- ఉద్రిక్తంగా నిమ్మాడ, కోటబొమ్మాళి
- అరెస్టును ఖండించిన చంద్రబాబు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టులు, దాడులతో రక్తికట్టిస్తున్నాయి.ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుతో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిమ్మాడలోని ఆయన నివాసంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కోటబొమ్మాళి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కోటబొమ్మాళి సెషన్స్ కోర్టులో ప్రవేశ పెట్టగా ఈ నెల 15 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో శ్రీకాకుళం సమీపంలోని అంపోలులో ఉన్న జిల్లా జైలుకు తరలించారు.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నిమ్మాడలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ బలపరిచిన అచ్చెన్నాయుడు బంధువు పక్క గ్రామంలోని వారితో కలిసి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల పట్ల స్ధానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థితో పాటు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సహా పలువురు నేతలు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితులు అదుపుతప్పి ఉద్రిక్తతలకు దారితీయడంతో భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ అభ్యర్థిని దగ్గరుండి తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. ఈ నేపథ్యంలో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో 22 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 12 మందిని నిన్న (ఫిబ్రవరి 1) అరెస్టు చేయగా అచ్చెన్నాయుడిని ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: వ్యక్తులు మారినా న్యాయం మారదన్న చంద్రబాబు
మండిపడ్డ టీడీపీ
అచ్చెన్నాయుడి అరెస్టుతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టుకు జగన్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన తోపులాటలో టీడీపీ నేతలపై మాత్రమే కేసులు పెట్టారని, వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేసి ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అరెస్టులతో ఉత్తరాంధ్రలో విధ్వంసాలు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
బాబాయి అరెస్టు అక్రమం-రామ్మోహన్ నాయుడు
ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన నాయుడు అన్నారు. బెదిరింపులకు పాల్పడిన వారిని పోలీసులు వదిలేవేశారని టీడీపీ అధ్యక్షుడ్ని అరెస్టు చేయడం దారుణమని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :జగన్, చంద్రబాబు మధ్య నలుగుతున్న ఆంధ్ర ప్రజానీకం