Thursday, November 21, 2024

ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు

ప్రాథమిక విద్య పునాదిని పటిష్టం చేయడానికీ, పునర్వవస్థీకరించడానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందించదగినది. రెండేళ్ళుగా విద్యాసంస్కరణలపైన జాతీయస్థాయిలో కసరత్తు జరుగుతున్నప్పటికీ నిర్దిష్టమైన అంశాలు ఏవీ వెల్లడి కాలేదు. 2020 మధ్యలో మాత్రం అయిదో తరగతి వరకూ ప్రీస్కూల్ అనీ, 6 నుంచి 8 వరకూ మిడిల్ స్కూల్ అనీ, 9 నుంచి 12 వరకూ (5+3+3+4) హైస్కూలు అనీ పిలుస్తారని చెప్పారు. ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవలు నిర్దిష్టంగా ఉన్నాయి. ఈ చొరవలను ప్రజలు స్వాగతించడమే కాకుండా తల్లిదండ్రులూ, ప్రవీణులూ ఈ క్రమంలో పాలుపంచుకోవాలి.

ఏ విత్తు నాటితే ఆ మొక్కే మొలుస్తుంది

మనం ఏ విత్తు నాటితే ఆ మొక్కే మొలుస్తుందనే సామెతను ఇంగ్లీషులో చెప్పే విధంగా ‘యాజ్ వి సో, సో వి రీప్ ( As we sow, so we reap) అనే టైటిల్ తో 2019లో ఒక పుస్తకం రచించాను. మన పిల్లలను శక్తిమంతులను చేసే క్రమంలో కొన్ని లొసుగులను ఎత్తి చూపాను. ‘తారలు దిగి వచ్చిన వేళ’ అనే శీర్షికతో  ఈ పుస్తకం తెలుగులోకి అనువదించారు. పిల్లలను పెంచడంలో పునాది దశలో తీసుకోవలసిన చర్యల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించాను.  పిల్లల బాల్యాన్ని పట్టించుకోకుండా విద్యావ్యవస్థ ఎంత నిర్లక్ష్యం చేసిందో చూపించాను. పిల్లల తొలి సంవత్సరాల గురించి పెద్దలతో చర్చించకపోతే, మన కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలూ, మన వేర్లు ఆధారంగా విద్య నేర్పకపోతే ఒక తరానికీ, దానికి మునుపటి తరానికి తేడా  ఉండదు. ‘పునాది పాఠశాలల’ (ఫౌండేషన్ స్కూల్స్) గురించి ఏపీ ఆలోచించడం మంచి పరిణామం. వ్యవస్థ నిర్మించడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యం పునాది వేయడం, ప్రాథమికాంశాలను పట్టించుకోవడం.

అంగన్ వాడీలనూ,ప్రాథమిక పాఠశాలల స్థాయినీ ప్రీప్రైమరీలో రెండు సంవత్సరాలుగా పరిగణించి, ప్రాథమిక పాఠశాలలో మొదటి, రెండవ తరగతులు బోధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 3,4,5 తరగతులను కలిపి సెకండరీ హైస్కూల్ లో  ప్రైమరీ, మిడిల్ లెవల్ గా పరిగణించాలని ప్రతిపాదన. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలు సున్నిత మనస్కులై ఉంటారు. వారు ప్రభావాలకు లోను అవుతారు, వారికి మానసిక వికాసం కలిగేది, మెదడు పెరిగేది ఆ వయస్సులోనే. కనుక ఆ దశలో పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని ప్రభుత్వం అనుకుంటూ ఉండవచ్చు.  పిల్లల చదువులకు పునాది వేసే క్రమంలో అవసరమైనవి స్కూలు మాత్రమే కాదనీ, ఇతర అంశాలు కూడా ఉన్నాయనీ విస్మరించారు. ఇక్కడ పిన్న వయస్సులో పిల్లలకు ఎట్లా బోధించాలనే అంశాన్నీ, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ప్రమేయం కల్పించాలనే విషయాన్నీ విస్మరించారు.

