వోలేటి దివాకర్
అధికార వైఎస్సార్ సిపికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లను కూడా నియమించారు. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా మారిన కీలకమైన రాజమహేంద్రవరం నగరానికి మాత్రం ఏడాది కాలంగా కోఆర్డినేటర్ ను మాత్రం నియమించలేకపోతున్నారు. ఇది పార్టీ నాయకత్వ అసమర్థతా … లేక నాయకత్వ లేమా అర్థం కావడం లేదు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా రాజమహేంద్రవరంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఈనేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అధికార పార్టీ కనీసం నగర అధ్యక్షుణ్ణి కూడా నియమించుకోలేని నిస్తేజంలో ఉండటం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది .
జిల్లాల విస్తరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాను మూడుగా విభజించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను, కోన సీమ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ను, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. మంత్రి పదవి కోల్పోయిన కన్నబాబును , మంత్రి పదవి ఆశించిన రాజాను ఈవిధంగా సంతృప్తి పరిచినట్టయ్యింది .
రాజమహేంద్రవరంలో సాహసం చేస్తారా?
గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తరువాత ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణంను రాజమహేంద్రవరం కోఆర్డినేటర్గా నియమించారు. ఎంపి మార్గాని భరత్ రామ్, జక్కంపూడి రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు నేపథ్యంలో శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను అనూహ్యంగా తప్పించి , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు గత ఏడాదిలో పార్టీ కోఆర్డినేటర్గా బాధ్యతలు కట్టబెట్టారు . కొద్దిరోజుల పాటు హడావుడి చేసిన ఆకుల ఆ తరువాత నుంచి దాదాపు అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి పార్టీ నాయకులు ఎవరికి వారే కోఆర్డినేటర్ పాత్ర పోషిస్తున్నారు. ఒక వైపు నందెపు శ్రీనివాస్, మరోవై పు రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నగరంలో పార్టీకి నాయకత్వం వహించే ప్రయత్నాలు చేస్తున్నారు . మరోవైపు జక్కంపూడి రాజాను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో ఎంపి, రాజా వర్గాల మధ్య ఆధిపత్యపోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరును పరిష్కరించలేక జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా చేతులెత్తేశారు. జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రాజాను ఎంపీ, ఆయన వర్గీయులు కనీసం అభినందించే ఆస్కారం కూడా లేనంత అగాధం ఇరు వర్గాల మధ్య నెలకొంది. రాజమహేంద్రవరంలో ఇప్పటికీ వైసిపి శ్రేణులు రెండు వర్గాలుగా పనిచేస్తున్నాయి. జక్కంపూడి కుటుంబ కార్యక్రమానికి భరత్ వర్గీయులు, భరత్ కార్యక్రమానికి జక్కంపూడి వర్గీయులు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నగర కోఆర్డినేటర్ నియామకం నాయకత్వానికి మరింత సవాల్ గా మారుతుంది. 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవ కాశాలూ ఉన్నాయి. ఈలోగానైనా కొత్త ఆర్డినేటర్గా నియమితులైన ఎంపిలు మిధున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ నగర కోఆర్డినేటర్ ను నియమించడంలో విజయం సాధిస్తారా అన్నది వేచిచూడాలి .
టిడిపిలోనూ అదే పరిస్థితి
అధికార వైసిపి , విపక్ష టిడిపికి తప్ప రాజమహేంద్రవరంలో బిజెపి, జన సేన, వామపక్ష పార్టీలకు అధ్యక్షులు ఉన్నారు. వైసిపి తరహాలోనే తెలుగుదేశం పార్టీలో కూడా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీంతో గత రెండేళ్లుగా టిడిపి నగర అధ్యక్షుడ్ని నియమించలేకపోతున్నారు. వాసిరెడ్డి రాంబాబు తరువాత టిడిపికి పూర్తిస్థాయి నగర అధ్యక్షుడు నియామకం కాలేదు. మూడుసార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపికి ఈదుస్థితి ఏర్పడటం పరోక్షంగా అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమే.