Thursday, November 21, 2024

పరమాత్ముడవని తెలియక చులకనగ పిలిచాము కృష్ణా

28 తిరుప్పావై కథలు

శ్రీకృష్ణుని చేత గీతా జ్ఞానాన్ని అందుకున్న తరువాత గాని అర్జునుడికి ఆయన పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కాలేదు. అప్పుడు అయ్యో స్నేహితుడిగా భావించి కృష్ణా మాధవా స్నేహితుడా అని ఎన్ని సార్లో నోరుజారాను కదా అని అర్జునుడు బాధ పడ్డాడు.

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే మాధవ హే సఖేతి

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేనవా2పి

ఆ విధంగా అర్జునుడు బాధపడినట్టే మేమూ బాధపడుతున్నాం. నీ సౌలభ్యం తెలిపే గోవిందుడి నామం ముందు పరత్వ ప్రకాశమైన నారాయణ నామం ఎంతో చిన్నది. అజ్ఞులకు గోవింద నామం చిన్న అనిపిస్తుంది. కాని సర్వజ్ఞులకు నారాయణ నామ చిన్నగా తోస్తుంది. మేము కూడా ఒకరినొకరు పిచ్చిపిల్లా, చెవిటివా మూగవా అని అనుకున్నాం. అందుకు మాలోమేము క్షమాపణ కోరుకుంటున్నాం. శీరి అరుళాదే ఇఱైవా నీ తారాయ్ పఱై అంటూ సర్వాన్ అశేషతః క్షమస్వ అని శ్రీమద్రామానుజులు ప్రార్థించినట్టు సకల పాపాలను అశేషంగ చేశాం స్వామీ, క్షమించి కటాక్షించాలి శ్రీ కృష్ణా.

శ్రీ కృష్ణ: నామీద భక్తి కుదరాలంటే వేల ఏళ్ల పాటు కర్మ భక్తి మార్గాలలో ఒక్కటైనా మీరు అనుష్టించి ఉండాలి కదా.. అదేమైనా ఉందా?

గోపికలు: మా తెలివి నడవడికలు చూస్తే కర్మభక్తి మార్గాలలో ఒకటైనా ఉంటుందనే అనుమానం వస్తుందా అసలు. మాకు జ్ఞానం ఎక్కడిది. పుట్టినప్పడినుంచి పశువులే మాకు బంధువులు మిత్రులు. వాటి వెంట అడవులు తిరిగే వాళ్లం.

శ్రీ కృష్ణ: అడవుల వెంట తిరిగినా సరే, ఏవైనా పుణ్యక్షేత్రాల్లోనైనా ఉన్నారా, కనీసం ఆ కారణంమీదైనా మీకోరికలు తీర్చవచ్చు.

Also read: అహంకారాన్ని లోనుంచే కాల్చే నిప్పు శ్రీకృష్ణుడు

గోపికలు: పశువులకు గడ్డిమేయడానికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఆగుతాం. అదే మాకు పుణ్యక్షేత్రం. అయినా అడవుల్లో కర్మయోగాదులు చేయడానికి ఏ సౌకర్యాలుంటాయి. ఆ ప్రసక్తే లేదు.

శ్రీకృష్ణ: పోనీ అడవుల్లో వానప్రస్థాశ్రమ ధర్మమైనా పాటించవచ్చుకదా.. ఆ కర్మయోగమైనా ఉందా?

గోపికలు: ఎక్కడి వానప్రస్థం. ఆకులు అలమలు తిని శరీరాన్ని కృశింపచేసి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ల లేదు. పొట్ట నింపుకోవడానికి తిండి తీసుకుపోయి తినేవాళ్లం. స్నానంలేదు సంధ్య లేదు. అతిధులకు ముందు పెట్టి తినాలన్న నియమాలూ లేవు. తూర్పుకు ఎదురుగా కూచొని తినాలని చెప్పిన వారూ లేరు. చేసే వారూ లేరు. పశువులు కూర్చుంటే మేం కూర్చుంటాం నిలబడితే నిలబడతాం. అవి నడిస్తే మేమూ నడుస్తాం. ఆవులు నెమరు వేయనపుడు కూడా మేం మేస్తూ ఉంటాం. ఎంగిలని, తినకూడదని, పులిసిందనే ఆంక్షలేమీ లేవు. ఇదే కర్మయోగం అనుకుంటే.. అనుకోవచ్చు.

శ్రీ కృష్ణ: కర్మ ఏం చేస్తేనేం. అందులో కూడా జ్ఞానయోగం అనుష్టించవచ్చుకదా. మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు గొప్పజ్ఞాని కాలేదా? మీరు ఆవులను రక్షించిన వారు కదా, నగరంలో ఉండే విదురుడు జ్ఞానాధికుడైతే మీరెందుకు కాకూడదు. మైత్రేయి, శ్రమణి మొదలైన అమ్మాయిలు మంచి జ్ఞానులుగా కీర్తి నొందలేదా. మీరు జ్ఞానయోగాన్ని అవలంబించవచ్చు కదా.

Also read: ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగిన అరివీర భయంకరుడు

గోపికలు: మాకు వివేకం ఉంటే కదా జ్ఞానయోగం. మాకూ జ్ఞానయోగానికి మధ్య సముద్రానికి పర్వతానికి ఉన్నంత తేడా ఉంది.

శ్రీకృష్ణ: వివేకం లేకపోతే పోనీ మీకు అనురాగం ఉంది కదా. జన్మాంతరాలనుంచి వచ్చిన జ్ఞానం పరిపక్వమై భక్తి యోగంగా మారాలి కదా.

గోపికలు: వివేకమేలేకపోతే అందులో భాగమైన భక్తి ఎక్కడినుంచి వస్తుంది? జ్ఞానమూ లేదు. భక్తీ లేదు.

శ్రీ కృష్ణ: సరే జ్ఞానులు వివేకవంతులూ కూడా ఇదే అంటుంటారు. ఇప్పుడు మీలో జ్ఞాన భక్తులు లేకున్నా ఇక ముందు రారని ఎలా అంటారు?

గోపికలు: మాకుల పరిస్థితులన్నీ చూస్తే ఎప్పడికైనా వివేకం వస్తుందని ఎవరైనా అనుకుంటారా? భక్తులమై, సర్వజ్ఞులమై మిమ్ము ఆశ్రయించగల సమర్థత లేదు. నీవు తప్ప మరో ఉపాయమే మాకు లేదు. కలలో కూడా తోచదు.

శ్రీ కృష్ణ: కర్మ లేదు, జ్ఞానంలేదు, భక్తి లేదు. అయితే ఇక మిమ్మల్ని వదిలేయవలసిందేనా?

గోపికలు: అదేం మాట? ‘‘రామో విగ్రహాన్ ధర్మః’’, ‘‘కృష్ణః ధర్మం సనాతనం, పుణ్యానామపి పుణ్యోసౌ’’ అని కీర్తించబడే పుణ్యమూర్తికి పాలు అన్నం పెట్టి పోషించే మాకు పుణ్యం లేకపోవడమేమిటి? స్వార్జిత ఆస్తి లేకపోతే పిత్రార్జితం లేదంటారేం? సాధ్యమైన పుణ్యం లేదేమో కాని సిద్ధమైన పుణ్యం ఉంది కదా. నిన్ను పొందిన మా పుణ్యం చిన్నదా ఆ భాగ్యాన్ని మించిందేదయిన ఉందా కన్నయ్యా.

Also read: ఈ లోకాలు కొలిచి నీ పాదాలెంత నొచ్చుకున్నాయో

శ్రీ కృష్ణ: వివేకహినులమంటారు, భాగ్యశాలురమనీ అంటారు. పొంతన లేదు కదా.

గోపికలు: అదే మరి మా అవివేకం అంటే..

శ్రీకృష్ణ: అయితే మిమ్మల్ని పరిత్యజించవలసిందేకదా.

గోపికలు: ఏ కొరతా లేని గోవిందుడివి నీవు. కాని మాజ్ఞానహీనతను తొలగించితేనే కదా నీవు పరిపూర్ణుడవయ్యేది.

శ్రీ కృష్ణ: ఓహో అయితే భగవానుడే శక్తి జ్ఞాన పూర్ణతలను ఇస్తాడని మీకు తెలుసన్నమాట. అయితే మీరు స్వరూప జ్ఞానము కలవారన్నమాట.

