- వ్యక్తిగత దూషణలు చేస్తున్న మంత్రులు
- కోర్టు తీర్పులను పట్టించుకోని వైనం
- ప్రజాస్వామ్యంపై సన్నగిల్లుతున్న విశ్వాసం
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముహుర్తాన నోటిఫికేషన్ విడుదలయిందో కాని అప్పటి నుంచి ఎన్నికల సంఘానికి, జగన్ సర్కారుకు మధ్యే ఉత్కంఠ పోరు నడుస్తోంది. విఠాలాచారి సినిమాను తలదన్నేలా ఒకరికొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అంతకు మించి విలువైన సమయాన్ని వృధా చేస్తూ కోర్టు మెట్లెక్కారు. సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా పంతం వీడటంలేదు. పట్టిన పట్టు వదలడం లేదు. తప్పులు సరిదిద్దుకునేందుకు న్యాయస్థానాలు సమయం ఇచ్చినా అధికారులు తమ పంథాను ఏమాత్రం మార్చుకోవడంలేదు. అధికారుల తీరుతో ప్రభుత్వం, పాలనావ్యవస్థల పట్ల ప్రజల్లో చులకన భావం వ్యక్తమవుతోంది. ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిల్లుతోంది. రాజకీయాలపట్ల ఏహ్య భావం కలుగుతోంది. వ్యవస్థలను కాపాడాల్సిన వారే వాటిని భక్షిస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తొలిదశ సం”గ్రామం”
కోర్టు తీర్పులు బేఖాతరు:
వాద ప్రతివాదనల్లో కోర్టులో నెగ్గి ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్కడితో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడిందని అందరూ అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాని అసలు పంచాయితీ అప్పుడే మొదలయింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం వహించారని ఎస్ఈసీ వారిని పక్కన పెడుతుంటే ప్రభుత్వం వారికి కొమ్ముకాస్తోంది. తాజాగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎంవోలో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధులనుంచి తప్పించాలని ఆదేశిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. సాధారణ పరిపాలనా శాఖ అధిపతిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ప్రవీణ్ ప్రకాష్ సమీక్షలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో సీఎస్ ను కోరారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై “పంచాయితీ”
సీఎం ఫొటోలు వద్దంటూ సీఎస్ కు లేఖ :
ఎన్నికల సందర్భంగా జారీ చేసే కులధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు తొలగించాలని ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. కుల ధృవీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల కోడ్ కి విరుద్ధమని ఎస్ఈసీ స్పష్టం చేశారు. అలాగే పత్రాల జారీలో జాప్యంలేకుండా చూడాలని కోరారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులపై గవర్నర్ కు ఫిర్యాదు:
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘంపై సజ్జల చేస్తున్న విమర్శలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిలు అనుచిత విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు గవర్నర్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ తెలిపారు.
ఇదీ చదవండి: సర్కార్ జీవోతో నిమ్మగడ్డ అప్రమత్తం