‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? భారతదేశంలోని నిరుపేదల ప్రజాస్వామ్య తర్కానికి అందని విషయాలు సుప్రీంకోర్టులో వినిపిస్తాయి. విద్యుచ్ఛక్తి ఉచితంగా ఇవ్వడం మంచి విధానం కాదని నేను అంగీకరిస్తాను. సామాన్య ప్రజలకు బహుమతులు ఇచ్చే విధానాలు చూసి మనం బీపీ పెంచుకోవడం ఎందుకు? అత్యంత సంపన్నులకు పన్నులలో కోత విధించడం, భారీ రుణాలు మాఫ్ చేయడం గురించి బాధపడం ఎందుకు?
వరదలను న్యాయస్థానాలు నివారించలేవా?
అస్సాంలో ఒక అనుభవశాలి అయిన మిత్రుడి దగ్గరి నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది. ‘ఏటా వరదలు ముంచెత్తి వినాశనం కలిగిస్తున్నాయి. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకొని నష్టనివారణ చేయగలవా?’ అని ప్రశ్నించాడు. వేదిక గురించి సందేహంతో, రాబోయే ఫలితం గురించి అనుమానంతో సంకోచిస్తూనే రాశాడు. నన్ను నిత్యం దేనికో ఒక దానికోసం కలుసుకునేవారికి అటువంటి సంకోచం ఎంతమాత్రం లేదు. అగ్నిపథ్ పథకం, గోధుమల ఎగుమతిపైన నిషేధం, అటువంటి అంశాలపైన ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తే పని అయిపోతుందని భావిస్తారు. సమస్యలే నాకు ముఖ్యం. కానీ వారు న్యాయస్థానాలలో అన్ని పరిష్కారాలూ దొరుకుతాయని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. ఇది ప్రశాంత్ భూషణ్ మిత్రుడిగా నేను చెల్లించాల్సిన మూల్యం అని నాకు నేనే చెప్పుకుంటాను. వారానికి కొన్ని అభ్యర్థనలను ఆయనకు పంపుతాను.
అభ్యర్థనలలో ఒక ప్రత్యేక తరహాకి చెందినవాటిని నేను గమనించాను. న్యాయస్థానాల జోక్యంతో భారత రాజకీయాలను సంస్కరించాలని అభిలషించే మిత్రులు వీరు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్టు (ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్ సిస్టం) ప్రకటించే ప్రస్తుత ఎన్నికల విధానం నుంచి దామాషా పద్ధతిలో (ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్) ఎన్నికలు జరిపించే విధానానికి మారాలని 1960 దశకం నుంచి 1980 దశకం వరకూ వాదనలు వినిపించేవి. ఇటువంటి గొంతుకలకు టీఎన్ శేషన్ తన శక్తిని జోడించేవారు. అందుకని అటువంటి వ్యవస్థకోసం ఉద్ఘోషలు కూడా పెరిగాయి. గెలవాలని అంత పట్టింపు లేని అభ్యర్థులను ఎన్నికల రంగం నుంచి తొలగించాలనీ, ఓటర్ల తీర్పు ముక్కలుచెక్కలు కాకుండా నివారించాలనీ, నేరస్థులూ, అవినీతిపరులూ ఎన్నిక కాకుండా నిరోధించాలనీ అనుకునేవాళ్ళం. ఈ జాబితాకు అప్పుడప్పుడు కొత్త కోరికలు వచ్చి చేరతాయి. ఎన్నికలలో కులం, సామాజికవర్గం ప్రాతిపదికగా ఓట్లు అడగడాన్ని నిషేధించాలనీ, ఎన్నికలలో చేసే వాగ్దానాల అమలు చట్టబద్ధం చేయాలనీ, ఇటువంటివే మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలనీ భావించేవాళ్ళం.
దీపస్తంభం దగ్గర వెతుకులాడే స్వభావం
ఇటువంటి ప్రతిపాదన విన్న ప్రతిసారీ నాకు తాను పోగొట్టుకున్న తాళంచెవిని దీపస్తంభం కింద వెతుకుంటున్న మనిషి గురించిన ఒక చమత్కారం గుర్తుకొస్తుంది. తాళం చెవి ఎక్కడ పడవేశావు? అని అడిగితే అతడు చీకటిలో దూర ప్రాంతం చూపిస్తాడు. ‘మరి దీపస్తంభం కింద ఎందుకు వెతుకుతున్నావు?’ అని అడిగితే ‘ఇక్కడ వెలుతురు ఉంది కనుక’ అని అతడు అమాయకంగా సమాధానం ఇస్తాడు. రాజకీయ రుగ్మతలకు న్యాయపరమైన, న్యాయస్థాలు ఇచ్చే పరిష్కారాలు కావాలని కోరుకునేవారికి తాళం చెవి పోగొట్టుకున్న వ్యక్తికి ఎంత లోకజ్ఞానం ఉన్నదో అంతే ఉన్నది. అంతకంటే అధ్వానం ఏమంటే ఈ ప్రతిపాదన చేసేవారు ఉన్నతస్థాయిలో ఉన్నవారి గురించి ఆలోచిస్తారు. సాధారణ ప్రజల అవసరాలూ, ఆశయాలూ వారికి పట్టవు.
మధ్య తరగతి స్వప్నాలకు అతీతంగా ఎన్నికల సంస్కరణలు ఉండాలని ఆలోచిస్తూ నేను 1996లో ఒక చెత్త వ్యాసం రాశాను (సెమినార్ నం. 440, ఏప్రిల్ 1996). అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏమీ మారలేదు. కాకపోతే కొంతమంది మిత్రుల సానుభూతిని నేను కోల్పోయాను. ఆ తర్వాత రాజకీయ సంస్కరణలు ఎట్లా ఉండాలి, ఏమై ఉండాలి, ఎందుకు ఉండాలనే అంశాలను వివరిస్తూ మరింత సంస్కారవంతంగా, సుదీర్ఘంగా రాశాను. కానీ దేశంలోని సకల రాజకీయ రుగ్మతలకూ న్యాయవ్యవస్థ ద్వారానే ఏదో ఒక విధమైన పరిష్కారం కనుగొనాలని వాదించేవారి ఉత్సాహం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
ఏదైనా అద్భుతం జరగాలని ఎప్పుడూ అన్వేషించే జాతి మనది. ఏదైనా వ్యాధి ఉన్నదా, దానికి మనం అనుకుంటున్న వైద్యం సరిపోతుందో లేదో అని ఆలోచించే తీరిక కూడా లేకుండా తొందరపడుతూ ఉంటాం. వ్యాధిని తగ్గించే మందు లేదా నయం చేసే వస్తువు పనికి వస్తుందో, లేదో తనిఖీ చేసుకునే సమయాన్ని కూడా మనం వృథా చేయం. మనకు ఇప్పుడే ఇక్కడే పక్కా పరిష్కారం కావాలి.
వ్యాధి కంటే అన్యాయమైన వైద్యమా?
ఎన్నికల ప్రచారంలో ‘అనుచితమైన, నిర్హేతుకమైన ఉచితాలు’ పంపిణీ చేస్తామంటూ హామీలు గుప్పించకుండా రాజకీయ పార్టీలను నిరోధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించాలంటూ తాజా ప్రతిపాదన. లేకపోతే అటువంటి అభ్యర్థుల నుంచి ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల సంఘం వాపసు తీసుకోవాలి. అటువంటి పిటిషన్ నాణ్యత గురించీ, పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి స్వభావం గురించీ మనం చర్చించనక్కరలేదు. మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణతో సహా అనేక అపసవ్యపు కారణాల వల్ల న్యాయవాది, ఛోటా బీజేపీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ వార్తలలో ఉన్నారు. ఎన్నికల సంస్కరణలతో నేరుగా సంబంధం ఉన్న ఎలక్టొరల్ బాండ్ల పై పిటిషన్ చేపట్టే తీరికలేని, ఉపాధ్యాయ పిటిషన్ పైన మాత్రం సమయం వెచ్చించే వెసులుబాటు ఉన్న సుప్రీంకోర్టు చిత్రమైన స్థితిపైనా దృష్టి కేంద్రీకరించవద్దు. ఉచితాలు ఉండాలా, ఉండనక్కరలేదా అనే విషయంపైన ఒక వైఖరి తీసుకొని తమకు తెలియజేయాలంటూ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ అధ్యక్షతన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.
