ముంబయ్ : రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామిని అరెస్టు చేయరాదనే ఉత్తర్వు జనవరి 15వ తేదీ తర్వాత వర్తించదని ముంబయ్ పోలీసులు హైకోర్టులో శుక్రవారంనాడు తెలియేశారు. టీవీ రేటింగ్ పాయింట్ల కుంభకోణంలో మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సవాలు చేస్తూ అర్ణబ్ గోస్వామి పిటిషన్ దాఖలు చేశారు. అర్ణబ్ ని అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు ముంబయ్ పోలీసులను లోగడ ఆదేశించింది.
ఒక కేంద్ర సంస్థను (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్) నమ్మదగినది కాదు అని ఒక రాష్ట్రప్రభుత్వం అనడం చాలా ఆసక్తికరంగా ఉన్నదంటూ రిపబ్లిక్ టీవీ తరఫున హైకోర్టులో వాదించిన హరిష్ సాల్వే వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన మరో ప్రముఖ న్యాయవాది కపిల్ శిబ్బల్ ఆ మాట మళ్ళీ అన్నారు. ‘‘మీరు (ఈడీ అధికారులు) నమ్మదగినవారు కాదని అంటాను,’ అంటూ స్పష్టం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదించారు. ‘‘ ఈ కేసులో ఈడీ ప్రమేయానికి నేను పూర్తిగా అభ్యంతరం చెబుతున్నాను. ఈడీ నిజాయతీ గురించి నాకు తెలుసును. ఈ కేసులో ఇంత ఉత్సాహం చూపుతున్నారు ఎందుకని?’’ అంటూ శిబ్బల్ వ్యాఖ్యానించారు.
ఈ కేసును జనవరి 29 మధ్యాహ్నం గం. 12.30 లకు కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి వచ్చే శుక్రవారం 22వ తేదీకి వాయిదా వేయాలని అనుకున్నారు. కానీ సాల్వేకు ఆ రోజు వీలు కాదనీ 29కి వాయిదా వేయాలనీ కోరారు. కపిల్ శిబ్బల్ దానికి అంగీకరించారు. అంగీకరించారు. జస్టిస్ షిండే జనవరి 29కి వాయిదా వేశారు. ఇది జూమ్ లో జరిగిన విచారణ. అంతర్జాలంలో హైకోర్టు విచారణ ప్రతి శుక్రవారం జరుగుతోంది. ముబయ్ పోలీసులు తాము జరిపిన దర్యాప్తు ఏ స్థాయిలో ఉన్నదో వివరిస్తూ ఒక నివేదిక సమర్పించారనీ, వచ్చే శుక్రవారం వరకూ అర్ణబ్ గోస్వామికి రక్షణ పొడిగించవచ్చుననీ, తాను సోమవారంనాటికి సమాధానం దాఖలు చేస్తాననిశిబ్బల్ అన్నారు. గురువారంనాటికి తన సమాధానం కూడా సమర్పిస్తానని సాల్వే అన్నారు. ఈ కేసులో ఈడీ ఇంప్లీడ్ కావడానికి అనుమతి కోరుతూ తాను ఐఏ (ఇంప్లీడింగ్ అప్లకేషన్)ను దాఖలు చేశానని సాల్వే చెప్పారు. ఈడీ అఫిడవిట్ దాఖలు చేసిందని అనీల్ సింగ్ చెప్పారు. ఈ కేసులో ఈడీ ప్రమేయానికి తాను అభ్యంతరం చెబుతున్నానని కపిల్ శిబ్బల్ అన్నారు.