- గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్ఈసీ
- జిల్లా కలెక్టర్లను నివేదిక కోరిన నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల్లో అక్రమ ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్యలు చేపట్టారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై నిమ్మగడ్డ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రోత్సాహక నిధుల పేరిట జరుగుతున్న ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తోంది. సహజ పద్దతుల్లో జరిగే ఏకగ్రీవాలను అడ్డుకోబోమని ఎస్ఈసీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దౌర్జన్యంతో జరిగే బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం ఉపేక్షించేది లేదని నిమ్మగడ్డ హెచ్చరించారు. ఇందులో భాగంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నివేదిక కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు భిన్నంగా ఉన్నాయని ఎస్ఈసీ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లనుంచి నివేదికలు పరిశీలించిన తరువాతే కమిషన్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ తెలిపారు.
గుంటూరు జిల్లాలో 67 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం:
తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో తెనాలి డివిజన్ లో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో 337 సర్పంచి స్థానాలకు గాను 67 సర్పంచి స్థానాలకు ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవాలయ్యాయి. 63 చోట్ల అధికారపార్టీకి చెందిన వారు ఏకగ్రీవం కాగా మూడు చోట్ల మాత్రం టీడీపీ మద్దతు ప్రకటించిన వారు ఏకగ్రీవాలయ్యాయి. నామినేషన్ల సందర్భంగా ఎక్కువమంది నామినేషన్లు వేసినా ఉపసంహరణ రోజున వెనక్కి తీసుకోవడంతో ఏకగ్రీవాల సంఖ్య అమాంతం పెరిగినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
చిత్తూరులో 112 ఏకగ్రీవాలు:
చిత్తూరు జిల్లాలోని చిత్తూరు డివిజన్ లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. చిత్తూరు డివిజన్ లో 112 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార పార్టీ మద్దతు దారులు 95 మంది కాగా, టీడీపీ మద్దతుదారులు తొమ్మిది మంది స్వతంత్రులు ఎనిమిది మంది ఉన్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులకు ఏకగ్రీవాలయినా వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసిన వారు ఉపసంహరించుకోకపోవడంతో ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏకగ్రీవాలపై ఎసీఈసీ జోక్యం తగదు:
ఏకగ్రీవాలపై ఎస్ఈసీ హడావిడి చేస్తున్నారని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు ఆయా పంచాయతీలు ఏకగ్రీవాలు చేసుకుంటుంటే ఎన్నికల సంఘం ఎందుకు జోక్యం చేసుకుంటోందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: మంత్రుల దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్