Sunday, December 22, 2024

ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

  • నిమ్మగడ్డతో ఏపీ సర్కార్ దోస్తీ
  • మార్చిలోపే అన్ని ఎన్నికలు

ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాలు నీళ్లలా కలిసిపోయారని అంటున్నారు విశ్లేషకులు. సంవత్సరకాలంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న నిమ్మగడ్డ, సీఎం జగన్  మోహన్ రెడ్డిలు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇరువురికి మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ లకు పలుమార్లు లేఖలు రాశారు. అపుడు ఎస్ఈసీ తో భేటికి సుముఖత చూపని ఉన్నతాధికారులు ఇపుడు పిలవకుండానే ఎస్ఈసీ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఒకే రోజు రెండు సార్లు భేటి:

పంచాయతీ ఎన్నికలు రెండో దశకు చేరుకున్న తరుణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా జరిపించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఎస్ఈసీకి వర్తమానం అందించారు. ఇదే విషయంపై చర్చించేందుకు నిన్న(ఫిబ్రవరి 11) ఉదయం ఎస్ఈసీతో భేటీ అయిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ లు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. సాయంత్రం తిరిగి భేటీ అయి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు లిఖిత పూర్వక అంగీకారాన్ని తెలియజేశారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పై ఎస్ఈసీ ఆంక్షలు

ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది.  గత సంవత్సరం కరోనా నేపథ్యంలో అర్థాంతరంగా ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పాత వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతారా అనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చజరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారనగా పుర పాలిక, నగరపాలిక సంస్థల్లో కార్పొరేటర్ స్థానాలకు వేసిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. జడ్సీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలయ్యాయి. అపట్లో జరిగిన ఏకగ్రీవాలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడి ఏకగ్రీవాలను నమోదు చేసిందని ప్రతిపక్షాలు ఎస్ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. అసలు అప్పటి ఎన్నికలను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయం ఎలాఉంటుందోనని ఆసక్తికరంగా మారింది.

మంత్రుల వ్యాఖ్యలతో తలనొప్పులు:

అంతేకాకుండా ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకిస్తే కోర్టులు చుట్టూ తిరగడం, ఖర్చుల రూపేణా కోట్లాది రూపాయల నిధుల వృథాకానున్నాయి. మరోవైపు రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ ను మంత్రుల దుర్భాషలాడటంతో ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజుల్లో వెళ్లిపోయే ఎన్నికల కమిషనర్ తో వివాదాలు కొని తెచ్చుకుంటే వచ్చేది ఏముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: తొలి దశలో మాదే పై చేయి

సయోథ్య అందుకేనా?

ప్రభుత్వం అంగీకారం తెలిపినా తెలపకున్నా నిమ్మగడ్డ తనపని తాను చేసుకుపోతున్నారు. మార్చి నెలాఖరునాటికి అన్ని ఎన్నికలను నిర్వహించి రిటైరవ్వాలని నిమ్మగడ్డ యోచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే కోర్టుకెళ్లి తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు కూడా నిమ్మగడ్డ వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తే ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి ఎన్నికలు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే అధికార వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మధ్యే మార్గంగా ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీకి అంగీకారం తెలిపిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Also Read: మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

నిమ్మగడ్డ కింకర్తవ్యం?

ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార, ప్రతిపక్షాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.   

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles