• ప్రారంభమయిన తొలి విడత నామినేషన్ల ప్రక్రియ
• రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లో ఎన్నికలు
• ఫిబ్రవరి 9న పోలింగ్
తొలి విడత పల్లెపోరు నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమయింది. మొదటి విడత ఎన్నికలకు ఈ రోజు (జనవరి 29) నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల (జనవరి) 31 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
ఇదీ చదవండి: పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్న ఎన్నికలు
ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు ఎలాగైన తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మండల, గ్రామ కమిటీల నాయకులతో పార్టీల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మండలాల్లోని దాదాపు 4 వేల గ్రామ పంచాయతీలలో తొలివిడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకిరించనున్నారు.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3249 గ్రామ పంచాయతీలకు వాటి పరిథిలోని 32504 వార్డులకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.
విజయనగరం జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరగడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు ఇవే : –
శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ,
విశాఖపట్నం జిల్లా : అనకాపల్లి,
తూర్పుగోదావరి : కాకినాడ, పెద్దాపురం
పశ్చిమగోదావరి : నర్సాపురం
కృష్ణాజిల్లా : విజయవాడ
గుంటూరు జిల్లా : తెనాలి
ప్రకాశం జిల్లా : ఒంగోలు
నెల్లూరు జిల్లా : కావలి
కర్నూలు : నంద్యాల, కర్నూలు
అనంతపురం : కదిరి,
కడప జిల్లా : జమ్మలమడుగు, కడప, రాజంపేట
చిత్తూరు జిల్లా : చిత్తూరు
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై “పంచాయితీ”