ఆకాశవాణిలో నాగసూరీయం – 19
“కన్యాశుల్కం నాటకానికి కథానాయకుడు కందుకూరి వీరేశలింగం…” – అంటూ మొదలైంది సర్దేశాయి తిరుమలరావు ప్రసంగం రికార్డింగ్! 1991లో ఆకాశవాణి అనంతపురం స్టూడియోలో రికార్డు చేస్తున్న సహోద్యోగి హడావుడిపడుతూ నా వైపు చూస్తున్నారు! అది ‘కన్యాశుల్కం’ నాటక తొలిప్రదర్శనకు శతవార్షిక సందర్భంగా తెలుగునాట ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్న వేళ.
అనంతపురం కేంద్రానికి ఉన్న సౌలభ్యం, ఇతర ఏ కేంద్రానికి లేని సౌకర్యం ఏమిటంటే – మహా విమర్శకులు, ‘కన్యాశుల్కం- నాటకకళ’ అనే విలువైన పరిశోధన చేసిన సర్దేశాయి తిరుమలరావు అనంతపురంలో ఉండటం! కందుకూరి నడిపిన సంఘసంస్కరణే కేంద్రికగా ఆ నాటకం నడుస్తుంది కనుక, ఆయన ‘కన్యాశుల్కం’ కథానాయకుడు కందుకూరి అని ప్రంసంగం ప్రారంభించారు! సర్దేశాయి తిరుమలరావు తైల పరిశోధనలో ప్రపంచస్థాయి శాస్త్రవేత్త, అంతేకాకుండా తెలుగులో విమర్శకులలో అగ్రగణ్యులు. ఆ విషయాల గురించి ఆవగాహన ఉంది కనుక, ఈ కార్యక్రమం ప్రణాళిక చేశాను! ప్రధాన తెలుగు దినపత్రికల సాహిత్య పేజీలలో కన్యాశుల్కం పై వ్యాసాల స్థాయికి తీసిపోని రీతిలో అనంతపురం ఆకాశవాణి చేయించిన ఆ ప్రసంగం రక్తికట్టింది. ప్రసారమయ్యాక ఎంతోమంది పెద్దలు ఈ విషయం పేర్కొంటూ అభినందించారు!
Also read: నా మైక్రోఫోన్ ముచ్చట్లు
గెలీలియో గెలీలి శాస్త్రవేత్త
ఇలాంటి ప్రసంగాలు ఆరోజు ప్రసారం అయితే, లేదా ముందురోజు సాయంత్రం ప్రసారమైతే చాలా బావుంటుంది. ఇంకో సందర్భం. అది జనవరి నెల. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ ప్రొఫెసర్ వేదం రామమూర్తి గారిని ‘గెలీలియో గెలీలి’ శాస్త్రవేత్త గురించి ప్రసంగం చేయమని కోరాం. రికార్డింగు అయ్యాక ప్రసారం నిర్ణయించిన తేదీ కాకుండా ఇంకోరోజు (జనవరి 8 – గెలీలియో వర్థంతి) ప్రసారం అయితే బావుంటుందని సలహా ఇచ్చి వెళ్ళారు. ఆయా తేదీల ప్రాధాన్యత గమనించీ ప్రసంగాలను షెడ్యూల్ చేస్తాం. మరి ఈ సలహా ఎందుకు? ఆ ప్రోగ్రాం రూపొందించిన ఎగ్జిక్యూటివ్ అయిన నాకు తెలియదా??
దినపత్రికలలో సంపాదకీయపుట వంటిది ఆకాశవాణిలో ‘స్పోకన్ వర్డ్స్’ విభాగం. కొందరు ఆకాశవాణి ఉద్యోగి మిత్రులు దానిని సాహిత్య విభాగంగా ‘స్థానిక అనువాదం’ చేస్తారు కానీ అది సరికాదు. ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, సమీక్షలు, నివేదికలు ఇది ప్రక్రియాపరమైన పరిమితి. వస్తుపరంగా ఆకాశవాణి కేంద్రం కార్యక్రమ పరిధికి లోబడి అవసరమైన అన్ని అంశాలు అందులో ఉండాలి – సామాజికం, సాంఘికం, ఆర్థికం, సైన్స్, సాహిత్యం, తాత్వికం వగైరాలు. నిజానికి ఆకాశమే హద్దు!
Also read: హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు
ప్రసంగాలూ, పరిచయాలూ వగైరా
ప్రసంగాలు, పరిచయాలకు పావుగంట; పెద్ద నాటకాలకు గంటా – ఇలా వుంటుంది ఆకాశవాణిలో వ్యవధిపరమైన విభజన. అంతేకానీ నాలుగు ప్రసంగాలు వరుసగా, రెండు నాటకాలు వరుసగా ప్రసారం చేయడం ఆకాశవాణి విధానం కాదు. అలాగే రెండు స్పోకన్ వర్డ్ కార్యక్రమాల మధ్య తప్పనిసరిగా శాస్త్రీయ, సినిమా, లలిత, జానపద సంగీతం ఉండేలా ప్లాన్ చేస్తారు. శ్రోతలు వినగలిగే శక్తిని దెబ్బ తీయకుండా జాగ్రత్త తీసుకోవాలి. నిజానికి విరామ సంగీతం కూడా వినడానికి బలవర్థకం లాగా దోహదపడాలి.
అనంతపురం ఆకాశవాణిలో తొలుత ప్రసారాలు సా. 6 గం. నుంచి రాత్రి 9.30 వరకే ఉండేవి. ఐదు నిమిషాల ఆంగ్లవార్తల కార్యక్రమం తో ప్రసారాలు ప్రతిరోజూ మొదలయ్యేది. రాత్రి 8.30కు తెలుగు పాటలు, 9.15కు హిందీ పాటలు మధ్యలో 9.00 నుంచి 15 నిమిషాల కార్యక్రమం ప్రతిరోజు నా నిర్వహణలో ఉండేది. శ్రోతల ఉత్తరాలకు జవాబులు; సాహిత్య ప్రసంగం లేదా పరిచయం; కథ లేదా రెండు కవితలు; సైన్స్ ప్రసంగం; సామాజిక, ఆర్థిక, తాత్విక విషయాల ప్రసంగాలు – ఇలా ప్రతిరోజు ఒకటి చొప్పున శ్రోతలలో ముఖాముఖి, సాహిత్యవేదిక, అనంతసాహితి, సైన్స్ పథం, ప్రసంగ వేదిక ఇలా ఉండేవి. 1993 మధ్య నుంచి నా కార్యక్రమం రాత్రి 8.45 గం. నుంచి 9.00కు మారింది, ఇంగ్లీషు వార్తల రిలే కారణంగా. ఇలా ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే శ్రోతలు వారం, సమయం గుర్తుపెట్టుకుని తమకు ఆసక్తి ఉండే ఆయా కార్యక్రమాలు వింటారని.
Also read: ఉత్సవాలవెల్లువగా ఆకాశవాణి ఉద్యోగపథం!
అంతరార్థం గమనించకపోతే అనర్థం
సైన్స్ వినాలని ప్రయత్నించిన వారికి సాహిత్యం ఎదురైతే నిరాశకావచ్చు. మరి జయంతులు, వర్థంతులు మనకు కోరిన వారాలలో రావుకదా! ఇది సహజ సిద్ధంగా ప్రణాళిక పరంగా ఉండే పరిమితి. సంప్రదాయం పాటిస్తూ, అంతరార్థం గమనించకపోతే, అడిగిన శ్రోతలకు అసలు కారణం వివరించలేము. మూడు నెలల ముందే ఆలోచించి, ప్రణాళిక చేస్తామని కళాకారులకు తెలియదు. దయానంద సరస్వతి/ బళ్ళారి రాఘవ/ న్యూటన్ / శంకరంబాడి సుందరాచారి .. ఇలా తగిన అంశం ఎంపికచేసి, యోగ్యులైన కళాకారులకు ఆహ్వానం పంపాలి. వారు పరిశోధనచేసి, ఆసక్తికరమైన శైలిలో ప్రసంగ ప్రతిని సిద్ధం చేసి రికార్డింగుకు వస్తారు. వారు చాలా శ్రమించారు కనుక ఆ తేదీనే ప్రసారం అయితే బావుంటుందని భావిస్తారు. అదీ అసలు సమస్య.
మరి ఇలాంటి సమస్యను ఎలా అధిగమించాలి? వస్తుపరమైన విభజన వదలి ‘వేదిక’ వంటి జనరల్ శీర్షిక ఉంచి, తగిన అంశం ఇవ్వవచ్చు. అయితే వారం, సమయం గుర్తుపెట్టుకుని వినేవారికి ఇది ఇబ్బంది. అందువల్ల సలహా ఇచ్చిన ప్రతి కళాకారుడికి ఇంత వివరణ వినిపించే సమయం ఇటుకానీ; వినడానికి అంత ఓపిక అటుగానీ సాధారణంగా ఉండదు. అందువల్ల ఈ రెండు రకాల ఆలోచనలు సజీవంగా ఐదారు దశాబ్దాలుగా సాగుతున్నాయి!
Also read: బదిలీ బాదరాయణంలో జీవనమాధుర్యం!
ప్రతివారం శీలపరీక్ష
తొలిదశలో ఆకాశవాణి నుంచి ఈటీవీ ప్రోగ్రాం స్ట్రక్చర్ ను స్వీకరించి సాగింది. న్యూస్ ఛానళ్ళు రాక ముందు ప్రతి గంటకు ఐదు నిమిషాల వార్తలతో ఈటీవీ ప్రయోగం చేసింది. ఇది మరాఠీ వంటి భాషలలో విజయవంతం అయినా తెలుగులో మార్కెట్ పరంగా నడవలేదు. పత్రికలకు ఆరునెలలకోసారి సర్క్యులేషన్ అగ్నిపరీక్ష ఉంటుంది, కానీ చానళ్ళకు ప్రతి గురువారం శీలపరీక్ష తప్పదు. అందువల్ల టీవీ ఛానళ్ళ వెంపర్లాట వేర్వేరుగా ఉంటుంది. ఒక్క రాజకీయ ప్రయోజనాలు మించి, ఇతర విధానాలను పత్యర్థి టీవీ ఛానల్ రంగంలో నిర్దేశిస్తుంది.
ఇలా పత్రికలు, రేడియో, టీవీ ఛానళ్ళను పోల్చి విశ్లేషించుకుంటే ఆయా సంస్థల ప్రోగ్రాం స్టేటజీస్ బోధపడతాయి! దానిలో మన పాచిక మరింత మెలుకువగా సాగుతుంది. అందువల్లనే నేను నిర్వహించిన అన్నిరకాల కార్యక్రమాలు ప్రతిచోటా అటెన్షన్ మాత్రమే కాదు, ఆదరణ కూడా పొందాయి!
Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392