- ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశం
- ముగ్గురు సభ్యుల బృందం ఎస్ఈసీతో భేటీ కావాలన్న కోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం ఎస్ఈసీతో భేటీ కావాలని న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని కోర్టు తెలిపింది. అధికారుల బృందం ఎస్ఈసీతో చర్చించిన అంశాలను కోర్టుకు నివేదించాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను 29న చేపడతామని వెల్లడించింది.
ఎస్ఈసీతో భేటీకానున్న అధికారులు?
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై అధికారుల బృందం ఎస్ఈసీతో చర్చించనున్నట్లు సమాచారం. అధికారులతో సంప్రదింపుల తర్వాత ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేస్తారని కోర్టు స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ కు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే హైకోర్టుకు తెలిపింది.
ఇదీ చదవండి:స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమయిన నేపథ్యంలో కరోనా పరిస్థితులు, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.