ఎస్ సీ ఎస్ టీ సబ్ ప్లాన్ అమలును పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదివారంనాడు ఒక ఆర్డినెన్స్ ను జారీ చేశారు. ‘‘ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ (ప్లానింగ్, అలొకేషన్ అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫినాన్సియల్ రిసోర్సెస్)(అమెండ్ మెంట్) ఆర్డనెన్స్, 2023 ను ఆంధ్రప్రదేశ్ గెజెట్ లో ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషలలో ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నం. 1 ఆఫ్ 2023గా ప్రచురిస్తారు’’ అని ఆంధ్రప్రదేశ్ లా డిపార్ట్ మెంట్ ఆదివారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. దీని స్థానంలో చట్టం చేయడానికి రాష్ట్ర శాసనసభలోబిల్లు ప్రవేశపపెడతారు.
2013 జనవరి 23న అమలులోకి వచ్చిన ఎస్ సీ ఎస్ టీ సబ్ ప్లాన్ చట్టం పదేళ్ళ గడువు రేపటితో తీరిపోతుంది. 2017లో చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం సవరించినప్పుడు గడువును ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్ లో గడువు తీరిపోకముందే ఆర్డినెన్స్ రావాలని అక్కడి దళిత ప్రతినిధులతో, రాజకీయ నాయకులతో, ఐఏఎస్ అధికారులతో తెలంగాణ దళిత మేధావి, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థాపక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య గత రెండు మాసాలుగా తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఒక రోజులో గడువు ముగుస్తుందనగా ఆర్డినెన్స్ జారీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నిలబెట్టుకున్నది.