దక్కన్ హెరాల్డ్ లో ప్రచురించిన కార్టూన్
సరిగ్గా రెండు దశాబ్దాల కిందట అంటే 2002లో నరేంద్ర మోడి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వేళ్లూనుకుంటున్నప్పుడు గోధ్రావద్ద సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలుబండిలో దారుణ అగ్ని ప్రమాదం జరిగింది. అయోధ్యకు కరసేవకులుగా వెళ్లిన కొంతమంది యువకులు ఒక బోగీలో సజీవదహనం కాబడ్డారు. ఈ దురదృష్టకర సంఘటనను సాకుగా తీసుకుని మరునాడే గుజరాత్ లో ఆగ్రహావేశాలు పెల్లుబికి, భయంకరమైన దాడులు జరిగాయి. ఒక పద్ధతి ప్రకారం పోలీసులు చూస్తుండగానే వందలాది ముస్లింలను ఊచకోత కోశారు. ఆస్తుల విధ్వంసం జరిగింది. చాలావరకు పోలీసులు కేసులు కూడా రాయలేదు. ఆ వారం రోజులు భారతదేశ చరిత్రలో నల్లసిరాతో రాయదగిన దుర్దినాలు. అందులో ఆనాటికి ఇరవై ఒక్క సంవత్సరాల బిల్కిస్ బానో కథ మరింత విచారకరమైనది. ఐదు నెలల గర్భిణి అయిన బానో కుటుంబంలో అందరినీ చంపేయగా ఆమెపై సామూహిక అత్యాచారం చేసారు. చనిపోయిందనుకుని వది లేసిన బానో కొన్ని గంటలకు తేరుకుని రక్తమోడుతున్న శరీరంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. గుజరాత్ లో న్యాయం దొరకక, సుప్రీంకోర్టును అభ్యర్థించి మహారాష్ట్రలో తన కేసును కొనసాగించింది. ఘటన జరిగిన ఆరేళ్ల తరువాత (2008లో) ట్రయల్ కోర్టు నిందితులలో పదకొండుమందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
Also read: మన మిడిమేళపు మీడియా
బిల్కిస్ బానో ఏమనుకుంటోంది!
మనమంతా 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న వేళ, సరిగ్గా ఆగష్టు పదిహేను నాడు, ఆ పదకొండు మంది సత్ప్రవర్తనకు ముచ్చట పడి వారికి విధించిన కఠిన కారాగార శిక్షను రద్దు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి స్వేచ్ఛను ప్రసాదించింది. వారిని గ్రామస్తులు మేళతాళాలతో స్వాగతం పలకడం ఈ దేశ ప్రజలలో కొంతమందికి వెన్నులో వణుకు పుట్టించింది. బిత్తరపోయిన జనం ఇలా జరిగిందేమిటని అడగకముందే ఆ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిందితులు యావజ్జీవంలో పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికే జైలులో మగ్గిపోయారని బాధపడింది. అయితే బిక్కచచ్చిపోయి చోద్యం చూస్తోన్న బాధితురాలు బిల్కిస్ బానోకు ఈ దేశం సమాధానం చెప్పాల్సివుంది. దీనిగురించి ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (తెలంగాణ) ధైర్యంగా ఒక వ్యాఖ్య చేశారు: “బిల్కిస్ నిర్భయంగా ఊపిరి తీసుకునే హక్కును కాలరాయలేం. అంతవరకూ మనకు స్వాతంత్య్రం రానట్టే” అన్నారు. ఆవిడ ధైర్యానికి జోహార్లు.
Also read: రికార్డుల వేటలో మోడి ప్రభుత!
నీళ్లు తాగినా చంపేయడమే!
మరికొంత మందికి చలిలేకుండా చెమటలు పట్టించిన దుర్ఘటన ఇదే వారం రాజస్థాన్‌లో జరిగింది. జాలోర్ జిల్లా సురానా గ్రామపు సరస్వతి విద్యా మందిరం లో మూడవ తరగతి చదువుతున్న ఇంద్ర మేఘవాల్ అనే చిన్నారి పెద్ద కులాలకు కేటాయించిన కుండ నుంచి గ్లాసుడు మంచినీళ్లు తాగాడని అక్కడి ఉపాధ్యాయుడు చైల్ సింగ్ చచ్చేట్టు కొట్టాడు. దళితులకు కేటాయించిన నీరు తాగకుండా బాలుడు చేసిన తప్పు అతడి ప్రాణాలు తీసింది. జులై 20న జరిగిన ఈ దుర్ఘటనలో బాలుడి చెవినుంచి, కంటినుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఉదయపూర్‌లో కొద్ది రోజులు చేసిన వైద్యం సరిపోకపోతే అహ్మదాబాద్ తీసుకెళ్లారు. ఆగష్టు 13న చిన్నారి ఆఖరి శ్వాస తీసుకున్నాడు. ఈ దేశంలో కులవివక్ష లేదని నమ్మే జనమంతా త్రివర్ణపతాకం ఎగరేసుకుని తమకున్న దేశభక్తికి తామే మురిసిపోయారు. ఈ దేశంలో కులసమస్య రోజు రోజుకూ పెచ్చరిల్లిపోతున్నదని నమ్మేవారు జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ సందర్భాలలో చేపట్టవలసిన ఆచరణను మననం చేసుకుంటున్నారు. కులం ఉంటేనే దేశం శీఘ్రగతిలో ప్రయాణం చేస్తుందని, కులవ్యవస్థ వల్లనే భారతదేశం వెయ్యేళ్లుగా స్థిరంగా దృఢంగా ఉందని చెప్పిన గాంధీ మహాత్ముడిని ఆగష్టు పదిహేనున వేనోళ్లు కీర్తించి స్మరించి ఈ దేశవాసులు తరించిపోయారు. దేశం మాదిరిగానే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా బిసి, దళిత సంఘాలకు చీమకుట్టినట్టయినా కాలేదు. కనీస స్పందన కరువయింది. నిరసన ప్రదర్శనలు లేవు.
Also read: ఇదే మన ప్రస్తుత భారతం!
ఎన్నికల ముందు పంచాలా తర్వాత పంచాలా?
వీటితో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు ఒక చర్చ చేసి లేపిన తెర మరిన్ని కొత్త చర్చలకు దారితీసింది. ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల గురించి విచికిత్స జరుపుకొంది. ఇదమిద్దంగా ఏమీ తీర్పు ఇవ్వకపోయినా దాని గురించి ఆలోచించడం మంచిదేనని అందరూ వ్యాఖ్యానించారు. ఈ చర్చను ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానించుకుని మీడియా డిబేట్లు నిర్వహించుకుంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అయింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు హడావిడిగా కొత్త పథకాలు ప్రకటించి వాటి ముసుగులో డబ్బులు పంచే పార్టీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ పసుపు కుంకుమ పథకం పేరుతో ఓటర్లకు డబ్బులు పంచడాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా ఈ నిబంధన చేర్చమని కోరారు. ఎన్నికల ముందు గుప్పించిన హామీల అమలుకు నిర్దిష్టమైన కొలబద్దలు ఉండాలని, వాటిని ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో పాక్షికంగానో, సంపూర్ణంగానో ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలలో ప్రజలకు అందించే సహాయం ఎటువంటిదైనా ఉచితాల కిందకు రాదని వాదించింది.
Also read: వారు చేసే తప్పు.. మనం చేస్తే ఒప్పు
గురివింద గింజ తీరు
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ దేశంలో రేవ్ డీ కల్చర్ (మిఠాయి సంస్కృతి) పెరిగిపోతోందని, అది దేశానికి మంచిది కాదని సెలవిచ్చారు. ఆయన ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను మిఠాయిలతో పోల్చారన్న మాట. ముఖ్యంగా ఢిల్లీలో ఆప్ పార్టీ భారతీయ జనతా పార్టీకి చెవిలో జోరీగలాగా, చెప్పులో రాయిలాగా తయారయింది. విద్యకోసం, మంచినీటి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ పాగా వేశారు. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలలో కాళ్లూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని మోడీ సీరియస్ గా తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఈ ఉచితాల గురించి సుద్దులు చెప్పారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉచితాల హామీలు ఇవ్వాలన్నారు. గురివింద గింజ సామెత మాదిరిగా కేంద్రం తాను చేస్తున్న పొరపాట్లను ఉద్దేశపూర్వకంగానే మరుగుపరుస్తోంది.
Also read: సభ ముగిసింది.. సందేశం చేరింది..
పేదలకిస్తే పప్పుబెల్లాలు – పెద్దలకిస్తే నజరానాలు
ఇదే విషయం మీద తమిళనాడు నుంచి డిఎంకె పార్టీ సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తూ అట్టడుగున నిలిచిన రైతుకు ఇచ్చే సాయాన్ని ఎద్దేవా చేసే మనుషులు బడా కార్పొరేట్లకు, సంపన్న వ్యాపారస్తులకు బ్యాంకులు, ప్రభుత్వాలు అప్పనంగా అందిచే రుణ మాఫీలు, టాక్స్ హాలిడేలు గురంచి ఆలోచించాలని కోరారు. వేలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా వారి చేతుల్లో పెట్టి, వారు విదేశాలు చెక్కేస్తుంటే నిస్సహాయంగా మిగిలిన ప్రభుత్వాలు, పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే పథకాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం మానవత్వం అనిపించుకోదని సూచించారు. మన మీడియా కూడా పేద ప్రజలకు అందించే పథకాలను అప్పనంగా అందించే పప్పుబెల్లాలని, మధ్యతరగతి జేబులు కొట్టి పేదలకు ఆకర్షణీయ పథకాల ద్వారా డబ్బులు పంచి పెడుతున్నారని సూచించేలా కథనాలు రాస్తోంది. ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతోంది. దీనికి జయప్రకాష్ నారాయణ్ లాంటి మిధ్యామేధావులు వంత పాడుతున్నారు. ఇప్పటికే ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, పరిశ్రమలు మాత్రమే అని నమ్మే పరిస్థితికి చేరాం. ఇలాంటి తిరగమోతల అభిప్రాయాలతో ఇప్పటికే పేరుకుపోయిన పెడసరపు భావాలు మరింత వికారపు ఆలోచనలకు తావిస్తాయి.
Also read: కార్పొరేట్ల మాయ.. గ్రేడ్ల గారడీతో విద్యావ్యవస్థకు తుప్పు
–దుప్పల రవికుమార్