Wednesday, January 1, 2025

ఆందోళన కలిగిస్తున్న అర్ణబ్ అరెస్ట్

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఊహించిందే. ఏదో ఒక రోజు ఇలా  జరుగుతుందని కొందరు  ముందుగానే పసిగట్టారు. అలాగే జరిగింది. ఈ వార్త మీడియాలో కంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మీడియా లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీనిపై వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు మహారాష్ట్ర ప్రభుత్వ తీరును, పోలీసుల ప్రవర్తనను, అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. దీన్ని మరో ఎమర్జెన్సీగా అభివర్ణించారు.

ఇందిర ఎమర్జెన్సీని గుర్తు చేసిన బీజేపీ నాయకులు

ఇందిరాగాంధీనాటి ఎమర్జెన్సీని గుర్తుచేశారు. వాక్ స్వాతంత్ర్యానికి, పాత్రికేయ స్వేచ్ఛకు ఇది గొడ్డలిపెట్టుగా భావిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వివిధ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆర్ణబ్ గోస్వామి అరెస్టును, అరెస్టుచేసిన తీరును తీవ్రంగా తప్పు పట్టాయి. పలుచోట్ల నిరసనలు జరిగాయి. ఆర్ణబ్ గోస్వామి అరెస్టుపై మిశ్రమమైన స్పందనలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన అరెస్టుకు, మీడియా స్వేచ్ఛకు ఎటువంటి సంబంధంలేదని, ఇందులో జర్నలిజం  కోణాన్ని చూడాల్సిన అవసరమేలేదని, ఇది ఒక ఆత్మహత్య, మోసం అనే అంశాలకు మాత్రమే సంబంధించినదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక జర్నలిస్టును ఈ తీరున అరెస్టు చేయవచ్చా?

అంశాలు ఏవైనా,  ఒక  జర్నలిస్ట్ ను ఈ తీరున అరెస్టు చెయ్యడం సరికాదని, సాటి జర్నలిస్ట్ గా, ఈ విధానం బాధ కలిగించిందని  ఎక్కువ మంది   జర్నలిస్టులు తమ స్పందనలు వినిపించారు. ఈరోజు ఆర్ణబ్ అయ్యాడు, రేపు మనకూ అదే పరిస్థితి రావొచ్చునేమోననే భయాన్ని, భావనలను మరి కొందరు వెలిబుచ్చుతున్నారు. ఆర్ణబ్ గోస్వామి అరెస్టు కొందరికి అనందం, కొందరికి ఆగ్రహంగా కలిగించింది. గోస్వామి విషయంలో జాతీయ స్థాయిలో,  మీడియా కూడా రెండు భాగాలుగా విడిపోయింది. కొన్ని సంస్థలు తటస్థ వైఖరిని అవలంబించాయి. ఎడిటర్స్ గిల్డ్ అరెస్టు తీరును ఖండించింది. ఈ దిశగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం కూడా రాసింది.

అర్ణబ్ శైలి భిన్నమైనది

నేటి మీడియాలో ఆర్ణాబ్ గోస్వామి శైలి భిన్నం. ప్రత్యక్ష ప్రసారంగా వచ్చే చర్చా కార్యక్రమాలలోనూ, ఇంటర్వ్యూలు చేసే సమయంలోనూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ, అతిధులను అడుగడుగునా అడ్డుకుంటూ విచిత్రంగా ఉంటుంది. ఈ తీరుపై మొదటి నుండీ ఎక్కువ మంది తప్పు పడుతూనే ఉన్నారు. ఆర్ణబ్ భాష, దేహభాషపై (బాడీ లాంగ్వేజ్ ) ఎక్కువమందికి అభ్యంతరాలే ఉన్నాయి. ఆయన్ను అభిమానించేవారూ కొందరుంటారు,  అనుసరించాలని ప్రయత్నం చేసే జర్నలిస్టులూ కొందరుంటారు. సరే, ఇది వేరే సంగతి. రిపబ్లిక్ టీవీ పూర్తిగా బిజెపికి మద్దతు ఇచ్చే మీడియా అనే ముద్ర ఏనాడో పడిపోయింది. ఆర్ణాబ్ ను బిజెపి గొంతుగానే ఎక్కువమంది భావిస్తారు. బహుశా! నేటి అరెస్టుకు అది కూడా ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు.అసలే,  బిజెపికీ-మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి అస్సలు పడడంలేదు. రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే, భగ్గుమనే చందంగా మారింది. దీనికి తోడు, సుశాంత్ సింగ్ కేసు, బీహార్ ఎన్నికలు  మొదలైనవి దీనికి ఆజ్యం పోశాయి.

మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలపైనా, పోలీసు అధికారులపైనా అర్ణబ్ ధ్వజం

మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, పోలీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ టీవీ వండి వడ్డించిన కథనాలు మరింత ఆజ్యం పోశాయి. రిపబ్లిక్ టీవీ అంటేనే,  ఆర్ణబ్ గోస్వామి. ఆర్ణబ్ గోస్వామి అంటే,  రిపబ్లిక్ టీవీ అన్న విషయం అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం కేసు ఎన్ని మలుపులు తిరిగిందో,ఆర్ణబ్ వెర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు కూడా అన్నే మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఇంతకూ సుశాంత్ సింగ్ కేసు పక్కకు వెళ్ళిపోయిందనే అనుకోవాలి., కొత్త కొత్త రాజకీయ రూపకాలన్నీ తెరపైకి వచ్చేశాయి. వీటి నేపథ్యంలో, రేటింగ్ పెంచుకోడానికి కొన్ని ఛానల్స్ అక్రమమార్గాలు పడుతున్నాయని, అందులో రిపబ్లిక్ టీవీ కూడా ఉందని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇది మీడియాకు సంబంధించిన విషయం

మీడియాకు, ముఖ్యంగా,  వార్తా ఛానల్స్ కు సంబంధించిన అంశం కాబట్టి,  ఇది ఒక తీరులో సాగుతోంది. అసలు ఈ అంశంలోనే ఆర్ణబ్ ను అరెస్టు చేసి, దర్యాప్తు పేరుతో మహారాష్ట్ర పోలీసులు వేధించాలని ప్రణాళిక చేస్తున్నారనే వార్తలు  ఆమధ్య బాగా వైరల్ అయ్యాయి. ఇంతలో,ఒక  పాత కేసును  మరోసారి బయటకు తీయడంతో,  ఇంకో కొత్త అధ్యాయం ఆరంభమైంది. దీని సారాంశమే, నేటి ఆర్ణబ్ గోస్వామి అరెస్టు పర్వం. ఈ కేసుల విషయాలన్నీ అలా ఉంచగా, బిజెపి-మహారాష్ట్ర ప్రభుత్వం-మధ్యలో గోస్వామిగా… మరో కథ మొదలైంది. ఈ రూపకాలన్నీ ఎటువంటి రూపాలు తీసుకుంటాయో తెరపై చూడాల్సిందే. ఆర్ణబ్ కు బిజెపి ఢిల్లీ పెద్దల అండదండలు  ఉన్నా మేము చూడండి. ఎలా అరెస్టు చేశామో! అనే సంకేతాన్ని,  మహారాష్ట్ర ప్రభుత్వం  దేశానికి ఇవ్వడం కోసమే ఈ అరెస్టు తంతు, అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

అర్ణబ్ అరెస్టుకూ, జర్నలిజానికీ సంబంధం లేదు

ఇప్పుడు ఆర్ణబ్ అరెస్టు అయ్యింది ఒక జర్నలిస్ట్ గా కాదు. 2018లో అన్వయనాయక్, అనే ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్యకు కారణం ఆర్ణాబ్ గోస్వామి మరికొందరు, అనే అంశంలో.సూసైడ్ నోట్ లో ఆర్ణాబ్ పేరు ఉండడం వల్ల, దాన్ని మూలంగా తీసుకొని, మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం, కోర్టు 14రోజుల జ్యూడిషల్ కస్టడీ  విధించింది.కరోనా నేపథ్యంలో, 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని పోలీసులకు సూచించింది.తమ కస్టడీకి అప్పజెప్పాలంటూ, పోలీసులు చేసిన అభ్యర్ధనను  కోర్టు తిరస్కరించింది.మహారాష్ట్ర రాయ్ గడ్ జిల్లాలోని  ఆలీబాగ్ కోర్టులో ఆర్ణాబ్ ను ప్రవేశపెట్టారు. ఈ క్వారంటైన్ లో లేదా ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూద్దాం. ప్రస్తుతం ఆర్ణబ్ అరెస్టుకు కారణమైన అన్వయ నాయక్ కేసు గత బిజెపి ప్రభుత్వంలో, పోలీసులు క్లోజ్ చేశారు. ప్రస్తుత శివసేన ప్రభుత్వం తిరిగి బయటకు తీసింది.

రాజకీయ ప్రాబల్యాలబట్టి కేసులు మూసుకుంటాయి, తెరచుకుంటాయి

రాజకీయ ప్రాబల్యాలలు, ప్రాధామ్యాలను బట్టి, రాజకీయాల కోసం ఇలా కేసులను మూస్తుంటారు, తిరిగి తెరుస్తుంటారు.  లేదా కొత్త కొత్త కేసులు బుక్ చేస్తుంటారు అనే విషయం  ఈ అరెస్టుతో సామాన్యుడికి కూడా మరోమారు అర్ధమయ్యేట్టు చేసింది.అదే విధంగా  రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఒక్కొక్కసారి, ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరకంగా వ్యాఖ్యలు చేస్తుంటాయని, మామూలు మనిషికి కూడా ఇంకోసారి బోధపడింది. తమకు నచ్చినవారినో, మద్దతుదారునో, కావాల్సినవాడినో ఏదైనా ప్రభుత్వం అరెస్టు చేస్తే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అంటారు.ఎవరైనా జర్నలిస్ట్ లేదా, నాలుగు స్తంభాల్లో ఏదో  ఒక స్తంభానికి చెందిన వ్యక్తి అయితే, రాజ్యాంగ స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి సంకెళ్ళు పడ్డాయనే విమర్శలు వెల్లువెత్తుతాయి.

న్యాయవ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకం కారాదు

తమ ప్రభుత్వంలో, ఇవే రంగాలకు చెందినవారు అరెస్టు అయితే, మౌనముద్రను ఆశ్రయిస్తారు.ఈ వైఖరి రాష్ట్రాలలో, దేశంలో యధేఛ్చగా సాగుతోన్న సంస్కృతి అని మేధావులు మండిపడుతున్నారు.ఇన్ని వ్యవస్థల మధ్య, న్యాయ వ్యవస్థ భూమిక ఎంతో కీలకమైందని నిపుణులు అంటున్నారు. న్యాయవ్యవస్థ  సంపూర్ణంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తన పాత్ర పోషించిననాడు న్యాయం, ధర్మం రాజ్యమేలుతాయని న్యాయశాస్త్ర  పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.చట్టానికి ఎవ్వరూ అతీతం కాకపోయినా, ఇన్ని వ్యవస్థల మధ్య న్యాయ వ్యవస్థ ఉనికి, నిర్వహణల పాత్రలు ప్రశ్నార్ధకాలుగా మారకూడదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో, నిజమైన జర్నలిజం, నిజమైన జర్నలిస్టుల రక్షణ కూడా కీలకమే.అన్ని రంగాల్లో కలితీ, కాలుష్యం కొంతకాలంగా పెరిగిపోతోందనే వాదనలను ఏకీభవించక తప్పదు.

సమాన్యుడు నిస్సహాయుడు

మొత్తంగా, ఈ పరిణామాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు.ఉదాహరణలు ఇవ్వకపోయినా,  అర్ధంకావాల్సిన వారందరికీ అర్ధమవుతూనే ఉంటాయి.అర్ధమవుతోన్నా.. ఏమీ చేయలేని పరిస్థితిలో సామాన్యుడు మిగిలిపోతున్నాడు.జవాబులు తెలిసినా, సమాధానాలు చెప్పకపోతే, తల వేయిముక్కలవుతాయి, అనే మాటలు, పాత చందమామ పుస్తకాల్లో వెతుక్కోవాలి. ఆర్ణాబ్ గోస్వామి కథ  కొన్ని రూపకాల ప్రతిరూపమే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles