దిల్లీ : పోలవరం విషయంలో చిక్కుముడులను విప్పుతున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారంనాడు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, పోలవరంపైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామంటూ అనిల్ , రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర వ్యాఖ్యానించారు. పక్షం రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్రమంత్రి చెప్పారని వారు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపైన సవరించిన అంచనాలను ఆమోదించాలని ఇద్దరు ఆంధ్రప్రదేశ్ మంత్రులూ కేంద్ర జలశక్తి మంత్రిని అభ్యర్థించారు.
వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మూడు రోజులుగా ఇద్దరు మంత్రులూ సమావేశాలు జరిపారు. ముఖ్యమంత్రి పంపిన వినతిపత్రాన్ని మంత్రులు శుక్రవారంనాడు జలశక్తి మంత్రికి అందజేశారు. 2017లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల కలిగిన ఇబ్బందులను కేంద్ర మంత్రికి తెలియజేశామని అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి భాగాన్ని తీసివేయకుండా ఉండాలనీ, అది చట్టప్రకారం తమ హక్కు అనీ కేంద్ర మంత్రికి వివరించినట్టు బుగ్గన, అనిల్ కుమార్ తెలియజేశారు. సవరించిన అంచనాలు ఆమోదించడానికి కేంద్ర మంత్రి సుముఖత వెలిబుచ్చారనీ, ప్రాజెక్టు అనుకున్న గడువులోగానే పూర్తవుతుందనీ వారు చెప్పారు.