డిజిటల్ లైబ్రరీల ఆలోచన మంచిదే

డిజిటల్ లైబ్రరీలను 1600 గ్రామాలలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించడం మరో మంచి పూనిక. దీనిని ప్రాథమిక విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో భాగంగానే చూడాలి. ఎందుకంటే స్కూళ్ళలో డిజిటల్ పాఠాలు చెప్పడానికి అవసరమైన పరికరాలను (టూల్స్)ను సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది. పాఠ్యాంశాలను పట్టించుకోకుండా, వాటిపైన దృష్టి పెట్టకుండా ఆశించిన ఫలితాలు దక్కవు. ఈ చొరవలు విస్తృతమైన ధోరణులకు సంబంధం లేనివని అనుకోజాలము. మన జాతీయ మానసిక స్థితి అన్నిటికంటే మౌలికమైన విషయం. ఉపాధికోసమే విద్య అనే ధోరణి ప్రాధాన్యం తగ్గడం లేదు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంతవరకూ ఆరు అంశాలను క్లుప్తంగా మనవి చేస్తాను.

మొదటిది, ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత జాతీయ సగటు కంటే, బీహార్ కంటే కూడా, తక్కువగా ఉన్నది ఎందుకని? మనం చాలా సర్వేలు జరిపాం. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న ప్రాంతాలనూ, వర్గాలనూ గుర్తించి వారిపైన దృష్టి కేంద్రీకరించలేకపోయాం ఎందుకని? కొన్ని వర్గాలలో మూడింట ఒక వంతు మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు.

రెండవది, ప్రభుత్వ స్కూళ్ళలో ప్రాథమిక సదుపాయాలు ఉన్నాయి. మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఫీజులు ఉండవు. పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నా ఆ స్కూళ్ళలో ప్రమాణాలను ఎందుకు కాపాడలేకపోయాం? ‘అమ్మఒడి’ వంటి మంచి పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు ఎందుకని? ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వం తన బాధ్యతను వదిలివేసినట్టు ప్రైవేటు స్కూళ్ళు తామరతంపరగా మొలుస్తూ ఉంటే ఎందుకు ఉపేక్షించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం నిజాయతీగా, సమర్థంగా జరగలేదు.

మూడవది, పలు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఎందుకుంచారు, ఆ ఉద్యోగాలకు అర్హులే దొరకనట్టు? కొన్ని సంవత్సరాల కిందట 40 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఇటీవలే ఖాళీలు తగ్గుముఖం పట్టాయి.

నాలుగవది, విద్యారంగంపైన బడ్జెట్ వ్యయం పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ రాను రాను బడ్జెట్ కేటాయింపులు ఈ రంగానికి తగ్గుతూ వస్తున్నాయి ఎందుకని? తాజాగా ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించింది రూ. 24, 624 కోట్లు. 2019-20లో ఇదే పద్దుకింద రూ. 32, 618 కోట్లు. నానాటికి తీసికట్టు మిడతంభొట్టు అన్నచందంగా ఉంది. బడ్జెట్  కేటాయింపుల శాతం చూస్తే 2021-22 కి 16 శాతం నుంచి 10.7 శాతానికి తగ్గాయి. పెక్కు సంవత్సరాల కిందటే కొఠారీ కమిషన్ బడ్జెట్ లో 30 శాతం విద్యారంగానికి కేటాయించాలని సిఫార్సు చేసింది. ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా మనకంటే మెరుగుగా ఏమీ లేదనే వాస్తవం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉపశమనం పొందకూడదు.

అయిదవది, విద్యాసంస్థల నుంచి చాలా మంది నిపుణులు బయటకు వస్తున్నారు. విదేశాలకు వెళ్ళి మంచిపేరు తెచ్చుకంటున్నారు. దేశానికి మంచి పేరు తెస్తున్నారు. కానీ మన ప్రాథమిక, సెకండరీ విద్యావ్యవస్థలో ప్రమాణాలు పెరగడం లేదు. ప్రమాణాలు పెంచడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి.

ఆరవది, టెలివిజన్ బాగా విస్తరించింది. ప్రేక్షకులలో మూడింట ఒక వంతు మంది కంటే అధికంగా పిల్లలు ఉన్నారు. టీవీలలో ఏమి చూపిస్తున్నారనే విషయం పట్టించుకోవడం లేదు. స్కూల్ చానళ్ళు పెట్టాలనే ప్రభుత్వ సంకల్పం ఎంతవరకు వచ్చిందో తెలియదు. ధోరణిలో మార్పు కనిపించడం లేదు. పిల్లలను శక్తిమంతులుగా మలచడానికీ, వారిలో ఆసక్తిని పెంచడానికి పుస్తక పఠనం దోహదం చేస్తుంది. పుస్తకపఠనాన్నిప్రోత్సహించే చర్యలను ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. సంతోషం.

ఇంత జరుగుతున్నప్పటికీ దేశంలో పరస్పర విరుద్ధమైన పోకడలు కనిపిస్తున్నాయి. మొదటి విషయం ఏమిటంటే బోలెడు సందేహాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాలపైన చర్చ జరగనే జరగదు. నిర్ణయాలు తీసుకోవడం కేవలం అధికారపార్టీ చేయవలసిన పని అన్నట్టు విధాన నిర్ణయ క్రమంలో ఇతరుల పాత్ర లేదు. పారదర్శకత బొత్తిగా లేదు. రెండోది, స్థానికంగా పట్టించుకునే నాధుడు లేడు. స్కూల్ నిర్వహణలో విద్యార్థుల ప్రమేయం కానీ వారి తల్లిదండ్రుల ప్రమేయం కానీ ఉండటం లేదు. మూడోది, ప్రాథమిక విద్యాస్థాయిలోనే ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రమేయం కనిపిస్తున్నది. రాజకీయాలను దూరంగా పెట్టకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికపైన విద్యారంగంలో మేలైన మార్పు తీసుకొని రాగలమా?

ముదునూరు ప్రయోగం

నా స్వగ్రామం కృష్ణాజిల్లాలోని ముదునూరులోని పాఠశాల ఇప్పటి పరిస్థితికి తగిన అనేక దృక్పథాలను సూచిస్తుంది. నా గ్రామాన్ని నేను ‘‘ముగ్గురు అమ్మల ముదునూరు’’ అని అభివర్ణిస్తాను. ఎందుకంటే ముగ్గురు తల్లుల దూరదృష్టి వందేళ్ళ కిందట ఈ గ్రామవాసులను ప్రేరేపించి ప్రగతికి బాటలు వేసింది. అప్పటికే ముగ్గురు మహిళలకూ వైధవ్యం ప్రాప్తించింది. చదువులేదు. గ్రామానికి గట్టి మేలు చేయాలని వారు దృఢమైన సంకల్పం చెప్పుకున్నారు. మీరు ఊహించండి. ఒక పాఠశాలను నెలకొల్పడానికి మూడు దశాబ్దాల ముందే ఆ గ్రామంలో ఒక నిరక్షరకుక్షు అయిన వితంతువు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో పేరుప్రఖ్యాతులు గడించిన రచయితల పుస్తకాలు ఆ గ్రంథాలయంలో ఉంచారు.  వివాదాస్పదుడైన సామాజిక సంస్కరణవాది చలం రచనలు కూడా ఆ గ్రంథాలయంలో ఉండేవి. ఆ గ్రామంలో అనేకమంది యువజనులకు ఆ గ్రంథాలయం ప్రేరణశక్తిగా పని చేసింది. ఈ కారణంగానే దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆ గ్రామం కేంద్రం కావడమే కాకుండా ప్రపంచంలో తొలి నాస్తిక కేంద్రం కూడా అక్కడే వెలసింది. దీనికి ప్రధాన సూత్రధారి అయిన ఆ వితంతువు పేరు ఎక్కడా వినపడదు. ఆమె ఫోటో ఎక్కడా కనిపించదు. ఇప్పుడు కాదు అప్పుడు కూడా ఇంతటి నిర్మాణాత్మకమైన చర్య తీసుకోవడానికి చొరవ ప్రదర్శించిన మహిళ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ గ్రంథాలయంలోనే చర్చోపచర్చలు జరిగేవి. అన్ని వయస్సులవారూ, అన్ని రకాల నేపథ్యాలు ఉన్నవారూ, అన్ని కులాలకు చెందినవారూ చర్చలో పాల్గొనేవారు. భవిష్యత్తు నాయకులను ఈ గ్రంథాలయం తయారు చేసింది. మొదటి కమ్యూనిటీ రేడియోను ఆ గ్రంథాలయంలోనే పెట్టారు. అది కార్యాచరణ కేంద్రంగా మారింది. రెండు దశాబ్దాల అనంతరం అటువంటి నేపథ్యమే కలిగిన ఇద్దరు వితంతువులు మిడిల్ స్కూల్, హైస్కూలు భవనాలను నిర్మించారు. ఈ భవనాలకు వారి పేరు పెట్టలేదు. వారి ఫోటోలు కూడా లేవు. వారిని సన్మానించలేదు. స్థానిక వ్యక్తుల చొరవ కారణంగా ఇతర గ్రామాల కంటే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. అటువంటి స్థానిక పూనికలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? అటువంటి వారిని ఎంత వరకూ అనుమతిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు?

సర్కారు సర్వాంతర్యామి

ప్రభుత్వరంగంలో ప్రభుత్వం సర్వాంతర్యామి. ఆ కార్యకలాపాలలో పౌరులకు ప్రమేయం కల్పించరు. ప్రభుత్వం ఎంత ఎక్కువగా ఉనికి చాటుకుంటే అంత మంచిదని భావిస్తారు. కొన్నేళ్ళుగా మా గ్రామంలో నా అనుభవాన్ని ప్రస్తావిస్తున్నాను. బాలికల వృత్తివిద్యా (వొకేషనల్ సెంటర్) కేంద్రాన్ని నెలకొల్పేందుకు నేను ఎంఆర్ఓకు కొంత భూమినీ, నిధులనూ ఇచ్చాను. రెండేళ్ళపాటు ఆయన వెంటపడితే కానీ ఆ కేంద్రం పనులు పూర్తికాలేదు. అంతా అయిన తర్వాత ఆ భవనం లక్ష్యాన్నివిస్మరించి అందులో రెవెన్యూ కార్యాలయాన్ని పెట్టుకున్నారు. ఆ చేదు అనుభవం కారణంగా నేనే నేరుగా ఒక ప్రాథమిక పాఠశాల భవనాన్ని దళితవాడలో నిర్మించాను. స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో ఆ పాఠశాల నడుస్తోంది. దూసరపాలెంలో మరో స్కూలు భవనం నిర్మించేందుకు ఒక మిత్రుడిని ప్రోత్సహించి ఒప్పించాను. పాత గ్రంథాలయ భవనం బీటలు వారింది. దాని స్థానంలో కొత్త భవనం కట్టడానికి నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికి సంబంధించిన అధికారులు తమకు నేరుగా డబ్బు అందజేస్తే తాము భనవ నిర్మాణం చేస్తామని చెబుతున్నారు. నాకు నమ్మకం లేదు. అదే విధంగా హైస్కూలు భవనానికి డిజైన్ తయారు చేయించాను. వనరులు ఏర్పాటు చేశాను. తెలివైన ప్రధానోపాధ్యాయుడు భవన నిర్మాణానికి సంసిద్ధత వెలిబుచ్చారు. ఈ స్కూల్లో మా తండ్రిగారూ, నేనూ గత ముప్పయ్ ఏళ్ళుగా విద్యార్థులకు స్కాలర్ షిప్పులూ, ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులూ ఇస్తూ వస్తున్నాం. ఈ స్కూల్లో చదివినవారిలో చాలామంది పూర్వవిద్యార్థులు కూడా స్కూలుకోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చేయలేకపోతున్నారు.

