ఆర్చర్ మోచేతికి గాయం
రెండోటెస్టుకు ముందే ఇంగ్లండ్ కు దెబ్బ
భారత్ తో చెన్నై వేదికగా శనివారం ప్రారంభంకానున్న రెండోటెస్ట్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ కు గట్టి దెబ్బతగిలింది. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి టెస్టులో 227 పరుగుల విజయం సాధించి 1-0 ఆధిక్యంతో నిలిచిన ఇంగ్లండ్ తన తురుపుముక్క, లైట్నింగ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేకుండానే బరిలోకి దిగనుంది. చెపాక్ వేదికగా ముగిసిన తొలిటెస్టు తొలిఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ,శుభ్ మన్ గిల్ ల వికెట్లు పడగొట్టడం ద్వారా తనజట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆర్చర్..మోచేతికి వాపు రావడంతో విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఇంగ్లండ్ జట్టులోనే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఏకైక బౌలర్ గా జోఫ్రా ఆర్చర్ కు పేరుంది. కొద్దిబంతుల వ్యవధిలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేయగల సత్తా ఉన్న బౌలర్ గా కూడా ఆర్చర్ కు గుర్తింపు ఉంది.
ఇదీ చదవండి:ఒక్క ఓటమితో తిరగబడిన భారత అదృష్టం
ఇప్పటికే సీనియర్ ఫాస్ట్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన ఇంగ్లండ్ ఆర్చర్ అందుబాటులో లేకపోడంతో మనసు మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్చర్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బ్రాడ్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండే చెన్నై వికెట్ పై ఇంగ్లండ్ తొలిటెస్టులో అనుసరించిన వ్యూహాన్నే కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో పాటు స్టోక్స్ రూపంలో ఓ ఆల్ రౌండర్ ను తుదిజట్టులో కొనసాగించనుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకూ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రోజుకు 25 వేల మంది అభిమానుల నడుమ రెండోటెస్ట్ మ్యాచ్ నిర్వహించడానికి తమిళనాడు క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: భారత్ తొలి ఓటమికి కారణాలు ఎన్నెన్నో!