సోమవారం ఉదయానికే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తోన్న అడ్వకేట్ జనరల్ చేసిన సూచన రాష్ట్ర ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ రేకెత్తించింది. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ఒక ప్రకటన చేయనున్నారని, అనంతరం ప్రభుత్వం తరపున వాదన వినిపించగలనని ఆయన కోర్టులో చెప్పడం రాష్ట్ర ప్రజలు పలు విధాలుగా ఊహాగానాలు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమని చెప్పే మన మిడిమేళపు తెలుగు మీడియా ఇప్పటికే భావజాలాల వారిగా కాకుండా, పార్టీల వారీగా విడిపోయి, వార్తలు చెప్పడం మాని వ్యాఖ్యానాలు చేస్తుండడం మనకందరికీ తెలిసిందే. ఇంకేముంది, తమ చిత్తానికి వచ్చినట్లు బ్రేకింగులూ, స్క్రోలింగులూ విరామం లేకుండా నడిచాయి. అందరిలో పెరిగిన ఉత్కంఠను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మరింత తాత్సారం చేయకుండా వెంటనే ఒక ప్రకటనను ఎలాంటి శషభిషలు లేకుండా శాసనసభలో చదివి వినిపించారు. ప్రజలందరిలో మరింత కాక పుట్టింది.
కేంద్రీకృత అభివృద్ధికి తిరస్కారం
తమకంటే ముందు రాష్ట్రాన్ని ఏలినవారు కోట్లాది రూపాయలను కుమ్మరించి కేంద్రీకృత అభివృద్ధికి పాల్పడడాన్ని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పనిలోపనిగా కొన్ని దశాబ్దాల కిందటే రాయలసీమకు హామీగా ఇచ్చిన శ్రీభాగ్ ఒప్పందాన్ని తలచుకున్నారు. వెనుకబడిన కళింగాంధ్ర దుస్థితిని సైతం మననం చేసుకున్నారు. విశాలమైన, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలను కాంక్షించి వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. తప్పులతడకగా తయారుచేసిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును మరింత పకడ్బందీగా తయారుచేసి రీఎంట్రీ ఇస్తామని హామీనిచ్చారు. రెండు మాటల్లో చెప్పాలంటే ఇదే ప్రకటన సారాంశం. అంటే మొండివాడని పేరుపొందిన జగన్, మడమ తిప్పరన్న ఖ్యాతి పొందిన జగన్ పట్టు వీడడమే కాదు, మడమ కూడా తిప్పారన్న మాట. దీనికి కారణలేమిటో, దీనివల్ల ఎలాంటి పొలిటికల్ మైలేజి సాధించదలచారోనని కొత్త చర్చలు మొదలయ్యా యి. మళ్లీ మన తెలుగు మీడియా రెండు శిబిరాలుగా విడిపోయి ఎవరి వాదనలను వారు ప్రజలకు వినిపిస్తున్నారు. ప్రజల ఆలోచనలు తెలుసుకుందామని వీసమెత్తు ప్రయత్నం చేయడం లేదు. సమ్మతి సృష్టి (కన్సెంట్ మాన్యుఫాక్చరింగ్)లో తలమునకలుగా ఉన్నారు. వారేమనుకుంటున్నారో ప్రపంచమంతా అదే అనుకోవాలని ఎవరి తాపత్రయం వారిది.
ప్రధాన న్యాయమూర్తి అంతరంగం
చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్ మిశ్రా అక్టోబర్ 13న రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం ఎంతవరకు ఉందో మనబోటి వాళ్లకు తెలియదు గాని, రెండున్నరేళ్లుగా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిల్ లు, కేసులు, వినతులు, లేఖలు ఒక పెద్ద గుట్టగా పేరుకుపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన అన్ని వ్యవహారాలను పక్కనపెట్టి ముందు దీని సంగతి తేల్చాల్సిందేనని వీటి విచారణ మొదటిరోజే గౌరవ ప్రధాన న్యాయమూర్తిగారు శెలవిచ్చారు. అంతటితో ఆగకుండా రాజధాని తేలకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని కూడా ఆందోళన చెందారు. కోర్టులో ఎకనమిక్స్ పాఠం చెప్పడం ఎందుకు అనుకున్నారేమో అభివృద్ధి అంటే ఏమిటో వివరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అమరావతిలో స్థలాలు లేని న్యాయమూర్తులు బెంచిలో ఉంటే బావుంటుందని ప్రభుత్వం ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టారు. న్యాయం జరక్కపోయినా, జరుగుతున్నట్టు కనిపించాలని కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు. ప్రభుత్వ వేతనం పొందుతున్నాను కాబట్టి నన్ను కూడా కేసునుంచి తప్పుకోమంటారా అని జడ్జిగారు చేసిన వేళాకోళం మనకు స్ఫురించలేదు గాని, ప్రభుత్వ పెద్దలకు అర్థమైంది. ఈ వాదనలు పూర్తయ్యాక తీర్పు ఎలా ఉండబోతోందో రాష్ట్ర ప్రజలకు పట్టలేదు గాని, ప్రభుత్వానికి పూర్తిస్థాయి చిత్రం కనిపించింది. వెంటనే దిద్దుబాటు చర్యలను ఆలోచించింది.
ప్రధాని వ్యూహం ఏమిటి? ముఖ్యమంత్రి వ్యూహం వెనుక ఏముంది?
ఇదిలావుండగా, దేశంలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కేంద్రప్రభుత్వం తీసుకురాదలచిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని దాదాపు ఏడాదిగా రైతులు దేశ రాజధాని సరిహద్దులలో పోరాటం చేస్తున్నారు. రైతుల ఆందోళనలను ఇన్నాళ్లు ఏమాత్రం పట్టించుకోని ఈ దేశ ప్రధాని అకస్మాత్తుగా జ్ఞానోదయమై చట్టాలను ఉపసంహరించు కోబోతున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రధాని నైజం తెలిసిన రైతులు దీక్షను ఉపసంహరించకుండా ముందు చట్టాలైతే రద్దు కావలసిందేనని భీష్మించుకు కూర్చున్నారు. రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలలో రైతుల నిరసన సెగ తమకు తప్పక తగులుతుందని తెలిసిన అధికారపక్షం వెంటనే వెనకడుగు వేసింది. వ్యవసాయ చట్టాల విషయంలో పునస్సమీక్ష చేసుకుంది. అమరావతిలో రాజధాని కోరుకుంటున్నది కూడా రైతులే కాబట్టి ప్రధాని మోదీని ఆరాధన భావంతో చూసే మన ముఖ్యమంత్రి జగన్ కూడా ఇక్కడి రైతుల ఆకాంక్షలను నెరవేర్చాలని భావిస్తున్నారని మనం భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల ఆకాంక్షలే పదమూడు జిల్లాల ప్రజల ఆకాంక్షలని నమ్మించే పత్రికలకు నమ్మదగ్గ విశ్లేషణగా ఇది కనిపించినప్పటికీ జగన్ వైఖరి తెలిసిన వారికి అసలు విషయం బోధపడుతుంది. ప్రధాని వెనక్కి తగ్గింది ఈ దేశపు రైతుపై గౌరవంతో కాదు. రానున్న ఎన్నికల కోసం పన్నిన వ్యూహంతో. ముఖ్యమంత్రి వెనక్కి తగ్గింది ఈ రాష్ట్ర మోతుబరి రైతుల పెడసరం కోరికలను నెరవేర్చాలని కాదు. మరి ఈయన వ్యూహం తెలుసుకోవాలంటే మూడు రోజులు వెనక్కి వెళ్లి శాసనసభలో జరిగింది తెలుసుకోవాలి.
చంద్రబాబునాయుడి విలాపం
రెండో రోజు శాసనసభకు రావడమే ‘బాబాయ్ గొడ్డలి’ అంటూ నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ తన మూడ్ ను తేటతెల్లం చేసింది. చురక పెట్టడంలో చురుకైన అంబటి రాంబాబు ఊరుకోకుండా వంగవీటి రంగా హత్య గురించి, ఎలిమినేటి మాధవరెడ్డి హత్య గురించి, మల్లెల బాబ్లీ హత్య గురించి కూడా మాట్లాడుదామని, మాజీ ముఖ్యమంత్రి కోరినట్టు ఒక గంట కాకుండా ఒక రోజంతా కేటాయిద్దామని గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. దాంతో బుంగమూతి పెట్టుకున్న చంద్రబాబునాయుడు వెంటనే వాకౌట్ చేశారు. అప్పటికే ఆయన మైక్ ని శాసనసభాపతి కట్ చేయడం వల్ల ఏం జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ పక్కనుంచి ఎవరో తీసిన వీడియోలో ఒక శపథం కూడా చేసినట్లు కనిపిస్తోంది. అంతవరకూ ఆక్షేపించడానికి ఏమీ లేనప్పటికీ, కొద్ది గంటల వ్యవధిలోనే చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి భోరున విలపించారు. అంతే. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తన కాళ్లను తానే నరుక్కున్నట్టయింది. నాయకుడు వెక్కి వెక్కి ఏడవడం చూసిన తెలుగు తమ్ముళ్లు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తికమకపడ్డారు. నాయకుడంటేనే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక ఆలంబనగా ఉండాల్సింది పోయి రుమాలుతో తుడుచుకుంటూ కన్నీటి పర్యంతమవడం తెలుగు అక్క చెల్లెమ్మలందరూ దిగమింగుకోలేక బెంగపడ్డారు.
ఎత్తుకు పైఎత్తు
సీన్ కట్ చేస్తే, చంద్రబాబు హస్తినకు పోయి రాష్ట్రపతిని కలిసి, మీడియా మేనేజ్మెంట్ ద్వారా దేశం మొత్తానికి ఈ సంగతులు ఎక్కడ లీక్ చేస్తారోనని జగన్ భావించినట్టుంది. వెంటనే ఈ దృశ్యానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమరావతి విషయంలో వెనుకడుగు వేసి చంద్రబాబును అవాక్కయ్యేలా చేశారు. ముక్కి ముక్కి ఏడ్చిన తరువాత చంద్రబాబు మాయమయ్యారు. జగన్ వేసిన ఈ ఎత్తుగడనుంచి కోలుకోవడానికి మరో వారం రోజులయినా పడుతుందేమో!
(రచయిత మొబైల్: 9989265444)