గోపికలు: మీకు స్వరూప జ్ఞానముంటేకదా మాకుండేది. నీవు నిత్యసూరులను వదిలి పరమపదాన్ని వదిలి ఈ గోవులమధ్య ఉంటున్నావు. నీవు నీస్వరూపజ్ఞానం మరిచిపోయావు అది మాభాగ్యం. నీ స్వరూపం నీకు జ్ఞాపకమున్నా, మా స్వరూపం మాకు జ్ఞాపకం ఉన్నానీవు మాకు లభించేవాడివే కాదు. మేము అపరాధాల్లో చక్రవర్తులం. నీవో సర్వస్వతంత్రుడివి. పరతత్వంలో లోపం ఉంది. తనతో సామ్యము పొందిన వారికి సమానులకు గానీ ఆయన దర్శనం లభించదు. ఈలోపం శ్రీకృష్ణా నీకు లేదు. పశుప్రాయులమైన మాతో కలిసి మెలిసి ఉంటావు. మాకోసం పశువులకోసం గోవర్ధనం ఎత్తావు. గోవిందుడివైనావు. మాకే జ్ఞాన కర్మ భక్తి మార్గాలు తెలిస్తే మీకు దూరంగా వెళ్లేవాళ్లం. రాక్షసవధ చేసి అమేయుడవైనా నీకు గోవిందనామమే ప్రీతి. ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకమ్ శరణం వ్రజ’’ అని నీవే చెప్పావు కదా. సాధనాలన్నింటినీ సమూలంగా వదలి నన్ను ఒకణ్ణే ఉపాయంగా స్వీకరించు అని ఆదేశించావు కదా. నీవు పరిపూర్ణుడివి. లోపం లేని వాడివి.

Also read: భాగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?

శ్రీకృష్ణ: నేను పరిపూర్ణుడినైతే మీ కోరికలు తీర్చాలనే నిర్బంధం ఏదీ లేదు కదా.

గోపికలు: నీకు మాకు ఉన్న సంబంధం గమనిస్తే మా అభీష్ఠం తీర్చకుండా ఉండలేవు. అయినా ఈ బంధం పొమ్మంటే పోయేదా? మమ్ము వదలి నీవు లేవు. నిన్నువదలి మేమూ లేము. నీవు దయతో పరిపూర్ణుడవుగానూ మేము దయనీయతా పరిపూర్ణులము గాను ఉన్న ఈ సంబంధాన్ని తొలగించడం వీలు గాదు కదా. నేను మీకు బంధువుగా జన్మించి ఉన్నాను. మీరు వేరుగా భావించనవసరం లేదని నీవే హెచ్చరించావు కదా నీవే అన్యథా భావించవచ్చునా.

శ్రీకృష్ణ: నారాయణ అనేది పర్వతాన్ని గుర్తుకు తెచ్చే పేరు. నేను విసుగెత్తి వదిలేసిన పర్వతాన్ని నాకు గుర్తు చేస్తూ నారాయణ నామంతో పిలిచారు. ఇప్పుడేమో ఏలోపమూ లేని గోవిందా అనీ కూడారై వెల్లుంగోవిందా అనీ అంటున్నారు.

గోపికలు: మేము తెలియక ఆ పేరుతో పిలిచినందుకు కోపగించకుండా సహించడం నీ కర్తవ్యం కదా శ్రీ కృష్ణా. నీ మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆ విధంగా పిలిచాం. ప్రేమకలిగిన వారు పక్కపక్కనే పడుకున్నప్పుడు నిద్రలో ఒకరి కాలు మరొకరికి తగిలితే కోపం తెచ్చుకుంటారా? నారాయణా అనీ నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని చిన్న పేరుతో పిలవడం తెలియక చేసిన తప్పు. మన్నించు.

శ్రీ కృష్ణ: అది సరే మీరు ఫల సిధ్ధి పొందడానికి తగిన సంబంధం మన ఇద్దరి మధ్య ఉందనుకున్నా మీరూ దానికోసం కొంత ప్రయత్నం చేయాలి కదా.

గోపికలు: నీవు ఇవ్వదలచుకోకపోతే మేం ఎన్ని ప్రయత్నాలు చేసి ఏంలాభం? కాళ్లు చేతులు తప్పుచేసాయని వాటిమీద కోపం ప్రకటిస్తారా ఎవరైనా? మేం నీ సొత్తు. సొత్తు మరిచినా స్వామి సొత్తును మరవకూడదు కదా. మీ ఆస్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు వదులుకొంటారా? నీ శేషత్వం కాపాడుకోవడానికైనా మాకు పఱై ఇవ్వాలి. అర్థించు వాడి అభిమతాన్ని నెరవేర్చడమే సర్వేశ్వరుని ఈశ్వరత్వానికి ఉచితంగా ఉంటుంది. కనుక స్వామీ నీవే మా అభిమతాన్ని పూర్తి చేయి.

ఈ విధంగా సంభాషణారూపంలో సాగిన తత్వబోధ ఈ పాశురంలో విశదం అవుతుంది.

Also read: సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles