అమరావతి: సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ గృహంలో కన్ను మూశారు. గోపాలస్వామి కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. తెనాలికి చెందిన గోపాల స్వామి తొలుత ఇండియన్ ఎక్స్ప్రెస్ కు విలేకరిగా పత్రికా రంగం లోకి ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. అదే సమయంలో పి.టి.ఐ వార్తాసంస్థకు ప్రతినిధిగా పనిచేశారు .1978-80, 1981-82 మధ్యకాలంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు మార్లు పని చేశారు. 1992లో జర్నలిజం వృత్తి నుంచి విరమించుకున్నారు .ఆయన భార్య రాధాదేవి 2010లో మరణించగా ఆమె స్మారకార్థం శ్రీమతి పిల్లలమర్రి రాధాదేవి స్మారక రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు యూనియన్ ఆధ్వర్యంలో నెలకొల్ప గా తొలిగా ఎంపికైన నిమ్మరాజు చలపతిరావు కు విజయవాడలో 2013 జనవరి 25 వ తేదీన అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ గోపాల స్వామి తో పాటు యూనియన్ నేతలందరూ తరలి రావడం జరిగింది. రెండో దఫా తెనాలికి చెందిన శ్రీ బి ఎల్ నారాయణ కు ,మూడో దఫాగా శ్రీ పి.ఎన్. చారి (నల్గొండ), నాలుగో దఫా శ్రీ డి.సోమసుందర్ ఈ అత్యుత్తమ అవార్డు అందుకోవడం జరిగింది .
శ్రీ గోపాల స్వామి మృతి పట్ల ఐజేయు అధ్యక్షులు శ్రీ కె. శ్రీనివాస రెడ్డి ,ఉపాధ్యక్షులు శ్రీ అంబటి ఆంజనేయులు ,కార్యదర్శి శ్రీ వై నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు శ్రీ అమర్ నాథ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ వి సుబ్బారావు, శ్రీ చందు జనార్ధన్, విజయవాడ అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, కొండ రాజేశ్వరరావు ,ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మ రాజు చలపతిరావు ,ఆర్ వసంత్ వేర్వేరు ప్రకటనల్లో తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
నిత్యం తెనాలిని తలుచుకునేవారు: గోపాలస్వామి తనయుడు శ్యాంప్రసాద్
తెనాలి కి ఎంతో రుణపడి ఉన్నామని సీనియర్ జర్నలిస్టు పి వి వి గోపాలస్వామి తనయుడు శ్యాం ప్రసాద్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, యూనియన్ గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి యడ్ల సునీల్ అమెరికాలో ఉన్న శ్యాం ప్రసాద్ తో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ కన్నీటి పర్యంతం అవుతూ తన తండ్రి మరణం పట్ల తక్షణమే స్పందించి సానుభూతి తెలిపిన యూనియన్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కరోనా వేడి తగ్గిన తరువాత ఓసారి తాను తన స్వస్థలం తెనాలి వచ్చి బంధుమిత్రులందరి తో మాట్లాడి తన తండ్రి స్మారకంగా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని ఉందన్నారు.
ప్రతి రోజు ఉదయం ఏడు గంటలకు నిద్రలేచే వారని, సోమవారం ఉదయం 8 ,9 గంటల వరకు లేవకపోయేసరికి భయమేసి తక్షణం వైద్య పరీక్షలు జరిపించామన్నారు.. ముందు రోజు రాత్రి తన తండ్రికి ఇష్టమైన మిరపకాయ బజ్జి ,సాంబార్ ఇడ్లీ తిన్నారని అన్నారు .
30 ఏళ్లుగా అమెరికాలో తనతో ఉంటున్నా నిత్యం తెనాలిని, అలాగే జర్నలిస్టు మిత్రులను తలచుకునేవారన్నారు. తను చివరగా నెల్లూరు, దిండి అంతర్వేది పర్యటనకు వచ్చిన విషయాన్ని తరచూ చెబుతుండేవారు అని అన్నారు.