- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు
- ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో పనిచేశారని కితాబు
ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు తనవద్ద సమయం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. 4 వారాలు ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ లో నిమగ్నమయ్యారని ఎస్ఈసీ తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేనని ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా వచ్చే ఎస్ఈసీపై ఎన్నికలు నిర్వహించే బాధ్యతలు ఉంటాయని తెలిపారు.
పెరుగుతున్న కరోనా కేసులు:
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిచిపోయిన దగ్గర్నుంచే నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఈ నెల 30న మరోసారి విచారణ చేపట్టనుంది. అంతేకాదు ఈ నెల 31తో తన పదవీకాలం పూర్తవుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కొత్తగా వచ్చే కమిషనర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఎన్నికలను ప్రస్తుత పరిస్థితులలో నిర్వహించలేమని స్పష్టం చేశారు.
Also Read: తిరుపతిలో సెగలు రేపుతున్న ఉపఎన్నిక
ఏకగ్రీవాలపై ఫిర్యాదు చేసుకోవచ్చన్న ఎస్ఈసీ:
మరోవైపు ఏకగ్రీవాల అంశంపైనా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారన్న నిమ్మగడ్డ, హైకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు విశేష కృషి చేసిన అధికారులు:
ఎన్నికల నిర్వహణ విషయంలో పోలీసులు అధికార యంత్రాంగం ఎంతో శ్రమపడ్డారని ఎస్ఈసీ కొనియాడారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు.