనితీరును, టీకా పంపిణీ సన్నద్ధతలో తలెత్తే లోటుపాట్లను గుర్తిస్తారు. శీతల పరిస్థితుల్లో టీకా నిల్వ, రవాణా, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణ, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో ట్రయల్ రన్ లో అంచనాకు రానున్నారు. ట్రయల్ రన్ మండల, జిల్లా స్థాయిల్లో సమీక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ప్రక్రియలో వైద్య అధికారులు, వ్యాక్సినేటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. కోల్డ్ చైన్ పర్యవేక్షకులు, డేటా మేనేజర్లు, ఆశా సమన్వయ కర్తలకు కేంద్రం ప్రత్యేకంగా శిక్షణ విధానాన్ని రూపొందించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో దాదాపు 2400 మందికి శిక్షణనిచ్చారు. దేశ వ్యాప్తంగా 49 వేల 600 మంది శిక్షకులు సిబ్బందికి తరగతులు నిర్వహించారు. వ్యాక్సినేషన్, కొవిన్ పోర్టల్ పై ఫిర్యాదులకు జాతీయ స్థాయిలో 1075, రాష్ట్ర స్థాయిలో 104 హెల్ప్ లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. టీకాను తొలిదశలో భాగంగా కోటి మంది వైద్య ఆరోగ్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్క్, 27 కోట్ల మంది వృద్దులకు వేయాలని నిపుణుల బృందం సూచించింది.
ఇదీ చదవండి: మరో భయంకర కరోనా
ట్రయల్ రన్ కు ముమ్మర కసరత్తు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. టీకా పంపిణీ సన్నద్ధతలో తలెత్తే ఇబ్బందులు, సమస్యలపై ముందస్తుగా అవగాహన కోసం డ్రైరన్ చేపట్టాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ట్రయిల్ రన్ కు కృష్ణాజిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వాక్సిన్ ట్రయల్ రన్ కోసం కొవిన్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ద్వారా ముందస్తుగా వ్యాక్సిన్ వేయాల్సినవారి జాబితాను అధికారులు రూపొందించారు. ట్రయల్ రన్ ను ఆది వారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించనునట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. 27న ఐటీ రిలేటెడ్ డ్రై రన్, 28న లాజిస్టిక్ రిలేటెడ్ మాక్ డ్రిల్, 29న వాక్సినేషన్ ట్రయిల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ట్రయల్ రన్ కు ఏర్పాట్లు పూర్తి
డ్రైరన్ కోసం జిల్లాలోని ఐదు ప్రాంతాలను ఎంపిక చేశామని జిల్లా వైద్య శాఖాధికారి తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి, ఉప్పులూరు పీహెచ్ సీ, విజయవాడ పూర్ణ ప్రైవేటు ఆసుపత్రి, ప్రకాష్ నగర్ ఆర్బన్ పీహెచ్ సీ, తాడిగడప ప్రభుత్వ పాఠశాలలో డ్రైరన్ కు ఎంపిక చేశారు. ప్రతి కేంద్రంలో 25 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసేవిధంగా ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రైరన్ ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బందికి అవగాహన పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా స్ట్రెయిన్