ఉదాహరణకు ‘ఉచితాలు’ అనే రాజకీయ వ్యాధి బాగా ముదిరి విస్తరించి ఉన్నదని అనుకుందాం. ఆ అంశాన్ని పట్టించుకునేవారు ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ఈ వ్యాధి తీవ్రత ఎంత? నా ప్రాథమ్యాల జాబితా కంటే ప్రధానంగా ఈ అంశం రావాలా? ఈ వ్యాధిని నయం చేయవచ్చునా? అందుకు అయ్యే ఖర్చు భరించగలినగేదానా? వ్యాధి కంటే వైద్యం ఖరీదు ఎక్కువైనప్పుడు ఆ వ్యాధితో సహజీవనం చేయడమే మేలా? ఒక వేళ ఈ వ్యాధిని నయం చేసి తీరవలసిందే అనుకుంటే సరైన వైద్యుడు ఎవరు? సరైన మందు ఏమిటి?
విజయావకాశాలు లేకుండా చేయడం భావ్యమా?
ఉచితాలు ప్రకటించిన రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలను తీసివేసుకోవడం ద్వారా ఎన్నికలలో విజయం సాధించే అవకాశం లేకుండా చేయడం – అంటే మందు వ్యాధికంటే ప్రమాదకరమైనదని అర్థం. ప్రజాస్వామ్యంలో ఎవరి చేతిలోనూ గండ్రగొడ్డలి ఉండరాదు. ఉంటే సదరు వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజల కంటే శక్తిమంతంగా తయారవుతారు. భారత ఎన్నికల కమిషన్ పరువు ఇప్పటికే బాగా పోయింది. అది ఇంకా పరువు కోల్పొన కూడదు అనుకుంటే మాత్రం అటువంటి అధికారాలు ఆ సంస్థకు కట్టబెట్టకూడదు. ఎప్పుడు పరిష్కరించుకోవాలనే సంగతి ఓటర్లే నిర్ణయించాలంటూ భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్టు సక్రమమైనది.
ఈ బాధ్యతను ఆర్థిక సంఘానికి (ఫైనాన్స్ కమిషన్) అప్పగించడం గురించి కూడా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన గల బెంచ్ ఆలోచించిందని వార్తలు వచ్చాయి. వాస్తవం ఏమంటే ఏ సంస్థ కూడా అటువంటి అసాధారణ అధికారాలను దుర్వినియోగం చేయకుండా వస్తునిష్ఠంగా వ్యవహరించజాలదు. ఏదో ఒక సాకు చూపించి ప్రత్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ప్రజాస్వామ్యాన్నిహత్య చేయడానికి సర్వసాధారణంగా ఉపయోగించే పద్ధతి. మన దేశంలో అటువంటి కిటికీ లేనే లేదు. దాన్ని ఎప్పుడూ తెరవరాదు.
‘ఉచితాలు’ వ్యాధివంటివా?
అయితే, ఆ వ్యాధిని ఎట్లా నయం చేయగలం? ఈ ప్రశ్నకు సమాదానం అన్వేషిస్తూ ముందుకు వెళ్ళే ముందు ఒక విషయం ఆలోచిద్దాం: ప్రజాస్వామ్యంలో రాజకీయాలనేవి స్వయంపాలనకు వీలైన కార్యకలాపాలు కలిగి ఉండాలి. బయటి నుంచి వచ్చే ప్రమాదాల నుంచీ, తాత్కాలికమైన పొరపాట్ల నుంచీ, వ్యక్తిగత ఇష్టాయిష్టాల నుంచీ, ఆధిక్యభావనతో చేసే అత్యాచాల నుంచీ ప్రజాస్వామ్యాన్ని రక్షించవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రజల నుంచి రక్షించజాలము.
‘ఉచితాలు’ ప్రజలను ఆకర్షించిన పక్షంలో, వారికి నచ్చజెప్పవచ్చును. ఉచితాలు బూటకమని నిరూపించేందుకు రాజకీయపార్టీలు హామీ ఇచ్చే ఉచితాల గురించిన భోగట్టాను సవివరంగా ప్రకటించాలన్న నిబంధన విధించవచ్చు. అసాధ్యమైన వాగ్దానాలు చేసే పార్టీలనూ, నాయకులనూ నిలదీసి ప్రశ్నించవలసిందిగా మీడియాను ప్రోత్సహించి, బలోపేతం చేయవచ్చును. దూరదృష్టితో ఒక కార్యక్రమాన్ని ప్రజలలో అత్యధికులు కావాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని మూసివేయడం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదు.
సమస్యగా ఎందుకు పరిగణిస్తున్నాం?
చివరగా వ్యాధి గురించి ఆలోచిద్దాం. ఉచితాలు ఇవ్వడాన్ని సమస్యగా మనం ఎందుకు పరిగణిస్తున్నాం? ఒక సారి ఆలోచిస్తే పైకి ఈ విధానాలు బాధ్యతారహితమైనవనీ, జాతీయ ఆర్థిక వనరులను వృథా చేస్తాయనీ అనిపిస్తుంది. నేను మాత్రం ఉచితంగా విద్యుచ్ఛక్తి ఇవ్వడాన్ని చెడు విధానంగా పరిగణిస్తాను. సాధారణ ప్రజలకు బాధ్యతారహితమైన బహుమతులు ఇవ్వడానికి ఉద్దేశించిన ఆర్థిక విధానాల గురించి మాత్రమే మనం సంయమనం కోల్పోయి ఊగిపోతాం ఎందుకో నాకు అర్థం కాదు. కుబేరులకు పన్నుల కోతనూ, అసాధారణమైన లాభాలనూ, రుణాల మాఫీనీ సమకూర్చే పెద్ద పథకాల గురించి మనం ఎందుకు మనసుకు పట్టించుకొని బాధపడటం లేదు?
నిర్హేతుకమైన వాగ్దానాలకు పడిపోతున్న పేద ఓటర్లు నిజంగా అంత నిర్హేతుకంగా వ్యవహరించడం లేదా? బహుశా ప్రజాస్వామ్యాన్నీ, సంపద పెరిగి పైనుంచి కిందికి దిగే ‘ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్’ సంభవించడం అసాధ్యమనే అంశాలన్నీ ప్రవీణులకంటే పేదవారే బాగా అర్థం చేసుకున్నారని అనుకోవాలా? సహేతుకమైన విధానాలు మామూలుగా అమలు జరిగితే తమకు ఒరిగేది ఏమీ లేదనీ, ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత దొరికినంత స్వీకరించడమే మేలనే అంశం వారు గ్రహించి ఉంటారు. ఉచితాలూ, నిర్దిష్టమైన ఫలితాలూ వారికి ప్రత్యక్షంగా లభిస్తాయనీ, వాస్తవంలో అవే తమకు దక్కుతాయనీ, అందుకే ఓటు వేయాలనీ బహుశా వారు భావిస్తున్నారని అనుకోవాలి. ఉచితాల గురించి బాధపడిపోయేవారు ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభివర్ణించినట్టు ‘సహేతుక బుద్ధిహీనులు’ అని అనుకోవచ్చా?
(ప్రముఖ మేధావి యోగేంద్ర యాదవ్ కాలమ్ పక్షం రోజులకు ఒక సారి సకలంలో వస్తుంది. ఇది తొలి వ్యాసం)