మేలు చేయబోతే వేల ఆటంకాలు

మా గ్రామంలో గ్రంథాలయాన్ని చూసి ప్రేరణ పొంది ముదునూరు మిడిల్ స్కూల్ లోనే మూడేళ్ళపాటు ప్రతి ఏడాదికి ఒక సారి ఒక ప్రయోగం చేశాను. దాన్ని ‘ముదునూరు ప్రయోగం’ అని పిలిచేవాళ్ళం. ముందు టెలివిజన్, తర్వాత కంప్యూటర్, ఆ తర్వాత కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలు చదవడం. పుస్తకాలు ఇంటికి తీసుకొని వెళ్ళి చదవడాన్ని విద్యార్థులకు అలవాటు చేశాం. సాధారణంగా మనకున్న అభిప్రాయాలకు భిన్నంగా టెలివిజన్, కంప్యూటర్ కంటే పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులలో అవగాహన పెరిగింది. కంప్యూటర్లలో పాటలూ, పాఠ్యాంశాలకు అనుబంధమైన అంశాలూ ఉన్న 18 సాఫ్ట్ వేర్లు ఉపయోగించాం. రెండే రెండు విషయాలు చెప్పుకోవాలి. మొదటిది, స్కూలు స్థాయిలో మనం చొరవ చూపించి చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థుల అవగాహనలో, దృక్పథంలో మార్పు వస్తుంది. రెండవది, మనం ప్రవేశపెట్టే సంస్కరణలు నిజంగా విద్యార్థులను శక్తిమంతం చేస్తాయో లేదో తెలుసుకోవడానికి ప్రయోగాత్మకంగా ఎక్కడైనా అమలు చేసి చూడాలి. ముఖ్యంగా ప్రీప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ స్కూలు స్థాయిలో తీసుకునే చొరవల గురించి విద్యార్థులతో, తల్లిదండ్రులతో, ఇందుకు సంబంధించిన ఇతరులతో చర్చించి పారదర్శకంగా  నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.

నేను మా గ్రామంలోని పాఠశాలలనూ, ఇతర ప్రాంతాలలోని పాఠశాలలనూ సందర్శించే కార్యక్రమంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా నిమగ్నమై ఉన్నాను. కుటుంబంలోనూ, వెలుపలా పాటలు పాడడం, కథలు వినడం, ఆటలు ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, చదివిన విషయం గురించి ఇతరులతో మాట్లాడటం ద్వారా పిల్లల మనసులు వికసిస్తాయి. ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాల కంటే ఈ పద్ధతులు పిల్లలకు నేర్చుకోవడానికీ, నేర్చుకున్నవి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కలిగిస్తాయి. ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించడానికి ముందు పిల్లలు తల్లిదండ్రులతోనూ, తోబుట్టువులతోనూ నిర్భయంగా, నిస్సంకోచంగా మాట్లాడటం, ఆటలాడటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో మొదటి వరుసలో ఉన్న దేశాలు అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు మన దేశంలో అనుసరించే విధానాలనూ, పద్ధతులనూ నిర్దేశించాలని నేను నా పుస్తకంలో నొక్కి చెప్పాను.

(డాక్టర్ నాగులపల్లి భాస్కరరావుగారి మాతృమూర్తి నాగులపల్లి సోమిదేవమ్మ జయంతి జూన్ 17న)

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

4 COMMENTS

  1. చాలా కాలం తరువాత డాక్టర్ భాస్కర రావు గారు తెలుగులో రాసిన ఆర్టికల్ అనుకుంటా. బాగుంది

  2. I recall my memories with you in June from 2002 to 2016 and participation in your program es.Thak you sir, T. S.Rama Brahman
    RTD
    H.M.

  3. teacher pattern పెంచడం ప్రధానమైనది.కొంత మంది టీచర్స్ ని నియమించడం గురించి ప్రతిపాదన ఉంటే మంచిది. ఈ వైపు గా ఆలోచించండి. ఇలా నియమించే టీచర్స్ కి ప్రభుత్వం ఇచ్చే జీతం లాగే ఇంకా మిగిలిన ప్రయోజనాలు కూడా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles