పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని సిరాకుల్ లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై మొన్నటి (గురువారం) రాళ్ల దాడి, దరమిలా కేంద్ర హోం శాఖ జారీ చేసిన సమన్లకు మమతా బెనర్జీ తిరస్కారంతో కేంద్ర , రాష్ట్రాల మధ్య మరింత వేడి రాజుకుంటోంది. నడ్డా వాహన శ్రేణిపై దాడి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పనే అని బీజేపీ అంటే, మీకు మీరే దాడి చేసుకొని ఎదుటి వారిపై నెట్టడం మీకు అలవాటేనని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. నడ్డా పర్యటన సందర్భగా శాంతి భద్రతల పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ తాను ముందుగానే అప్రమత్తం చేశానని, అయినా నివారణ చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైందని గవర్నర్ జగ్ దీప్ ధన్కర్ అన్నారు. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రానికి నివేదిక పంపారు.
Also Read:బెంగాల్ ప్రిపోల్ సర్వేలో మమతకు ఎదురుదెబ్బ
వచ్చి వివరణ ఇవ్వండి…రానే రాం
ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలవన్ బందోపాధ్యాయ, డీజీపీ వీరేంద్ర ఢిల్లీ రావలసిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ నెల 14వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే మమతా బెనర్జీ సర్కార్ ఆ సమన్లను తోసిపుచ్చింది. వివరణ ఇవ్వడం, సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పంపడం కుదరదని తేల్చి చెబుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు వెంటనే లేఖ కూడా రాసింది. ఇలా సమన్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా వ్యాఖ్యానించింది.
బంగాలో ఆటవిక పాలన:అమిత్ షా
నడ్డాపై దాడిని హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఏలుబడిలో అస్థిర, చీకటి శకంలో జారిపోతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దౌర్జన్యం, అరాచకం రాజ్యమేలుతున్నాయని ట్వీట్ చేశారు. ఇలా ఉంటే అమిత్ షా ఈ నెల 19, 20 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తారని సమాచారం.
నేను నీరోను కాను : ధన్కర్
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సం నాడే బీజేపీ నేత నడ్డా కాన్వాయ్ పై దాడికి దిగడం దురదృష్టకరమని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూంటే రాజ్ భవన్ లో రోమన్ చక్రవర్తి నీరోలాగా ఫిడేల్ వాయిస్తూ కూర్చోలేనని గవర్నర్ జగ్ దీప్ ధన్కర్ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లఘించేవారికి సీఎం రాజకీయ, పోలీసు, పాలనాపరమైన రక్షణ కల్సిస్తూ రాజ్ భవన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు