సంపద సృష్టిద్దాం – 03
(కిందటి వారం తరువాయి)
మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ ప్రస్తుత పరిస్థితి ఏమైనప్పటికీ అన్నింటినీ మార్చేయగల సత్తా ఒక్క మాటకు ఉందంటే మీరు నమ్ముతారా? జస్ట్ ఒక్క మాట. ‘థాంక్యూ’. అంతులేని సంపదను మీ చెంతకు చేర్చే అత్యంత శక్తిమంతమైన పదం థాంక్యూ. మీ భవిష్యత్తును సమూలంగా మార్చేయగలిగే మహామంత్రమిది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు ఇప్పుడెలా ఉన్నాయో పట్టించుకోకండి. మీరు అనుకున్న పనులన్నీ చేయడానికి కావలసినంత డబ్బు మీ దగ్గర లేదన్న విషయాన్ని మర్చిపోండి. మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం మానేయండి. వీటన్నింటినీ సవరించుకుంటూ, సరిచేసుకుంటూ.. ఉత్తమమైన, ఉన్నతమైన పరిస్థితిలోకి.. ముఖ్యంగా మీరేమీ కష్టపడకుండా.. తీసుకునిపోవాలంటే, కేవలం ఒకే ఒక్క పనివల్ల సాధ్యమని విశ్వసించండి. అది కృతజ్ఞత తెలపడం. మీలోని నెగటివిటీని కూకటివేళ్లతో పెకలించి, టన్నుల కొద్దీ పాజిటివిటీని నింపే ఒక మహత్తర సాధనం ఈ కృతజ్ఞత. మీ కెరియర్ ను గాడిలో పెట్టి, విజయాన్ని సమకూర్చి, కోరుకున్నదల్లా సిద్దించేలా చేయడానికి కృతజ్ఞత చెప్పాల్సిందే. దీనిని వివరించడం సులువే కాని, అవగాహన చేసుకోవడమే కష్టసాధ్యం. మనం తీసుకునే ముందు ఇచ్చేవారమై ఉండాలి. అంతులేని సంపదను కోరుకునేవారు గమనించాల్సింది, ఆ సంపదను స్వీకరించే ముందు ఏమివ్వగలరు? అది కేవలం కృతజ్ఞత తెలపడమే.
Also read: పోరాటంలోనే విజయం
విశ్వమే ప్రాతిపదిక
అసలు కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? భగవంతుడికా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకా, కృతజ్ఞత వెలిబుచ్చడానికి కారణమైన విషయానికా అనే సందేహం వస్తోంది కదా. సంపద సృష్టికర్తలైన కాబోతున్న కోటీశ్వరులు ముందుగా తెలుసుకోవలసింది, మన సబ్జెక్టులో దేవుడు లేడు, పూజలు లేవు. మంత్రతంత్రాలు అసలే లేవు. మహిమలు, ప్రార్థనలు ఉండవు. మన మనసే అంతా. ఇది మైండ్ ప్లే. మనం మన మనసుతో ఆడుకునే ఉపయోగకరమైన ఆట. మనమున్న భూమి, అది స్థిరంగా ఉండడానికి కారణమైన మన సౌరమండలం, మనలాంటి అనేక సౌరమండలాలు పొదిగినట్లున్న మన పాలపుంత, ఇలాంటి కోటానుకోట్ల పాలపుంతలను తనలో నిక్షిప్తం చేసుకున్న మన ఈ విశాల విశ్వం. ఊహించారా? ఆ విశ్వమే అన్నింటికీ ఆధారం. మనం చూడగలిగినా, చూడలేకపోయినా ఈ విశ్వమంతా అల్లుకుని పరుచుకున్న ఈథర్ నుంచే జీవులు ఏర్పడిన సంగతి మనకు తెలిసిందే. ఈ విశ్వం గురించే నేను చెప్తున్నాను. ఈ విశ్వమే అంతులేని సంపదలకు మూలం. డబ్బు, బంగారం, ఐశ్వర్యం మనకు చేకూర్చిపెట్టేది ఈ విశ్వమే. సంపదను మన చేతికి అందించేది ఈ విశ్వమే. ఈ విశ్వానికే మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. విశ్వమే మనకు శక్తినిచ్చే జీవధార. విశ్వమే మనకు ప్రాణశక్తి, విశ్వానికి కృతజ్ఞత. విశ్వానికి నిరంతర కృతజ్ఞత.
రాబోయే రోజులంతా, సంపద సృష్టికర్తలు, ఇక్కడ చెప్పిన విషయాలను ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. రాత్రి పడుకునే ముందు డబ్బు గురించి ఆలోచిస్తూ పడుకోండి. డబ్బు మనకు అందించే సుఖాలను ఊహిస్తూ నిద్రలోకి జారుకోవాలి. లేచిన వెంటనే సంపాదనకు మరో కొత్త రోజును ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత తెలపండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత ప్రకటించండి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రణమిల్లండి. తోడబుట్టిన అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు, వారి కుటుంబాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత ప్రకటించండి. బంధాన్ని పంచుకున్న మీ జీవిత భాగస్వామికి, మీ ద్వారా విశ్వంలో ఆవిర్భవించిన బిడ్డలు.. వీరే మీ జీవితానికి పరమార్ధమైనందుకు హృదయపు లోతుల్లోంచి కృతజ్ఞత అందించండి. స్నేహితులకు, మీ విజయంలో భాగస్వాములకు, మిమ్మల్ని నిరంతరం అప్రమత్తం చేసే మీ శత్రువులకు కృతజ్ఞతలు తెలియజేయండి. అంతా మనసులోనే జరగాలి. సూర్యుడు తన విధులకు హాజరు కాకముందే, మీరు నడుచుకుంటూ ఈ పనులు చేయవచ్చు. వ్యాయామం చేస్తూ కృతజ్ఞత ప్రకటించవచ్చు. కాలకృత్యాలు తీర్చుకుంటూ మనసులోనే థాంక్స్ చెప్పొచ్చు.
అడుగు – నమ్ము – పొందు
కృతజ్ఞత ప్రకటి స్తున్నప్పుడు వారు మీతో నవ్వుతూ తుళ్లుతూ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉన్నట్టుగానే వారిని ఊహించుకోవాలి. దాదాపు పావుగంట నుంచి అరగంట పాటు ఈ సాధన కొనసాగాలి. జీవిత పర్యంతమూ ఈ సాధన కొనసాగించాలి. కృతజ్ఞతా ప్రకటన వాక్యాలు రోజురోజుకూ కొత్తవి చేరుస్తుండాలి. కొత్తకొత్త మాటలు మనలో నిరంతర ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాయి. చెప్పినవే చెప్పినా మీ సొమ్మేం పోదులెండి. ఒకటే వెంకటేశ్వర సుప్రభాతం ప్రతిరోజు స్వామివారికి వినిపిస్తున్నా, ఆయన బోర్ అనుకోకుండా వినడం లేదూ! మన కృతజ్ఞతా ప్రకటనలో మాటలు రిపీట్ అయినపుడు పట్టించుకోకండి. మాటల్ని పట్టుకు వేలాడకండి. భావమే ముఖ్యం. ఎంత గాఢంగా అవతలి వ్యక్తికి కృతజ్ఞత చెప్తున్నామో అదే ముఖ్యం. సంపద సృష్టించాలనుకునే సాహసవీరులంతా కృతజ్ఞతలు విధిగా తెలపాల్సిందే. రోజులో కనీసం వెయ్యిమార్లు మీ నోటినుంచి థాంక్స్ అనే మాట వస్తుండాలి. మీరు ఆ మాట అంటున్నకొద్దీ మీ సంపాదన ద్వారాలు తెరుస్తున్నట్టే. విశ్వానికి మీరు చెల్లించే కృతజ్ఞతకు బదులుగా మీకు సంపద సమకూరుతుంది.
తప్పక చేయండి:
మీ వంశవృక్షం తయారు చేయండి. ఆ ఫ్యామిలీ ట్రీలో అమ్మ తరపు, నాన్న తరపు ప్రతి ఒక్కరి వివరమూ చేర్చండి. కనీసం నాలుగు తరాల వెనక్కి వెళ్లండి. వారి పేరూ ఫోటో మాత్రమే కాదు, మొబైల్ నెంబరు కూడా సేకరించండి. తర్వాత ఏం చేయాలో చెప్పనవసరం లేదుగా. ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసేస్తారుగా. నాకు తెలుసు.
Also read: అంతా మన మనసులోనే…
(ఇంకా ఉంది)
–దుప్పల రవికుమార్